మునుపటి నా మాట
నిర్మల ప్రేమ గీతానికి అర్ధం చెప్పి గజల్ జగతిని జయించిన ఆ 'సింగ'ర్ ది ఇప్పుడు వేరే 'దునియా'10/10/2011 ఆ గాయకుడు , గజల్ గీతాల నవ్య నాయకుడు ఏడు పదుల వయసు చాలు చాలు అనుకుంటే అతన్ని నమ్ముకుని అతన్నే స్మరిస్తున్న అతన్నే వరిస్తున్న ఆ ఏడు స్వరాల గతేం కాను? అటు- జీవిత భాగ స్వామి చిత్రా - సప్తపది పదిల పరిచిన బంధం, కలిపి యుగళ గజల్స్ పాడించిన అనుబంధం ఒక్క సారి చీకటి మయం కావడం, తన స్వామి గంధర్వ లోకానికి మాయం కావడం తట్టుకోగలదా? ఏం పేరాయనదీ! జగ్ జీత్ సింగ్ ! కాస్త ముందూ వెనకా కలబోస్తే - 'సింగింగ్' జగతిని జయించిన వాడిగా అనిపించదూ? ఇలాంటి అలాంటి 'సింగింగ్' కాదు ఆయనిది. 'గజల్స్' అనేవి సామాన్యుడికీ అందుబాటులో ఉండేలా పాడి వినిపించి, గజల్స్ పాడితే నువ్వే పాడాలి అని అందరిచేతా అనిపించుకున్న సింగర్ ఆయన. సినిమాల్లోనూ తన దైన ముద్ర స్పష్టంగా చూపించి, వినిపించి సింగం లా రాజసంగా తిరిగి ఇప్పుడు శాశ్వత నిద్ర పోయింది ఆయన గళం. కొన్ని వారాల క్రితం ముంబై లో కచేరీ చేయబోతూ కుప్ప కూలిన అతను 'కోమా' లోకి వెళ్లి పోయాడు. 'నువ్వు తిరిగి వస్తావని కోరుకోమా' అని ప్రతి శ్రోత హృదయం అతన్ని బతికించమని దేవుళ్ళని వేడుకుంది. 'బంగారం లాంటి అవకాశం నాది. మా గంధర్వులకి గజల్స్ నేర్పించాలి' అని ఒక్కో దేవుడూ చేతులు చాపి ఆయన్ని లాక్కు పోయాడు. ప్రపంచంలో క్షరం కానిది 'అక్షరం' ఐతే ఆ అక్షరాల వెనక భావం నాశం కాకుండా కాపాడిన, పాడిన ప్రతి గాయకుడు 'పాట' రూపంలో ఎప్పుడూ చిరంజీవిగా ఉంటాడు. మామూలు వ్యక్తిని 'ఏదీ నీ గొంతు ఎక్కడుంది?' అని అడిగితే తల మీంచి చెయ్యి జార్చిమెడ దగ్గర ఆగి 'ఇదిగో ఇక్కడ' అంటాడు. కాని అదే ప్రశ్న ఉత్తమ గాయకుడికి వేస్తే ' నా గుండె పైన ఉంది' అంటాడు. అదే తేడా! జగ్జిత్ సింగ్ లో రెండు గకారాలున్నాయి- ఒకటి గొంతు ఐతే, మరొకటి గుండె.
మన నండూరి వారు 'గుండె గొంతుకలో కొట్లాడుతాది' అని అన్నారంటే, మన దేవులపల్లి 'గొంతు పాడితే చాలునా గుండెలో రాగం ఉండాలి' అని అన్నారంటే, మన ఆత్రేయ 'గుండె గొంతుకు దగ్గరైనది' అని అన్నారంటే - వారంతా కలవరించినది సింగ్ లాంటి సింగర్ ల కోసమే. పద్యాలకి కొత్త భాష్యం చెప్పి 'స్వర' స్థాయిగా నిలిచిపోయిన వాడు మన ఘంటసాల ఐతే గజల్స్ కి కొత్త రూపం ఇచ్చి 'స్థిర' స్థాయి గా నిలిపిన వాడు జగ్ జీత్ సింగ్. ఘంటసాల తెలుగును బతికించి పుణ్యం కట్టుకున్న వాడు. జగ్జీత్ ఉర్దూ ను వెతికి పట్టుకున్న వాడు. ఆయన వేళ్ళు కదులుతుంటే మ్రోగుతున్నది హార్మోనియమా? అలా మార్మోగి పోతుందేమిటీ? ఆ ప్రతిధ్వని ఆయన గుండె సవ్వడి కాదు కదా? 'ప్రేమ గీత్', 'అర్థ్' వంటి చిత్రాలకి బాణీలు కట్టి 'నువు కాస్త చిరు నవ్వు చిందిస్తే చాలు ----మేరా గీత్ అమర కర్ దూ(' అని ప్రాధేయ పడిన నిర్మల ప్రేమికుడు జగ్జీత్. 'కాగజ్ కి కస్తీ' అంటూ చిన్ననాటి కాయితం పడవల జీవితాన్ని కళ్ళకు కట్టి చూపించిన నావికుడు జగ్జీత్. ప్రతి పాటా కొత్తగా ఉండాలి, మెత్తగా ఉండాలి, భాష ఆకట్టుకోవాలి, భావాల వెల్లువలో శ్రోతలు కొట్టుకుపోకుండా ఒడిసి పట్టుకోవాలి- ఇవన్నీ సాధ్యమవ్వాలంటే శ్రమ పడాలి. పాడే శ్రామికుడు జగ్జీత్. ఈ సింహం ' always sing' అని తనని తాను హెచ్చరించుకుంది. జీవితాన్నిపాటతోనే ముచ్చటించుకుంది. మృగ రాజు ఒక్కసారి గర్జిస్తే చుట్టూ వనం దద్ధరిల్లి పోతుంది. ఈ మృదు రాజు గజలిస్తే చుట్టూ జనం లోకం మరచి పోతుంది. తండ్రి 'దిల్ రుబా' వాద్యం వాయించడం ఆయనకి తెలుసు. అందుకే 'మనసు' పాడే సన్నాయి పాట ను సహగాయని చిత్రాగళానికి మాంగల్యం రూపంలో సమర్పించుకున్నాడు. అన్యోన్య దాంపత్యం వరాల తండ్రి 'వివేక్' ని ప్రసాదిస్తే ఆనందించాడు. కాని ఆ ఆనందం అట్టే కాలం నిలవ లేదు. ఎదుగుతున్న బిడ్డ కారు ప్రమాదంలో శాశ్వతంగా దూరమయితే ఆయనకి అంతటా శూన్యమే గోచరించింది. 'లేడు లేడు' అని మమకార మోహాల ప్రపంచంలో వగచే కన్నా 'ఉన్నాడు' అనే ఊహా లోకంలో బ్రతకడం అసాధ్యం కాదు అని తీర్మానించుకున్నాడు. 'ఎలిజీ'లు పాడాడు. ' శ్రీ కృష్ణా' వంటి దైవ స్తుతులతో మజిలీలు చేశాడు. మళ్ళీ గజల్స్ 'దునియా' లో గళం విప్పాడు. శ్రోతల్ని తన అంతరంగం చుట్టూ తిప్పాడు. తొలి నాళ్ళలో ఆ గజల్ గళం కి సహకార వాయిద్యం గిటార్ కావడం వైవిధ్యం అనిపించింది కొందరికి. ఇదేం పైత్యం అని నొసలు చిట్లింప జేసింది మరి కొందరికి. పైగా పన్నెండు తీగల గిటారట అని ముక్కున వేలేసుకున్న వారే అతని గాన ప్రతిభకి తలలు వంచి అక్కున చేర్చుకున్నారు. ఈయనకంటూ ఓ బాణీ ఉన్నట్టుంది , ఎక్కడి నుంచి ఊడి పడ్డాడండీ ఈ రాజస్థాన్ శ్రీ గంగానగర్ వాసి? జలంధర్, కురుక్షేత్రాల్లో చదివాడట కూడా! అని పక్కున నవ్వేసిన వారే ఆనక ఆయన పక్కన నిలబడి ఫోటో దిగితే చాలనుకున్నారు, ఆయన హార్మోనియం మీద నుంచి వేళ్ళు తీస్తే ఆటోగ్రాఫ్ చేయించుకోవచ్చు అని కాసుక్కూచున్నారు. ఆశా తాయి అన్నట్టు 'మనసు ఉపశమనం కోరుతోందా? ఐతే విని తీరాల్సిందే జగ్జీత్ రికార్డ్'! ఈ అక్టోబర్ 10 న ఆయన భౌతికంగా మననుంచి తప్పుకున్నారు. తను శాశ్వతంగా విరమిస్తున్నట్టు తెలియని స్థితి లో ఉండి వెళ్లి పోయిన అదృష్ట జీవి. తన గజల్స్ శాశ్వతమని శాశించి వెళ్లి పోయిన ఈ సింగ్ నిజంగానే కింగ్. Yes. Singh is King! కనులు చూసినా పాటే ( video) , కనులు మూసినా పాటే (audio) - ఇవి ఆయన గళాన్ని గుర్తు చేసి ఆయన లేని బాధని రెట్టింపు చేస్తాయి. ఒక్కొక్క పాట మధ్య కొంచెం విరామమిస్తూ వినడం సబబే కదూ........ -డా. తాతిరాజు వేణుగోపాల్ , 10 అక్టోబర్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|