మునుపటి నా మాట
‘నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే....ఎవరేమన్నా’ ‘ఆగండాగండి...ఇది మీ పాట కాదనుకుంటానూ.. పోనీ నా ఎదుట ఉన్నారు కదా కనీసం నా పాటైనా పాడుకుంటున్నారు అని అనుకున్నాను... ఈ 'పర' పాట ...మీ పొరపాటా?’ ‘అయ్యా... మాటలంటే మీవే. మీ కలం నుంచి ఒక మాట జారిందే అనుకోండి...ఇంక అది జనం నోట నానాల్సిందే. నిజమే ఇది పర పాటే. కవికి తన పాట కన్నా ఇతర కవుల పాటలే నోటికి రావాలి. అప్పుడే తన పాట లో వారి మాటలు రాకుండా జాగర్త పడతాడు ...అని నా చేత భూలోక వాసులకి చెప్పాలనేగా మీ ఎత్తుగడ?’ ‘ఎత్తుగడ లేదు ..తలగడ లేదు.. మనది స్వర్గ లోకం. అప్పుడు భూమ్మీద ఉన్నప్పుడూ స్వర్గ లోకమే. చచ్చి స్వర్గానికొచ్చినా స్వర్గ లోకమే. అయినా.. మీకెలా ఉందో కాని ఒక్క ఈగా, దోమా అనేది లేకుండా ఇక్కడ చస్తున్నాం కదా. అవుంటే ఎంచక్కా వాటిమీద మన వాళ్ళు సినిమాలు తీసేవారు, మనం పాటలు రాసేవారం’ ‘దోమ సంగతి తెలియదు కాని ఈగ మీద సినిమా వాలిందట. అన్నమయ్య మీద సినిమా వచ్చిందట కాని అందులో ఆయన కీర్తన ఉందే...పన్నగపు దోమతెర పైకెత్త వలె..అది మాత్రం లేదట.’ ‘ఇంకా భూలోకం వేపు తొంగి చూస్తూనే ఉన్నారన్నమాట. అవును మరి... నాకన్నా ఆలస్యంగా ఇక్కడికొచ్చారాయే.’ ‘అబ్బబ్బే... పాపం సుందర రామమూర్తి ఈ మధ్యనే ఇక్కడికొస్తే తెలిసింది.’ ‘ఆ రామమూర్తి కవే అనుకుంటే .. . అదేమిటో ... టి.కె. రామమూర్తి ....వయోలిన్ మేధావి, గొప్ప స్వర కర్త కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడి కొచ్చారు.’ ‘వయొలీన్ ప్రముఖులు వాయులీనం అయిపోయారండీ.. లాల్ గుడి జయరామన్ గారు అదిగో ఆ వైపు ఉన్నారు, సితార రవిశంకర్ పక్కన కూర్చునీ జావళీ వాయిస్తూ.’
‘ వీళ్ళంతా ఇక్కడికి రావడం మన అదృష్టం. భూలోక వాసుల దురదృష్టం. సరే కానీండీ...నిన్న నాదే నేడు నాదే ...అంటూ పాడారు కదా.. నిన్న నాదండీ. నేడు మీదండీ.’ ‘ఆహా.. నాగేంద్రులఉవాచ నరసింహుడికి తివాచా?’ ‘ఆరుద్రలో పరకాయ ప్రవేశం చేస్తున్నారా ఏమిటీ... అయినా నాగేంద్రులు, నరసింహులు అంటే ఎవరో తెలియక ఈ పాటికి చదువరులు కృష్ణప్రేమ వెబ్బు పేజీ తిప్పేసే వారే ...అందుకని ముందు జాగ్రత్తగా మన ఫోటోలు అతికారు. బతికిపోయారు’ ‘నన్నన్నారే...మీకూ భూలోకం కబుర్లు బాగానే చేరుతున్నాయే.. ఇంతకీ నిన్న నాదే ....అంటే నిన్న పింగళి వారి వర్ధంతి, నేడు నాదే ..అంటే ఆత్రేయ జయంతి ...అవునా?’ ‘అది మనమంటే ఎవరో తెలిసిన భూలోకం వాళ్ళు గుర్తు పెట్టుకునీ చెప్పే కాలం గుర్తులు. ఇక్కడ మనకి జయంతులుండవూ, వర్ధంతులుండవు.’ ‘చక్కగా సెలవిచ్చారు. కాని మీరే సినిమాలో అన్నట్టు ‘మోసం గురూ’ అని అనాలని ఉంది.’ ‘ఏం?’ ‘మీరు పోగానే నేను పుట్టడమా...మోసమే కదా.’ ‘మోసం కాదు...మరుజన్మ కోసం. అయినా ఆత్రేయ గారూ ..ఎన్ని సార్లనీ మరుజన్మ మరుజన్మ అంటూ పాటల్లో కలవరించారు మీరు! అరె ఏమైందీ..ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ?’ ‘అది ఏమైందీ ...తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది. నా పాట పల్లవి గుర్తు చేస్తే అనుపల్లవే నా జవాబు’ ‘మరుజన్మ అనే మాటతో పాటు మనసు-మనిషి అంటూ కలవరించారు మీరు.. ఇంతకీ కల?’ ‘కల వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా, అవున కవీ అవున రవీ?’ ‘ఇదిగో... నా పాటకే పేరడీనా? మానవ వీరుడు అంటే జగదేక వీరుడే, తెలుగునేల వీరుడే’ ‘అంటే.. నందమూరి తారక రాముడే’ ‘అతను ఇక్కడే ఉన్నాడు కాబట్టి విచారం లేదు అనుకున్నా... కాని ఉన్నట్టుండి పార్లమెంటులో పని ఉంది అని చెప్పా పెట్టక పారిపోయారాయన’ ‘అదా సంగతి? ఏదో యావత్ భారత చలన చిత్ర సీమకి నూరేళ్ళు పూర్తయ్యాయి, తెలుగు లవకుశ కి యాభై ఏళ్ళు వచ్చాయి అని వినగానే ఆయన ఒక్క ఉదటున లేచి హుటాహుటిని భూలోకం వైపు వెళుతున్నారనుకున్నాను. ఆయనకి ఇక్కడా క్షణం తీరిక లేదండీ. ప్రేక్షకలోకం ఇంకా ఇంకా నీరాజనాలు ఇస్తుంటే ఆయనకిక్కడ కంటి మీద కునుకే ఉండట్లేదు. భూలోకంలో ఇండియా పార్లమెంటులో ఆయన విగ్రహ స్థాపన జరుగుతోంది’ ‘ఇదిగో ఆత్రేయ గారూ... మీకు భూలోకం వాసనలు పోవట్లేదు. ఇక్కడ..అంటే ఈ దివిసీమలో నిద్ర ఉండదు, మెలకువ ఉండదు, జీవి ఉండదు, జీవితం ఉండదు. ఉండేదల్లా ---ఆత్మ! అదిక్కడ చరిస్తుంది, ఇక్కడే దాని జన్మ తరిస్తుంది. భూలోకంలో ఉండేది మనిషి విగ్రహం, దివియే ఆత్మ స్వగృహం!’ ‘మనసు కవి అని ముద్ర వేయించుకున్నా....మనసు గతి ఇంతే అన్నా. మనసు లేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు అని వాపోయా. మనసే మనిషికి బందిఖానా అని మొహమాటం లేకుండా చెప్పా. ఇప్పుడు మనసారా ఒక కోరిక కోరుకుంటా.. మరు జన్మ ఉన్నదో లేదో ...నేను మనిషి మనసుగా పుట్టాలి అని. మనసూ, ఆత్మా రూప ప్రతిరూపాలే అని చూపగలిగేది జన్మ అనే అద్దమే. ’ ‘అంటే.. అందరి మనసుల్లో ఉండిపోవాలనేగా? ఇప్పుడు మాత్రం లేరటండీ.. 1951 లో 'దీక్ష' సినిమాతో ప్రారంభించి 1990 వరకూ రాస్తూనే వచ్చారు, ఒక చేత్తో సినిమాలకి మాటలు, మరో చేత్తో పాటలు. నాలుగు దశాబ్దాలంటే మాటలా? ఎంత ఓపికండీ మీకు.’ ‘అయ్యా పింగళి కవీంద్రులూ .. పాటల్లో ఏదో కాస్త మోతాదు మించి రాస్తే నన్ను ‘రాత్రేయ’ అనీ ‘బూత్రేయ’ అని ఒక పక్క నీరాజనం ఇస్తూనే జనం ఎద్దేవా చేశారు. కాబట్టి .... నేనేమిటో మీరే చెప్పాలి ’ ‘ఆత్రేయ!’ ‘అయితే.. అది నా కలం పేరు కదా..’ ‘మీ కలమే మీ మనసు కదా’ ‘నా మనసు పేరూ ఆత్రేయే అంటారా?’ ‘అందుకే మీరు మనసు కవి’ ‘మొహమాటం లేకుండా నేనా మాటని విరుస్తాను, మీకోసం’ ‘ఎందుకనో?’ ‘ఎందుకంటే మీరు మన సుకవి అని జనం నోట జేజేలు అందుకున్నారు కనుక! అయినా మనసు నా ఒక్క కలం స్వంతమా? మీరు పరచినంత మనసు చాప నేను కూడా పరచి ఉండలేదేమో... చూడండి....ఏం అన్నారూ ఒక్కొక్క సారి ఒక్కొక్క మనసును ఇలా..... మనసు పరిమిళించేనే, మౌనముగా నీ మనసు పాడిన, నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా, నిన్ను చూచిన నిమిషమందే మనసు నీ వశమైనది, మనోహరముగ మధుర మధురముగ మనసులు కలిసెనులే, మనసు కరుగదా మహిమ జూపవా, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి, కనులను మనసును కరగించి మైమరపించి, వెన్నెల కూడా చీకటియైనా మనసున వెలుగే లేకపోయినా, నీ రూపమె నే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో, వనియంతా పరిమళించెనే మనసెంతో పరవశించెనే, కన్నులలోన కలలే ఆయె మనసే ప్రేమ మందిరమాయె, కన్నుల లోన గారడి ఆయె మనసే పూల మంటపమాయె, అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే, కన్ను కాటు తిన్నదిగా నా మనసు మురిసెనే, చిట్టెమ్మ మనసేమొ మంచిదే పాపం, లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా, మనసున మంగళ వాద్యమాహా మ్రోగెలే, మల్లె తోరణల మంటపమందే కనులూ మనసులు కలియునులే, కలసిన మనసుల కలరవములతో జీవితమంతా వసంతగానమౌనులే, మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడు చూచెద నయ్యా, వలచి వరించి మనసు హరించి నను గికురించగ నేలా?, మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా?, కనుల కలికమిడి నీ కిరణములే మనసును వెన్నగ చేసెనయా, ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా, ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి మనసు మీద హాయిగా, ...’ (గుక్క తిప్పుకోకుండా చెప్పి చెప్పి ఆత్రేయ కాస్సేపు ఆగుతారు. పింగళి వారు కంగారు పడతారు) ‘ఆత్రేయగారూ... మీకేం కాలేదు కదా.. అయినా అంత మనసు పెట్టి నా పాటల్లోని మనసును వెతక్కపోతే ఇప్పుడు వచ్చే నష్టమేమిటి చెప్పండీ? హాయిగా ఇక్కడ కృష్ణా రామా అనుకోకుండా?’ ‘అనుకోవచ్చు..పైకి గట్టిగా కృష్ణ అంటే కృష్ణశాస్త్రి, రామా అంటే రామకృష్ణశాస్త్రి పిలిచారా అంటూ వచ్చేస్తున్నారు. కాబట్టి మనసులోనే అనుకుంటున్నా. అయినా కృష్ణా రామా అని భూలోకంలో అనుకోవాలి కదండీ. మీరు భలేవారే. నన్ను దివిసీమ నుంచి భువి సీమకి తరిమేసేలా ఉన్నారే’ ‘లాభం లేదండీ.. కృష్ణప్రేమ వెబ్బు మనల్ని ఇవాళ తికమక పెడుతోంది. పైగా ఇప్పుడే ఎగిరొచ్చిన వార్త. వాళ్లట..విజయ నామ సంవత్సరం కనుక...విజయా వాళ్ళ సినిమా కవిని నేను కాబట్టి ‘హాయిగా’ నా పాటల వీడియోలు చూపిస్తారట. అంటే నా పాటల్లో ‘హాయి’ అనే పదం వచ్చే పాటలే చూపిస్తూ వినిపిస్తారట. పైగా అడుగుతున్నారూ .. పింగళి వారూ ‘హాయి’ అనే పదం మీరు ఎక్కువగా మీ పాటల్లో ప్రయోగించడానికి కారణం ఏమిటీ అని! ఏముందీ... అంతటా హాయి ఉండాలనే తపన!’ ‘మరి నా మాటో?’ ‘మనసు పాటలే వినిపిస్తారేమో.. మనసా రా అన్నా మనసా రమ్ము అన్నా సెన్సారు వాళ్ళు పెడర్ధాలు తీసి బెల్టు బెల్టు అంటున్నారని విన్నాను. అయినా వెరైటీ వారండీ మీరు. వేరే టీలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకే మనసు బ్రాండ్ ఎందుకూ...చెవులకి పని పెడదాం రండి.' 'అదియే మన తక్షణ కర్తవ్యమ్!' ****************************************************************************** (స్వర్గలోకం ఊహా జనితం ---పింగళి వారికి, ఆత్రేయ వారికి క్షమాపణలతో) (కనులు చూసినా పాటే- పింగళి నాగేంద్ర రావు గారి 'హాయి' టిప్పు కనులు మూసినా పాటే - ఆచార్య ఆత్రేయ గారి వెరయి'టీ' సిప్పు నిదానంగా 'తిరుగులేని మాట' లో ఎందరివో ఒక్కొక్క ట్రిప్పు ) -డా.తాతిరాజు వేణుగోపాల్ , 07 మే 2013
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|