మునుపటి నా మాట
వెన్న ముద్దలు తిన్నంత మెత్తని గాత్రం , ఆ బాల గోపాలం మెచ్చే గళం - అది మీకు సరస్వతీ కటాక్షం! అందుకో28/8/2011
ఆమె వల్ల లలిత గీతాలు సినిమా పాటలతో దీటుగా నిలబడ్డాయి. లలిత గీతాలు నేర్పేందుకు తాను సిద్ధమనీ, ప్రభుత్వం సాయపడాలని ఆమె తరచూ గుర్తుచేస్తున్నారు. కళల గురించీ, కళాకారుల గురించి ఆలోచించే రాజకీయ వాతావరణం ఇప్పట్లో లేదు, రాదు కూడా. దిక్కూ మొక్కూ, మాటా పలుకూ లేకుండా పోయిన తెలుగు సినిమా పాట పక్కన లలిత గీతం నిలబడగలిగితే అంతకన్నా 'మ్యూజిక్ థెరపీ' ఏముంటుందీ? చెవుల్లో రొదలు వింటూ గుండె దడలు పెంచుకునే యువతకి జిమ్ము థెరపీ కావాలి గానీ 'ఇది నిజమ్ము' అంటే వినే ఓపిక ఉందా? అన్నా - లాంటి వారు యువతను మేల్కొల్పుతారు. అలాంటి క్రాంతి తెలుగు నాట అన్ని రంగాల్లోనూ అవసరమిప్పుడు. ఆమె ఎటువంటి రాజకీయం జోలికి పోకుండా, ఎవరినీ నిందించకుండా జీవిస్తున్న ఒక మధుర గాయని. ఒక బాలికగా సినిమాల్లో నటించింది. లేలేత గొంతుతో అద్భుతంగా పాడింది. ఒక అమాయక పెళ్లికూతురిగా మారింది. ఒక ఆదర్శ గృహిణిగా నిలిచింది. ఇప్పుడామెకి 83 ఏళ్ళు. ఆమె పుట్టిన తేదీ 28 , పుట్టిన సంవత్సరం కూడా 28 (1928) యే. అందుకేనేమో ఆమె పాట అనే మాట కోసం పుట్టి ఇటు సినిమాల్లోనూ, అటు రేడియో లోనూ రెండు చోట్లా 'అల్లారు ముద్దు' తెలుగు మాటలు వల్లెవేసిన 'బాల', తెలుగు నేలను వెలసిన 'సరస్వతీ దేవి'. మెట్టినిల్లు ఆమెను 'రావు' అంది. ఇక పాటలు రావు అని ప్రతి తెలుగు గుండె తల్లడిల్లింది. చాలు- ఆమె అందించిన ఆ అమృత భాండం, వెల లేనిది, విలువ కట్టలేనిది. ఆమె సంక్షిప్తంగా రా.బా.స అయినా ఎప్పుడూ రభస చెయ్యని ఉత్తమ బాల, ఉత్తమ గాన సరస్వతి, ఉత్తమ దేవి. ఆమె గలగలా నవ్వేస్తూ ఉంటే మనమూ ఆమె ఆపాత ఆ పాత గానాన్ని వింటూ, అప్పుడప్పుడూ టీవీల్లో పలకరిస్తూ పాడుతుంటే చూస్తూ ఆమెను అభిమానిస్తూనే ఉందాం. ఆమె పుట్టిన బాపట్ల, పెరిగిన మద్రాస్, తిరిగిన మైసూర్, బెంగళూరు, స్థిరపడిన హైదరాబాద్ అన్నీ ఆమె గళాన్ని ఆస్వాదించి దేశావిదేశాలకి ఆ సువాసనలు వెదజల్లేలా తోడ్పడ్డాయి. ఆమె ఒక గాయనిగా ఎదిగేందుకు తండ్రి ప్రోత్సాహమే ఎక్కువ. సొంత థియేటర్ నడుపుతూనే సంగీతం లో నిష్ణాతుడు కావడం అరుదైన విషయం. సినిమాలో సంగీతం బావుండకపోతే ప్రదర్శన ఆపేసి నాటక సమాజం వారి చేత పద్య నాటకాలాడించే వింత సంగీతాభిమాని ఆయన. ఆ రకంగా వ్యాపార విపర్య సిద్ధాంతాలు పాటించి దెబ్బతిన్నా 'సంగీతం' విడవని మహానుభావుడు. ఆ అభిమానమే సరస్వతికి ఆత్మ విశ్వాసం నేర్పింది. లేకపోతె చిన్ననాడు కపిలవాయి రామనాథ శాస్త్రి అంతటి మహోన్నత నటుడి ఎదుటే 'ఆ పద్యాలు నాకొచ్చు' అని తల్లితో అంటుంటే అవి విన్న ఆయన చిన్నారి సరస్వతిని ఎత్తుకునీ స్టేజి మీద పాడించడమా? రేసు గుర్రాల వీక్షణం ఆమెకు ఇష్టం. అలా రాజా వారు అదే రేసు కోర్సుకొచ్చి ఆమెను చేసుకోవాలని ముచ్చట పడ్డారు. చిన్నతనంతో అమ్మ మాటకి విలువిచ్చి రాజా వారిని పెళ్లి చేసుకున్నారామె. వేటూరి వారు 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అని ఒక పాట రాసారే- ఆ పాటని 'ఆ రేసుకు పోయి పారేసుకున్నాను' అనవచ్చు. పాడే అవకాశం పారేసుకోవడం- ఎంత కఠిన శిక్ష ఏ కళా కారుడి కైనా, కళా కారిణి కైనా. ఇవన్నీ ముందు తరాలకు పాఠాలు. మంచితనం, అమాయకత్వం - వీటికి 'రక్షణ' ఉండాలి. జాణతనంతో నెట్టుకు రావొచ్చు కాని అది జాతి ఎంతోసేపు హర్షించనిది. 'వెన్నముద్దలు తిన్నంత మెత్తగా పాడుతున్నారు మీరు' - ఇది డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ వారు అలనాడు ఆమె కిచ్చిన కితాబు. చిరు నవ్వు, కోమల గానం ఇప్పటికీ ఆమె జవాబు. (కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే, ఆహా ఆహాహా --- ఇవన్నీ రావు బాల సరస్వతీదేవిని చూపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి) (అభిప్రాయాలు చెప్పడంలో ఎందరికో ఎందుకో మొగమాటం! మా రాతల మీద అభిప్రాయలు మాకు ఉబలాటం) - డా. తాతిరాజు వేణుగోపాల్ , 28 ఆగస్ట్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|