మునుపటి నా మాట
ఇ’సుమన్’తైనా కోపం ఉందేమో అని ఎంత తేరిపార చూశినా ఆ ముఖంలో అప్పుడు కనపడేదే కాదు ... ఇంక ఇప్పుడు అలా వెతకడం అసలు వీలు పడదు. విధికి కోపమొచ్చి విధి లేక ఆ ముఖాన్ని చాటు చేసింది. మూడు పదుల వయసులోనే అక్షరాల ఆకుల తోడుగా విధి విన్యాసాల ముళ్ళనేవి బాధిస్తాయి జాగర్త అంటూ హెచ్చరిస్తూ విరబూసిన టీవీ గులాబీ ‘సుమన్’ ....విధి వీధి విహారానికి ఈ నలభై అయిదు ఏళ్ళ వయసునే ఎంచుకోవాలా? కుంచె పట్టి రంగుల ముంచి బొమ్మలు గీశాడు. మంచి పాత్రలు సృష్టించి బుల్లి తెర మీద కదిలే బొమ్మలు చూపించాడు. ఇలకు దిగిన అలల సముద్ర నిర్దేశకుడు చంద్రుడి ముద్ర ఉన్న దర్శకుడై ఇలా అలా ..ఇలా కాదు అలా , అలా కాదు ఇలా అని పాత్రధారుల నుంచి హావభావ తరంగాలు రాబట్టుకున్నాడు. కంచికి పోలేని కథలు అల్లాడు. తూచి తూచి మాటలు పేనాడు. ఎంచి ఎంచి భావ స్పూర్తి కలిగించే పాటలు రాశాడు. స్వరాలు అందించాడు. అమెరికా లో చదివిన కమ్యూనికేషన్ చదువుని ఆంధ్రలో సక్రమంగా ఉపయోగించాడు. కొత్త పద్ధతులతో తెలుగు టీవీ లకి కొండంత మార్గదర్శి అయ్యాడు. ఆఫీసు బాధ్యతలు ఆ రెండు భుజాలమీదే అవలీలగా మోశాడు. తాను రామోజీరావు కుమారుడైనా తన వంతు జన్మ సార్ధకతగా, తానుగా తన బహుముఖ ప్రతిభని ఒక కళాకారుడిగా నమ్ముకున్నాడు. రాజేశ్వరరావు కుమారుడు వాసూరావు, టి.వి. రాజు కుమారుడు రాజ్, కోదండపాణి కుమారుడు ఈశ్వర్ ...వీరందరినే కాక మాధవపెద్ది సురేష్, ఆర్ పి పట్నాయక్ వంటి స్వర కర్తలని ఇంటింటి టీవీ సీరియల్స్ ద్వారా గృహ ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాడు. జానకి, బాలు, మనో ల వంటి జగమెరిగిన గళాలతో పాటు జనం సగమెరిగిన సునీత,కౌసల్య,లలితా సాగరి, గోపికా పూర్ణిమ, కల్పన, నిహాల్, మల్లికార్జునరావు, సాందీప్ వంటి గళాలకి పూర్తిస్థాయి హోదా ఇచ్చాడు.
యశోదా నందనుడి పాత్ర పోషించాలని ముచ్చటపడ్డాడు. ఆ పాత్రలోనూ బావుంటాను చూడండి అని కనుసైగ చేశాడు. ఇప్పుడు యశోద (ఆసుపత్రి) ఒడిలో కన్ను మూశాడు. బహుముఖ ప్రజ్ఞని ద్విపాత్రాభినయంతో ద్విగుణీకృతం చేశాడు. తన పాత్ర అయిపోతోంది అని గ్రహించాడు. అయిపోయింది. అయిదేళ్ళు అనారోగ్యం అతన్ని ఆట పట్టించింది. ఓడిపోయాడు. విధి అల్లిన పద్మవ్యూహంలో అభిమన్యుడు ఒరిగిపోయాడు. ఇంతకాలం మౌనరాగాలు ఆలపించాడు. సుఖదు:ఖాలు ఇవీ అని గుర్తు చేశాడు. మన ప్రతిబింబాలు మన అంతరంగాలు సుమా అని హెచ్చరించాడు. ఇంత వరకూ చెప్పి తన అలౌకిక స్నేహ హస్తం ఇంక చాచడం వీలు పడదని ‘దూరంగా దూర దూరంగా’ ‘నీలాంబర వీధి నుంచి’ పిలుపందుకొని వెళ్ళిపోయాడు. భూమ్మీద ఒక పువ్వు తనువు రాలిపోయింది. సుమన్ ఇప్పుడు గగనంలో సూర్య కుసుమం. సాటిలైట్ ప్రసారంతో మాన్యులకీ, సామాన్యులకీ సాటిలేని లైట్ హార్టెడ్ పెర్సనాలిటీ గా గుర్తుండిపోయిన సుమన్ త్ర ముగ్ధుడా ఏ వెల్గులకి నీ ప్రస్థానం? ‘ఈ ఉషాకిరణాలు’ రోజూ నీకు పునర్జన్మ నిస్తుంటాయి. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 07 సెప్టెంబర్ 2012 (ఆల్ బొమ్మలే- తెరిచి చూడండి. ఈటీవీలోని సీరియల్ సుమన్ ప్రతిబింబాలే కనిపిస్తాయి. ఈనాడు ఆదివారం సంచిక జనవరి 22, 2012 తరువాత సుమన్ సీరియల్ ప్రకటనలు వెలువడలేదు. గమనించండి.)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|