మునుపటి నా మాట
ఏమిటో... ఒక వైపంతా టీవీ చానెళ్ళ గోల! మరో వైపు మొబైళ్ళ రొద! ఇంకొందరికి కంప్యూటరూ, ఇంటర్నెట్టూ....పిచ్చి పిచ్చిగా ఉంది కదండీ ఈ ప్రపంచం, విశ్వం గారూ’ ‘గట్టిగా అనకండి లోకనాథం గారూ. మనవలు వింటే మనల్ని వేరే గ్రహం నుంచి ఊడిపడిన జీవుల్లా చూస్తారు. అయినా ఒక్క క్షణం టీవీ గానీ, మరేదైనా గాని లేని చోట ఒక్క గంట ఉండనిస్తే మీరు ఉండగలరా చెప్పండీ. చుట్టూ సందడిగా ఉన్నా మనలో మనం నిశ్శబ్దం అనేది సృష్టించుకోవాలి. మనకెంతవరకు అవసరమో అంత వరకే ఈ పరికరాలు ఉపయోగించాలి.’ ‘ఉపయోగం అంటే గుర్తొచ్చింది- సెల్ ఫోన్ ఒకటండి... మా చెడ్డ విసిగిస్తోంది ...మనం కూడా సంచి పట్టుకు వెళ్లి మార్కెట్టు చేసే వాళ్ళం. అవునా? ఏఏ సామాన్లు కావాలో అడిగి గుర్తు పెట్టుకునో, లేదా చీటీ మీద రాసుకునో వెళ్ళే వారం కదా. ఇప్పుడు అలా లేదండీ- భర్త ఫుడ్ బజార్ లో ఒక్కో వస్తువు చూస్తూ భార్యని సెల్ ఫోన్ లో క్షణం క్షణం పలకరిస్తూ ‘తేనా? వద్దా?’ లాంటి ప్రశ్నలు వేసి మరీ కొంటున్నాడు. అదే జబ్బు- పిల్లలకి సైతం వచ్చేస్తోంది.
కొందరికైతే అవతల వ్యక్తి మీద ఉన్న కోపాన్ని సెల్ ఫోన్లో గట్టిగ్గా రంకెలు వేస్తూ వ్యక్తం చేసే అలవాటుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇలాంటి వ్యక్తి పెడుతున్న కేకలకి ఆ మహదేవుడు నిజంగానే శివతాండవం ఆడతాడేమో అని మొన్న శివరాత్రికి అక్కడికెళ్ళి భయపడ్డాను. కనీసం కోవేల్లోనైనా ప్రశాంతంగా ఉండనీరు! పెళ్లికో, అబ్దికానికో అయ్యవారిని పిలిస్తే ఆయనా మంత్రాలు ఆపేసి సెల్ లో ఊ ఒకటే నస!’ ‘సరే- టీవీ దుస్థితి కూడా చెప్పండి. కుతూహలంగా ఉంది, మీరలా ఈ ఎండా కాలంలో మండి పడుతుంటే, ఎండ గడుతుంటే. ’ ‘ఏవండీ---మనం టైము దొరికి చూస్తే చూసేది మహా అయితే ఓ పది చానెల్స్ కదండీ, దానికి పోయి ఓ వంద చానెళ్ళు ఎందుకూ దండగ గానీ. ఇంచుమించు ఒక చానెల్ లో అడ్వర్ టైజ్ మెంట్ ఉందని పక్క చానెల్ కి పొతే వెధవది అక్కడా ఓ అడ్వర్ టైజ్ మెంటే. ‘టూటా ఎర్త్’ వాడు ‘సప్తగిరి’ ఇవ్వడు. ఏమిరా ఇవ్వవూ అంటే వ్యూయర్స్ లేరు సార్ అని అన్నాడు. వీడి దుంప తెగ- ఒళ్ళు మండి ఎప్పుడొచ్చి సర్వే చేశావురా అని తిట్టి పోశాననుకోండి. ‘ఆటీవీ’ వాడికి తెల్లవారు ఝామున పాత పాటలివ్వడం హాబీ. ఒకసారి మేలుకునీ చూస్తే..వాడి దుంప తెగ, మర్నాడూ అవే పాటలు. ఛీ ఛీ అని ముసుగు తన్ని పడుకున్నా. పాత సినిమా అనగానే రాత్రి ఏ పదకొండున్నరా ఆ ప్రాంతాల్లో ఇస్తాడు. లాభం లేదని తొమ్మిది కల్లా ఏదో ఒక న్యూస్ చానెల్ చూసి ఆ రోజుకి చాలు అని సర్ది పెట్టుకుంటా.’ ‘న్యూస్ అనే కన్నా న్యూసెన్స్ చానెల్స్ అందురూ. ఈ వార్త మొట్ట మొదట మేమే సమర్పిస్తున్నాం అని గప్పాలూ. తీరా అది కాస్త అభ్యంతరకరమైతే మళ్ళీ దాని జోలికి పోరు. ‘ఒకడు బోరు బావిలో పడిన బాలుడు.. ఆస్పత్రికి తరలింపు’ అని వేస్తాడు. పక్క చానెల్ వాడు ‘బోరు బావిలో పడిన బాలుడి ప్రాణాలు దక్కక తల్లి భోరు భోరు’ అని ప్రకటించేస్తాడు. ఏది ముందు ఏది వెనుక? ఏ చానెల్ లో ఏముందో ఎవరికెరుక? ఈ టీవీ చానెళ్ళ బాధ పడలేక నేను నెట్టునుంచి గూగుల్ న్యూస్ చూస్తాను, అదే..... చదువుతాను. కనీసం అక్కడైతే ఏదో ఒక వార్త సరిగ్గా ఉంటుంది. ఉన్న మాట చెప్పండి లోకనాథం గారూ... తెలుగు న్యూస్ పేపర్ లెన్నో వస్తున్నాయి కదా. అన్నీ కొని చదవగలుగుతున్నామా? లేదు కదా. కనుక నా చిట్కా పాటించండి. ప్రతి ఒక్క ‘ఈ పేపర్’ ఉదయం కంప్యూటర్లో చూసి ఆ తరువాత వివరంగా చదివేందుకేవైనా విశేషాలున్నట్టనిపిస్తే అప్పుడు బయటకి వెళ్లి ఆ పేపరు మాత్రమే కొని తెచ్చుకుంటాను. సాహిత్యం, సినిమా, సంగీతం నాకు ఇష్టమని చెప్పి అన్ని పేపర్లూ రోజూ ఏదో ఒకటి రాస్తూ కూర్చోవు కదా. అదండీ సంగతి.’ ‘విశ్వం గారూ, పూర్వం హాయిగా నాళం వారి సత్రంకో, కన్యకా పరమేశ్వరి కోవెలకో పోయి అక్కడ లైబ్రరీ అరుగుల మీద అన్ని పేపర్లూ చదివి వచ్చేవారం. ఇప్పుడు వెధవది కంప్యూటరూ, ఇంటర్నెట్టూ ఇవే మన లైబ్రరీలు. పాపం కాళీపట్నం వారు ఎంత శ్రమ పడుతున్నారో కదా..కథానిలయం స్థాపించి ఎక్కడలేని కథలన్నీ కంచికి కాకుండా శ్రీకాకుళం చేరేలా చూసున్నారు. అలా అక్కడికి వెళ్లి చదివే వారికన్నా అదీ ఇదీ తీసి పీ హెచ్ డీ లు సంపాయించేస్తున్నవారే ఎక్కువట.’ ‘నిజమేనండీ లోకనాథం గారూ. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు నెట్ లో ఇట్టే లభ్యం అని ఎందరికో అపోహ ఉంది. కొన్ని పత్రికలవారు ఊరించి ఊరించి ముఖ చిత్రం, లోపలి పేజీలు ఒకటీ అరా ఇచ్చి పత్రిక ‘కొని’ చదవండి అంటారు. ఎన్ని పత్రికలు కొనగలం? మంచు, వర్షం, స్నేహం, ---ఇలా సినిమా పేరుల్లా పుట్ట గొడుగుల్లా ఎన్నో వార పత్రికలు వస్తున్నాయి. కొన్ని పేపర్లు, పత్రికలూ చేసే పని ఏమిటో తెలుసా? నెట్టు నుంచి అది లాగి ఇది లాగి ఏదో ఆ వారం మేటరు సాధించి ప్రచురించాం అన్నట్టు ఉంటాయి. ఆ రకంగా పోనీ లెండి... సాహిత్యం,సంగీతం ఇలాంటివి కొన్ని పేపర్లలో ఇంకా కనిపిస్తున్నాయి. సంతోషించదగ్గ విషయమే. ఇక పాత సినిమాల గురించో, పాత పాటల గురించో టీవీ మీద ఎందుకండీ ఆధార పడడం? హాయిగా నెట్టులో ఎన్నో లభ్యమౌతుండగా! నాగయ్య గారి వందేమాతరం నుంచి నాగేశ్వరరావు దేవదాసు నుంచి నాగార్జున షిరిడి సాయి వరకూ ...దొరకని వంటూ లేవనుకోండి. అంతెందుకూ... ఇటీవల కన్ను మూసిన మన డాక్టరు గారు, గొప్ప సంగీత మేధావి పినాకపాణి గారి గానం వినాలంటే మన ఇంట మన కళ్ళ ముందే ఈ నెట్టు సాధించి పెట్టి మేలు చేస్తోంది. పాత పాటల పుస్తకాలో, లేదా పోస్టర్లో చూడాలని అనిపిస్తే తగినన్ని వెబ్బులు ఆ ముచ్చట తీరుస్తున్నాయి.’ ‘కావొచ్చునండీ.. వాటితో పాటు ఒక సైడ్ చెత్త కూడా పోగవుతూ ఉంటోంది కదా.. ఈ మధ్య మరీ బరి తెగించేస్తున్నారండీ. అంగనల అర్ధ నగ్న దృశ్యాలు న్యూస్ తో ఇవ్వడం తగునా చెప్పండీ? టీవీలో వేస్తె ఏదో చానెల్ మార్చేస్తాం. నెట్ లో ఇంకా లొట్టలేసుకు చూడడం అనేది ఎక్కువౌతుంది కదండీ.’ ‘కన్ను చీకటి కోరుకోదు. ఎప్పుడూ కంటికి దృశ్యమే పండుగ. అది మన మనసు చేస్తున్న తమాషా. ఎవరికి దేని మీద మనసో అది అందుబాటులో ఉండేలా చేస్తోంది నెట్టు. వదిలేయండి మీకు నచ్చనివి... చూసీ చూడ నట్టు! కావాల్సింది చూసుకోండి. హోటల్ వాడు మెనూ కార్డ్ పెట్టాడు కదా అని అన్నీ సాంపిల్ ఇవ్వవోయ్ అని అడగం కదా. కావాల్సింది అడిగి వడ్డించుకుంటాం. అడిగింది లేకపోతే ఉన్నదాంతో సర్దిపెట్టుకుంటాం. నెట్టులో మనకి అవసరమనిపించే అంశాన్ని సెర్చ్ కమాండ్ ఇచ్చి సాధించుకోవచ్చు.’ ‘ఒక్కోసారి సెర్చు లతో టైము వేస్ట్ అవుతుందట కదండీ. ఒకటి అడిగి మరోటి చదివి, ఆ మరో లోంచి ఇంకో లోకి పోతూ ఇలా...’ ‘బాగా టైము ఉంటేనే అలా చేసేది. టైం మేనేజ్మెంట్ తెలిసినవాడు అలా చెయ్యడు. ఎంతో వైవిధ్యమైన సరంజామా అందుతోంది కదా అని అదే పనిగా అన్నీ వెతుకుతూ కూర్చుంటే ఎలా? చూడండీ... ఒక వార్త తెలిసింది...టెలిఫోన్ సత్యనారాయణ అనే సినీ పరిశ్రమకి చెందిన విశిష్ట వ్యక్తి మరణించినట్టు. అలా ప్రత్యేకంగా ‘టెలిఫోన్’ అని చేర్చక ‘సత్యనారాయణ’ అని సెర్చ్ చేస్తే ...విశ్వనాథ సత్యనారాయణ, కైకలూరు సత్యనారాయణ, గరిమెళ్ళ సత్యనారాయణ ..అని మూడు పేర్లు దర్శనమిచ్చాయి. ఒకరు కవి సామ్రాట్. ఇంకొకరు ‘యముండ’ అని మీసాలు దువ్వే సత్తిన్నారాయణ, మూడో ఆయన ఒకనాటి ప్రసిద్ధ రచయిత. మన లిపి కారుడు, ఆర్టిస్టూ అయిన బాపు గారి అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ కదా. . సత్తిరాజు అని అడిగితే సెర్చ్ ఫెయిల్ అవ్వొచ్చు. పోనీ బాపు అని అడిగారే అనుకోండి, మహాత్ముడే ముందు సెర్చ్ లోకి వస్తాడు కాని మన బొమ్మల బాపు రారే!’ ‘సరి సరి...మీరు బొత్తిగా ఇంతలా ఆధునికం మాయలో పడిపోతారని అనుకోలేదు సుమండీ. ఇంకా ఈ మెయిలూ గట్రాలు కూడా నేర్చేసుకున్నారా ?’ ‘ఏదీ ..మనవడు రాత్రి ఎనిమిదికి భోజనం చెయ్యాలంటే నేను ఏడూ యాభైకి వాడికో మెయిలిస్తా. వాడు ఏడూ యాభైమూడుకి నాకు ఎస్సెమ్మెస్ చేస్తాడు...తాతయ్యా, నువ్వు మజ్జిగాన్నం తింటూ ఉండూ, నే వస్తా అని’ ‘అయ్యో..అయ్యో..ఇదెక్కడి చోద్యమండీ విశ్వం గారూ. వాళ్ళ వీపు మీద నాలుగు వడ్డించక...ఇదెక్కడి మార్పండీ?’ ‘మరీ ..మనవాళ్ళు ఇలా మనల్ని చీటికీ మాటికీ వీపులు బద్దలు కొట్టి ఏం సాధించారు లెండీ లోకనాథం గారూ? నిలబడితే దెబ్బ, కూచుంటే దెబ్బ, నవ్వితే దెబ్బ, నలుగురితో మాట్లాడితే దెబ్బ...అబ్బబ్బ....చేతి దురుసు తనం కొందరిదైతే ..ఎక్కడలేని తిట్లతో కొందరిది నోటి దురుసుతనం...ఏమో నండీ లోకనాథం గారూ...మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా చూశారో తెలీదు కాని.. అయినా... రోజులు మారాలి కదండీ’ ‘నిజమే...కొందరిళ్ళలో మరీ ఎక్కువ ఆంక్షలుండేవనుకోండి. అయినా అవన్నీ మన మంచికోసమే కదా..’ ‘వాళ్ళు మాత్రమే మంచిగా ఉన్నారనుకోవడం, తరువాతి తరాలన్నీ ఉత్త చెత్తవనుకోవడం తగదు కదండీ.’ ‘ఈ తరం మాత్రం తగలడిపోతోంది విశ్వం గారూ...పిల్లలకి పెద్దల పట్ల గౌరవం లేదు. ఏదో కోపం పెంచుకునీ తెలుగులో ఒక ముక్క సరిగా రాకపోయినా పనికిరాని తిట్లు మాత్రం ప్రయోగించడం చేతనౌను వీళ్ళకి. ఇవన్నీ ఈ కాలం వారికి ఇంటర్ నెట్టే నేర్పిస్తోంది.’ ‘అది మీలో పడిపోయిన ముద్ర. అసలు అలాంటి వారికి ఆ ప్రోత్సాహం అందిస్తున్నవారిని ముందు తూర్పారబెట్టాలి. ఇవాళ చదువుకి మాత్రమే విలువిచ్చి సంస్కారానికి తిలోదకాలిచ్చేస్తున్న తల్లితండ్రుల్ని చెరిగేయాలి. పిల్లల్లో సంస్కారం పట్టుతప్పక ఉండాలంటే ముందు మన సంస్కృతి గురించి వాళ్ళ ముందు ఏహ్యంగా మాట్లాడడం మానాలి. అలాగే మన సంస్కృతి గురించి మరీ అతిగా చెప్పి ఇతరుల సంస్కృతిని కించ పరుస్తూ కామెంట్లు విసరడం మానాలి. అసలు టీవీ సీరియల్స్ వచ్చిన తరువాత ఒక పెద్ద అఖాతం ఏర్పడిపోయింది స్త్రీల మెదళ్ళలోనూ , కొందరు పురుషుల మెదళ్ళలోనూ. కిడ్నాపులూ, కుయుక్తులు, చాటు పెళ్ళిళ్ళు, దగాలు, మోసాలు, పిల్లల్ని బెదిరించడాలూ.....ఇవన్నీ బుర్రని అతలా కుతలం చేసేస్తున్నాయండీ. కొందరికి అవి తప్ప ఇతరత్రా ఏవీ నచ్చవు. కొందరికి క్రికెట్టే లోకం. ఇలా ఒక్క ఇంటిలోనే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క టీవీ ఉంటే ఇంక ఆ ఇంట సంత గోలే! అలాగనీ భక్తి పొంగి పొరలిపోయి అలాంటి చానెల్స్ చూస్తే అడుగడుగునా పాటలూ, ఉపన్యసాలూనూ. సీడీలతో మంత్రాలు రాలొచ్చునేమో గానీ అవి విన్నంత మాత్రాన పుణ్యం రాదండీ. మంత్రాలు అవగతం చేసుకునీ పఠిన్చాలి.’ ‘భలేవారే.. ఈ మంత్రాలైనా ఏదో సినిమాలో నాగార్జునో, రవితేజో, మహేష్ బాబో ఉచ్చరిస్తేనే వాటిని మిగతా వారు నమ్ముతున్నారు. ఇప్పటి సంస్కృతి పాడైపోవడానికి సినిమాలే కారణం లెద్దురూ విశ్వం గారూ’ ‘ఆగండాగండి... మన టైములోనూ సినిమాల్లో నాగేశ్వరరావు మాణిక్యవీణాం అని పాడితేనే కదా ఆ శ్యామలా దండకం మీద గురి కుదిరింది. రావణుడిగా రామారావు కనిపించినా ఆయన శివ దండకం స్తుతిస్తేనే కదా శివుడి మీద శ్రద్ధ పెరిగింది. ఒక రకంగా వినోదం ఇస్తూనే కొన్ని సినిమాలు కొంచెం సంస్కృతి పట్ల కూడా ఉత్సుకత చూపిస్తున్నందుకు మెచ్చుకోవాలి. మన కళ్ళ ముందు కనిపించే ఈ బొమ్మల మీదే ఎందుకండీ మన అక్కసంతా ఎప్పుడూనూ?. సినిమా ప్రపంచం అంటే అదొక పరిశ్రమ. మిగతా పరిశ్రమల పట్ల ఇచ్చే గౌరవం సినిమాకివ్వరెందుకూ? సినిమా ఇచ్చే వినోదం మనకి చాలా సౌకర్యంగా ఉంటోంది. ఆ దృష్టి తోనే సినిమా జీవుల జీవితాల్లోకి తొంగి చూసి అదీ సౌకర్యమిచ్చే వినోదంగా భావించడంతోనే వారి పట్ల ఎకసెక్కెం, ఎద్దేవా ఎక్కువైపోతున్నాయి. తతిమ్మా రంగాల్లో అంతా బాగానే ఉన్నట్టు ఏదో భ్రమ తప్ప అక్కడా కల్మషం ఉందని గ్రహిస్తే వీరిని మాత్రమే చులకనగా చూడడం అనే జబ్బు పోతుంది. మీరనవచ్చు- ఇదివరకటి కన్నా ఈ కంప్యూటర్లు వచ్చాకా సినిమా మహిళ శరీరం ఒక ప్రకటన వస్తువుగా మారిపోయిందని. ఒకప్పుడు విదేశాల్లో ఉన్న విచ్చలవిడితనం, నిర్లజ్జ ఇప్పుడు మన దేశానికీ పాకాయని. అయితే ...ఒకప్పుడు కంప్యూటరూ, నెట్టూ అనేవి లేనంత మాత్రానా అరాచికం, అమానుషత్వం, అసభ్యకరం,అత్యాచారం వంటివి లేకుండా ఉండేవా? ఇప్పుడూ ఈ కమ్యూనికేషన్లు పెరిగినా, వాటితో ఏ మాత్రం నిమిత్తం లేనట్టుగా ఈ అకారాలతో అతి తెలివి అనే మరో దౌర్భాగ్యం తలెత్తుతోంది. ప్రగతి, పురోగమనం అనేవి బుద్ధి వికాసం ద్వారా పొందిన ఫలాలైతే అధోగతి, తిరోగమనం అనే రాళ్ళు తగిలి అవి అడుసులోకి జారిపోతున్నాయి. మంచి చెడ్డలు ఎంచి చూడగ లోకమందు రెండు కులములు అని అన్నారు మన గురజాడ వారు. ఆయన కాలంలో కంప్యూటర్లు లేవు. అయితే....అప్పటి ఆచారాలు ఇప్పుడు లేవు. కాని- మంచి,చెడు అప్పుడెలా ఉండేవో ఇప్పుడూ అలాగే ఉన్నాయి.’ ‘ఇవాళ నన్ను తెగ దులిపేస్తున్నారు విశ్వం గారూ...ఇంతకీ నేనొచ్చింది ఎందుకంటే...మీ చెవుల్లో ఓ మాట వెయ్యాలని...పది రోజుల క్రితం ఓ వార్త చదివా...అదేదో టీవీ చానెల్ వాళ్ళు వందేళ్ళ సినీ ప్రస్థానంలో మీకు ‘ది బెస్ట్’ గా తోచేవాళ్ళని ఎంపిక చెయ్యండని ..ఎవరు వాళ్ళూ ..నెటిజనులా?.....వాళ్ళని అడిగారట. వీళ్ళు ...’ ‘తెలుసు...నేటి జనులంతా నెటిజనులే నండీ లోకనాథం గారూ.. మరో ప్రపంచం మరో ప్రపంచం.. అంటూ మనకాలంలో నినాదాలు చేసే వాళ్ళం చూడండీ... ఆ మరో ప్రపంచమే ఇప్పటి నెట్ ప్రపంచం. ఈ ప్రపంచం ప్రజానీకమే నెటిజనులు.’ ‘అంటే...సిటిజన్లు లాగ అన్నమాట’ ‘మనం సీనియర్ సిటిజన్లు అయినట్టు...మన వయసు వాళ్ళు కొందరు సీనియర్ నెటిజన్లు అయ్యారు తెలుసాండీ?’ ‘అయ్యో ..ఆ మధ్య పానకాలరావు ఇంటికి వెళ్ళా.. పాను ఓ కంట ఊ తెగ కొత్త సినిమా పాటలు చూస్తున్నాడు నెట్టు ముందు కూర్చునీ. కాసేపు ఇటు నా వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. అప్పుడే వాళ్లావిడకి కోపం నసాళం అంటింది.’ ‘ఒరియా భాషలో ఓ సామెత ఉంది ...బుడా కాలొకు బాసనా తెల్లో...అంటే ముసలి కాలంలో వాసన నూనె అని. పాను మరీ కుర్రవాడై పోతున్నాడని వాళ్లావిడ భయం కాబోలు. అయినా ...వయసు అయిపోతోందే అనే నిత్య చింతన అనవసరం. ఎన్టీ ఆర్, ఏఎన్నార్ అరవై వయసులోనూ కుర్రకారు లాగ నటించారు. మన తరం నటులు మన మనుమరాళ్ళ వయసున్న వాళ్ళతోనూ డాన్సులు చేశారు. ఇప్పటి తరం వాళ్ళు ఎలా డాన్సులు చేస్తున్నారో చూడాలని కాబోలు పానకాలు తాపత్రయం. ఎందుకో ఆవిడకి మాత్రం భయం. పైగా రిటైర్ అయ్యే ప్రతి వ్యక్తీ రంగు రంగు బనియన్లు వేసుకునీ వీధిని పడతాడాయే. కుర్రతనం కనపడాలని కుంచె పట్టి తలకి రంగు పూయడం ఎవరికి ఇష్టముండదు కనుక?’ ‘పానకాల రావుకి తిలోదకాలు ఇద్దాం. వినండి- నే చెప్పబోయేది. నెటిజన్లు ఫైనల్ గా మన నందమూరి తారక రామారావు గారిని ఈ వందేళ్ళలో ‘ది బెస్ట్ యాక్టర్’ అన్నారట. అటు దిలీప్ కుమార్, అమితాభ్ బచ్చన్, ఇలా ఇందర్నీ పక్కన బెట్టి ఎన్టీఆర్ గారినే ఎంచుకోవడం విశేషమే కదండీ’ ‘ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. నవరసాలు అందరూ ప్రదర్శించగలరు కానీ నటరత్న లాగ శ్రీకృష్ణుడు పాత్ర పోషించగల వారు ఈ వందేళ్ళ సినీ చరిత్రలో ఎవ్వరూ కనపడరు. అందుకే ఆయన మూర్తికి ఆరు బయట జనం ఎలా నీరాజనం ఇచ్చారో ఇంట ఇంటర్నెట్టు లోకంలో ఉంటూ నెటిజన్లు అంతే హారతి పట్టారు.’ ‘రెండో స్థానంలో...ఎవరాయనా... ఆ(....కమల్ హాసన్ నిలిచాడు’ ‘కరెక్టే- ఇండియాస్ సన్..కమల్ హాసన్.. చార్లీ చాప్లిన్ లాగ ప్రతి పాత్రలోనూ ఇమిడి పోయి ఆ పాత్ర పట్ల గౌరవం కలిగించే నటుడు ఈయన. ఒక తరం యువతకి రామారావు నచ్చితే, మరో తరం వారికి కమల్ నచ్చి తీరతాడు. అందుకే ఇచ్చారు నెటిజన్లు ఈ వీరతాడు!’ ‘సావిత్రి పేరులోనే త్రి అనే మాట ఉందనో ఏమిటో..పాపం ఈమెని నెంబర్ త్రీ లోకి తోసేశారు. నటీమణుల్లో శ్రీదేవిని ది బెస్ట్ అన్నారు.’ ‘మీనాకుమారిని కూడా కాదన్నారు కదూ. అసలు విషయం ఏమిటంటే సి.ఎన్.ఎన్, ఐ.బి.ఎన్ చానెల్ వాళ్ళు సంయుక్తంగా చెన్నైలో ఈ శోధన చేయించారు కాబట్టి అధిక శాతం దక్షిణ తారాగణం వైపే మొగ్గు చూపారేమో. నాకు తెలిసి- ది బెస్ట్ డైరెక్టర్ కూడా తమిళం వారో, మలయాళం వారో అయి ఉండాలి.’ ‘మీరన్నది నిజమేనండోయ్ విశ్వం గారూ.. మణిరత్నం ---ది బెస్ట్ దర్శకుడు’ ‘కచ్చితంగా తమిళం సినిమావే ఉత్తమోత్తమ చిత్రం అయి ఉంటుంది...’ ‘నిస్సందేహంగా....నాయగన్ సినిమా ది బెస్ట్ అట.’ ‘ఆ చేత్తోనే ఈ పేరు దిద్దండి...ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే...’ ‘ఏమిటి రాశారూ...ఇ ళ ..ఇళయరాజా...శభాష్ అండీ విశ్వం గారూ... ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలరు మీరు’ ‘తప్పండీ.. ఆవులిస్తే ఆవుల్నే లెక్క పెడతా గానీ..’ ‘భలే వారండీ.. మన పాత రోజుల జోకులు ఇంకా ఫ్రెష్ గా ఎలా వేస్తున్నారో..’ ‘జోకులకి పాతా కొత్తా అనేది ఏమిటండీ... నవ్వడానికి అవే దంతాలు కదలాలి ఎన్నేళ్ళైనా. ఇవన్నీ నెట్టు జోకులు కావని గ్రహించారు కదా.. అయినా మీరు మినపట్టుకి దగ్గరి వారూ, ఇంటర్ నెట్టుకి దూరం వారూనూ. జోకు గానీ మరేదైనా కానీ బావుందంటే ఈ రోజుల్లో ఏమంటారో తెలుసా?’ ‘అద్భుతం..ఆహా..అనే!’ ‘పాతరోజులు మారాయి... ఇప్పుడు కెవ్వు కేక! అంటారు.’ ‘ఎలా ఉండనండీ విశ్వం గారూ ఇంకా నవ్వు కోక?’ ‘అనంత్ శ్రీరాం లాగ భలే ప్రాస వేశారు లెండి మీరు.’ ‘ఎవరాయన? ప్రాసలంటే మనకి ఆరుద్ర గారు మాత్రమే తెలుసు’ ‘నీలో నేను నీతో నేను నా నీడలో నువ్వు నీ ఎదలో నేను నేనూ నువ్వూ నువ్వూ నేను నేనంటే నువ్వే నువ్వంటే నీ నవ్వే అంటూ అలా ఏదేదో అల్లుకు పోతూ రాస్తారు శ్రీరాం ..... పైగా మిమ్మల్ని సన్మానిస్తే ... మీ పేరు విశ్వం, శక్తికి మీరు అశ్వం, మీ పేరు హ్రస్వం, విశ్వమంటే మీరే సర్వస్వం ... అని మిమ్మల్ని గిలిగింతల పాలు చెయ్యగలరు. సరే వినండి ... ది బెస్ట్ రైటర్ ఎవరంటే తప్పకుండా కన్నదాసన్ పేరు వచ్చేదే. తమిళ కవి పాట చివర్లో ఎక్కువగా అమ్మా అని ఉపయోగిస్తాడు. ఈజీ ప్రాస అలాగే రాయాల్సి వచ్చేది తెలుగు డబ్బింగ్ రచయితలకి. మేళాలు మంత్రాలు మిన్నంటి మ్రోగెనమ్మా, అది చిలకే కాదు బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా ...అని ఒక పాటలో రావడం మీరు వినే ఉంటారు. అలాగే మరో పాటలో కంఠాన సూత్రాన్ని ముడివేయనా అని ఒకరంటే మరో పాటలో మెడలో కళ్యాణ మాల .. అని అన్నారు. అనువాదాల్లో నేటివిటీ దెబ్బ తింటుంది. అంతే కాదు ట్యూన్ ఇచ్చి పాట రాయించుకున్నా ఆ ట్యూన్ లోనూ నేటివిటీ ఛాయ లేక పాట ఏదోలా అతికినట్టే ఉంటుంది. ఒక్క స్వరబ్రహ్మ మహదేవన్ గారూ, వారి అనుచరుడు పుహళేంది మాత్రమే మినహాయింపు. తమిళులే అయినా వీరు తెలుగుని ఉన్నతంగా నిలబెట్టారు. అది దైవ సంకల్పం అని అనవచ్చు. అలాగే ఇప్పుడు టీవీ సుమ పుట్టుకతో మలయాళీ అయినా తెలుగు మాట్లాడడంలో దిట్ట. ’ ‘అయ్యా..ఆగండి. వీళ్ళు ..అంటే ఈ టీవీ చానెల్ వాళ్ళు చతురులండీ.- ది బెస్ట్ రైటర్, ది బెస్ట్ సింగర్ ఎవరూ అని ఎక్కడా అడగలేదు.’ ‘ఒక వేళ అడిగితే తల తిప్పి అంతా లత అనేవారు.. లతా మంగేష్కర్ సరస్వతీ దేవి మారు వేషం. రెండు వేల సంవత్సర ప్రారంభంలో మిల్లేనియం సింగర్ ఎవరూ అని తెలుగు వారిని ప్రశ్నిస్తే పురుషులలో ఘంటసాల, స్త్రీలల్లో ఎస్.జానకి – అని తేల్చారు కదా నెటిజనులు. అందుకనే నేమో మళ్ళీ ఆ ప్రసక్తి తేలేదు వీళ్ళు ఈసారి. ఇళయరాజా ఇసైజ్ఞానిగా తమిళనాట రాజా గా వెలిగినవాడు. గమ్మత్తు చూడండి... అప్పారావు అనబడే చక్రవర్తి సంగీత దర్శకుడై ఒక వెలుగు వెలిగినప్పుడు ఎన్టీఆర్,శ్రీదేవిల కాంబినేషన్ లో సినిమాలు బంపర్ హిట్లు. మెల్లగా చక్రవర్తి సింహాసనాన్ని రాజా దక్కించుకున్నాడు. రాజా వల్ల పాట రికార్డింగ్ సమయంలో సమయ పాలన, క్రమ శిక్షణ, మర్యాద, ప్రతిభకి గుర్తింపు వంటి ఉత్తమ గుణాలు శోభిల్లాయి. ఘంటసాల వారికి లలిత సంగీతం మీద పట్టు ఎక్కువగా ఉన్నట్టే రాజాకి జానపదం మీద అంతలా పట్టు ఉండేది. ఇద్దరికీ శాస్త్రీయ సంగీతం ఆధారమే. ఏడు స్వరాలతో ఆడే మ్యాజికే మ్యూజిక్ అంటారు రాజా. దర్శకుడిగా కె.వి రెడ్డి గారు మాయాబజార్ చిత్రాన్ని, సంగీతదర్శకుడిగా ఘంటసాల వారు లవకుశ చిత్రాన్ని, స్వర కర్తగా ఆదినారాయణరావు గారు రాగమాలికలో హాయి హాయిగా ఆమని సాగే పాటని ఒక సిలబస్ గా ముందు తరాలకి అందివ్వగలిగారు. అలా ఆధునికం, జానపదం, మెలోడీ అనే త్రివేణీ సంగమ సంగీతంతో ఇళయరాజా ముందుకు దూసుకు పోయి ఒక కొత్త సిలబస్ సృష్టించారు. ఆయన కొంచెం వెనకడుగు వెయ్యడంతో, కీబోర్డు సంగీతం ఉద్భవించడంతో, టీవీ పోటీల గాయనీ గాయకులూ ఎక్కువ కావడంతో ప్రస్తుతం సినీ సంగీతం ఒక పెద్ద అయోమయ దశలో పడిపోయింది. సిల బస్సు బోల్తా పడుతోందని భయంగా ఉంది.’ ‘ఇళయరాజా గారి పాటలు మొదట్లో విని తప్పుగా అనుకున్నాను...ఈయనా పాటని చెడగొట్టే రకం అనే అపోహ నాలో బాగా నాటుకు పోయి ఉండేది... కారణం.. ఆ పాత బంగారం తళుకుల మధ్య ఈ లయ విన్యాసం నా గుండెకి వినిపించక పోవడమే. వినగా వినగా తెలిసింది...ఈయన సామాన్యుడు కాదనీ,, ఒక మేధావి అని.’ ‘ఇళయరాజా కారణజన్ముడు. అందరికీ తెలిసిన సరిగమలతోనే అందుబాటులోకి రాని రాగ రహస్యాలు బట్ట బయలు చేశాడాయన. పైగా ఆర్కెష్ట్రా అంటే కొబ్బరి నీరు జుర్రి అవతల పారేసే స్ట్రా కాదని కొబ్బరి గుజ్జు ఉండే ఆర్క్ అని ఋజువు చేశాడు.’ ‘విశ్వం గారూ.. ఈ రాజా వారికే జాతీయ అవార్డ్ కూడా మొన్న మొన్ననే అనౌన్స్ చేశారు.’ ‘సంతోషం’ ‘ఎన్టీఆర్ చేసిన ఓ చిత్రానికి ఇళయరాజా స్వరాలూ కూర్చారండోయ్...అఫ్ కోర్స్ ..హిందీ నుంచి తెలుగు లోకి వచ్చిన సినిమా అనుకోండి...’ ‘ఏదీ ..కారాకిళ్ళీ పాటున్న సినిమా కదా... కొంచాడ సుబుద్ధి కారా మసాలా అని మాఊళ్ళో దొరుకుతూ ఉండేది. అక్కడ చాలా మంది ఇళ్ళలో పెద్దలు ఈ మసాలాని గొళంత్రా తమలపాకుల్లో దట్టించి కారాకిల్లీలు చుట్టుకునీ బుగ్గన పెట్టుకునేవారు. కాళీ పాట్నం రామారావు మాస్టారు గారిని కారా మాస్టారు అంటారు. తెలుసు కదండీ. ఆయన ఎంచక్కా ఇప్పటికీ తమలపాకులూ, మసాలా అవీ సేవిస్తారు. నా దగ్గరో మసాలా అడ్వర్ టైజ్ మెంట్ ఉంది. చూద్దురుగానీ... మసాలా అంటే పాన్ మసాలా అండీ బాబూ...మరోలా అనుకునేరు! ఇది నా చదువుల కాలంలో మా స్కూల్ వాళ్ళు మాగజైన్ లో వేయించినది సుమండీ. బడి చదువుకీ, కిళ్ళీ మసాలాకి సంబంధమేమిటా అని ఆలోచించేటంత వయసు కాదాయె అప్పుడు! ఎన్టీఆర్, కమల్, శ్రీదేవి, ఇళయరాజా, మణిరత్నం ---ఈ కలగలుపు చూపించాలని నా తాపత్రయం, చూడాలనే తపన మీకుందా?’ ‘ఎందుకుండదండీ? నాకు గుర్తున్న సినిమా బడిపంతులు ఒకటుంది. అందులో శ్రీదేవి ఎన్టీఆర్ మనవరాలు. బడిపంతులు కథనే కొంచెం మార్చి హిందీలో అమితాభ్ తో....బాగ్బాన్ అనే పేరుతొ తీశారట కదా. వయసు మళ్ళిన తల్లి తండ్రుల పట్ల కొడుకులు,కోడళ్ళు ఎలా ప్రవర్తించకూడదో ఆ సినిమా చెప్పింది. ఏదీ.. మీ నెట్టు మీద ఒట్టు వేసి చెప్పండి...మీ జీవితం ఎలా ఉంటోందో...?’ ‘మనం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా మసలుకుంటే అంతే చాలు. వీలైనంతగా సేవలు ఆశించడం మాని మన వారికి అంతో ఇంతో సాయపడుతూ ఉంటే మంచిది. నాకు తెలిసి అలా చెయ్యక ఇంకా పెత్తనాలు చలాయిస్తూ కొందరు వయో గీర్వాణం నుంచి బయట పడలేకపోతున్నారు.’ ‘బాబోయ్....నేనే కేటగిరీలో ఉన్నానో మా అబ్బాయి శేషగిరి చెప్పాలి. వదిలేయండి అవెందుకు గానీ.. హాయిగా సినిమా కబుర్లాడుకుందాం.’ ‘కమల్,శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాల్లో తెలుగు లోని ఆకలిరాజ్యం సీన్ల మాలిక, , హిందీ సద్మా నుంచి జోల పాట, తమిళంలోని 16 వైదినిలే నుంచి వసంతోత్సాహం పాట వినిపిస్తా..కాదు కాదు చూపించి వినిపిస్తా ..చూద్దురు గానీ.. ఏదీ..ఇలా ఇటు జరగండి. ఇది సాగర సంగమం పాట.’ ‘సాగర సంగమం లో కమల్ .నటనే బాపురే అనుకుంటే.... సద్మా లో శ్రీదేవి కడిగిన ముత్యంలా ఎంత బావుందీ!. ఈమధ్య ఈమె ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో చాల ఏళ్ళ తరువాత నటించి బేషనిపించుకుందట కదండీ..’ ‘హిందీలో కాబట్టి ఇంగ్లీష్ వింగ్లీష్ అంటారు. ఇదే తెలుగులో అయితే... ఇంగ్లీషూ గింగ్లీషూ అంటాం. అవునా?’ ‘అయితే గియితే...మరో పాటా గీటా చెప్పండి.’ ‘సద్మా కి రాజా వారే సంగీతం. ఏసుదాస్ చేత రవీంద్ర జైన్ తరువాత మళ్ళీ రాజా వారే చక్కగా పాడించారు. మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్ లో అంజలి అని ఒక మంచి సినిమా వచ్చింది. అందులోని రఘువరన్ నటుడు ఇప్పుడు లేడు. ఇళయరాజా పిల్లల పాట నెంత బాగా స్వర పరిచారో మణి అంతే అద్భుతంగా సన్నివేశం మలచుకున్నారు’ ‘మీకో విషయం తెలుసా? పూనా లో అజయ్-అతుల్ అన్నదమ్ములు స్వరకర్తలు. అక్కడా ఇక్కడా కచేరీలు చేస్తూ ఒక్కసారిగా స్వరకర్తలై విజ్రుంభించారు. వీరికి ఇళయరాజా సంగీతమంటే ప్రాణం. ఆ మధ్య సోమవారం పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో బాలసుబ్రహ్మణ్యం గారు రాజా స్వర పరచిన ‘అసలేం గుర్తుకు రాదు’ పాట గురించి చెబుతూ రాజా గారి గొప్పతనాన్ని మరోసారి ప్రకటించారు. ఆ పాట వినడమే మంచిది. చూడలేం, ఎబ్బెట్టు అనిపిస్తుంది. పైగా సౌందర్య లాంటి ఉత్తమ నటి చేత కొంచెం అతిగా చేయించారు సన్నివేశంలో.’ ‘హాయిగా ఉందండీ విశ్వం గారూ... సెలవిప్పించండి మరి..’ ‘రిటైర్ అయిన వారికి రోజూ సెలవులే కదండీ... నేను ప్రత్యేకంగా ఇప్పించడం ఎందుకూ?’ ‘ఆహా.. ఏం సెలవిచ్చారండీ’ ‘ఆహా ..కాదు కెవ్వు కేక...అనాలి.. వచ్చేవారం మనవడితో మాట్లాడండి.’ ‘అవును తప్పక మాట్లాడాలి- కెవ్వు, కేక పదాలు వేరు వేరుగా ఏవైనా సినిమా పాటల్లో వచ్చాయో లేదో మీకే తెలియాలి.’ ‘అంతేగానీ ,,సెర్చ్ చేస్తాను అని ఒక్క మాట అనరు కదా..భలే వారండీ మీరు లోకనాథం గారూ..ఈ తరంతో ఎలా వేగుకొస్తారో ఏమిటో?’ ‘వేగు లేదు..వేగా తార లేదు...తార అంటే శ్రీదేవే కాబట్టి ....శ్రీదేవి అంటే కార్తీక దీపం సినిమా లోని శ్రీదేవే నండి. ...ఆమె బాల నటిగా ఉన్నప్పుడు మా నాన్న నిర్దోషి, శ్రీమంతుడు, యశోద కృష్ణ వంటి సినిమాలు వచ్చాయి. వీటిల్లోని పాటలు ఒక్కటైనా వినిపిస్తారు కదండీ విశ్వం గారూ.’ ‘ఏమిటో నండీ మీరు! అరవైలో ఇరవై వయసు ఎవరికైన వచ్చేనా? అని మనసు కవి ప్రశ్నించినట్టు మార్చి నెలలో నవంబరు నెల ఎపుడైన వచ్చేనా? అని అడగాలి.’ ‘ఇరవైలోనే అరవై ఏళ్ళ పాత్రలు పోషించారు పాపం మన గుమ్మడి వారు, అందుకే పెద్దన్నయ్య, తండ్రి పాత్రల్లో ఆయన ఎప్పుడూ పళ్ళూడిన వారిలా కనిపించేవారు కాదు. నెట్టూ నెట్టూ అంటారే......గుమ్మడి గారి గురించో, మిక్కిలినేని వారి గురించో, ధూళిపాళ వారి గురించో ఏమైనా రాతలూ,దృశ్యాలూ ఉంటాయా?’ ‘నెట్టూ నెట్టూ అని విర్ర వీగుతున్నానని నా మీదనే లోపాలు నెట్టేస్తున్నారు, ఏదో ఊసుపోక ఇలా నెట్టుకొస్తున్నా కానీ...అదే సర్వం అని అనగలనా చెప్పండీ లోకనాథం గారూ...మార్చి నెలలో నవంబరు నెల వచ్చేనా అని అంటున్నారు కదా... కృష్ణశాస్త్రి గారు ఎప్పుడో చెప్పారు ...ఇది మల్లెల వేళయనీ (మార్చి), ఇది వెన్నెల మాసమని (నవంబర్) తొందరపడి ఒక కోయిల ముందే కూసింది....అని.’ ‘కోయిల కూత అనేది మచ్చుకైనా వినపడట్లేదండీ ఎక్కడా... వీటికీ తెలుసునో ఏమో ఉగాది ఆలస్యంగా వస్తోంది, తొందరపడి ముందే కూయడం ఎందుకనీ.... అవునండీ విశ్వం గారూ.. వేపపువ్వు కోసం ఏప్రిల్ పదో తారీకు వరకు ఆగకూడదండోయ్. ముందే కోసి, శుభ్రంగా ఫ్రిజ్ లో దాచుకోవాలి’ ‘లోకనాధంగారూ.. ఫ్రిజ్ తెరిస్తే పాట వచ్చేలా అమరుస్తున్నారు ఈ మధ్య . ఈ ఉగాదికి కొత్త ఫ్రిజ్ కొనే ఉద్దేశ్యమేమైనా ఉందా?’ ‘పిచ్చి పిచ్చి పిచ్చి... రకరకాల పిచ్చి... కొన్నాళ్ళ క్రితం ట్రాన్స్పెరంట్ తలుపు పెట్టారు. మన ఫ్రిజ్జులో తోసే నానా చెత్తా నలుగురికీ తెలియాలటండీ? ఇంకా డోరు తెరిస్తీ పాటా? పాట మైకంలో డోరు తెరిచి కూర్చుంటే ఇంక మన ఎలెక్ట్రిక్ బిల్లు ...బాబోయ్... మన జేబుకి చిల్లు!’ ‘ఏం? బిల్లులన్నీ మీరే కడతారా? అబ్బాయి...’ ‘పొదుపు పనుల బాధ్యత అంటే చాదస్తపు పనులన్నీ నావి. ఏదో సర్కారు వారు పడేస్తున్న సొమ్ముని ఇలా వాడుతున్నాను’ ‘అందుకే మీ పేరు లోకనాథం. ఇందాక ఏదో అన్నాను. మన్నించండి. ముసలి తనం అంటే వేన్నీళ్ళు, చన్నీళ్ళు అని డిమాండ్ చెయ్యక వేన్నీళ్ళకి చన్నీళ్ళు లాగ ఉండాలని మీ నుంచి తెలుసుకోవాలి’ ‘ఉండండి.. మనవడికి ఈ ప్రశ్న వేస్తా... వేన్నీళ్ళకి చన్నీళ్ళు అని అన్నారే కాని చన్నీళ్ళకి వేన్నీళ్ళు అని ఎందుకు అనలేదూ? అని’ ‘అంతా సైన్స్ సైన్స్ అంటారు కదా ... నేనూ అడుగుతా నా మనవడిని’ ************* (పాత్రలు కేవలం కల్పితం) {కనులు చూసినా పాటే- ఎన్టీ ఆర్, బేబీ శ్రీదేవి నటించిన బడిపంతులు, బేబీ శ్రీదేవి నటించిన శ్రీమంతుడు, కమల్,శ్రీదేవి నటించిన ఆకలి రాజ్యం, సద్మా, 16 వైదినిలే (ఈ రెండు సినిమాలకి ఇళయరాజా సంగీతం) చిత్రాల నుంచి సన్నివేశాలు /పాటలు, మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన అంజలి- చిత్ర గీతం, దృశ్యం, కమల్ నృత్యం చేసిన ఇళయరాజా స్వర కల్పన- సాగర సంగమం చిత్రం నుంచి. ఆఖరున చక్కని తెలుగులో శ్రీ కృష్ణ గీతోపదేశం, నందమూరి నటనతో - శ్రీకృష్ణావతారం చిత్రం నుంచి ) కనులు మూసినా పాటే- ఒక్కొక్కటి ఇళయరాజా వారి స్వర మాధుర్యం! ఈ ఎర్ర గులాబీ విరిసింది (ఎర్ర గులాబీలు- కమల్, శ్రీదేవి, భారతీరాజా), చిన్ని చిన్ని కన్నయ్యా, తమ్ తమ్ తాళంలో నట రాగంలో (కొత్త జీవితాలు, భారతీ రాజా), అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి (ఆరాధన), నాయకుడు చిత్రం (తమిళంలో నాయగన్, మణిరత్నం) నుంచి ఒకనాటి వైవిధ్య గాయని జమునారాణి చాలా ఏళ్ళ తర్వాత పాడిన – నా నవ్వే దీపావళి –పాట, రాజకుమార్ చిత్రం నుంచి తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట. ఆల్ బొమ్మలే – ‘మసాలా’ ప్రకటన.} [ఎంత కంప్యూటరయినా కరెంటుకి లోకువే. పవర్ కట్ = కంప్యూటర్ యూసేజ్ ఫట్. ఒక్కోసారి ఇంటర్ నెట్ ఫట్. అన్నీ కుదిరినా ఒక్కొక్కసారి వెబ్బు సైటులు తెరుచుకోవు. కృష్ణప్రేమ ఈ తెరుచుకోని దుస్థితికి ఇటీవల లోనైంది. అందుకే ఈ పోస్టింగ్ కి ఇంత ఆలస్యం అయ్యింది. అప్పుడనిపిస్తుంది- ఆహా! వెనకటి రోజులే నయం. చదివితే వారపత్రికో, మాసపత్రికో చదవాలి. రాస్తే వాటికే రాయాలి. ప్రచురిస్తే సంతోషం. లేని పక్షంలో మరో ప్రయత్నం. ఇలా ఏ బాధలూ లేని ప్రపంచం అది. కాని ప్రచురించే వాళ్ళు అప్పుడే కాదు ఇప్పుడూ అవస్థలు పడుతూనే ఉన్నారు. నీతి – దేని దారి దానిదే (ఎటు తిప్పినా అదే) ] -డా. తాతిరాజు వేణుగోపాల్, 24 మార్చి 2013 (ఆదివారం)
1 Comment
KV SHASTRI
12/5/2013 02:20:10 pm
Very very nice evaluation on the present day situation in the present day homes.
Reply
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|