మునుపటి నా మాట
మహారాష్ట్రకే కాదు యావత్ భారతానికే మణి కిరీటమైన మహారాజు ఛత్రపతి శివాజీ! ఆ మహా ధార్మికుడు, రాజస మూర్తి జననం గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఈ ఫిబ్రవరి 19 న. తిథుల ప్రకారం ఈ ఏడాది మార్చి 22 న. ఆనాడు ఆయనకు జోహార్లు చెప్పుకుందాం. అరె, ఇదే ఫిబ్రవరి 19న మన కళా తపస్వి ‘కె. విశ్వనాధ్’ పుట్టిన రోజు కూడా. శనివారం ఉదయం'జీ తెలుగు టీ వీ' వాళ్ళు సందర్భోచితంగా మహారాష్ట్ర మందిర దర్శనం చేయిస్తున్నారు. ఆహా, పూణే లోని పాషాణ్ ( అంటే కొండ ) ప్రాంతంలో ఉన్న అహోబిల మఠం వారి శ్రీ బాలాజీ మందిరాన్ని చూపిస్తున్నారు. కొండ దేవర ఎటొచ్చీ ఇక్కడ కొండ కింద ఉండాల్సి వచ్చింది. కలి యుగంలో దేవుడైనా కనికరించే స్థలంలోనే సర్దుకు పోవాలి మరి. గొప్ప విషయం ఏ(విటంటే ఇదే మందిరంలోమా జానకమ్మ, వాణీ జయరాం, పారుపల్లి రంగనాథ్, శోభారాజ్ తొమ్మిది అడుగుల ఆ దివ్య మంగళ మూర్తి ముందు గానాలాపన చేసి తరించారు. ‘మా చెవుల రింగు మనగ’ అని నాడు కవి ఏ సందర్భంలో అన్నారో గాని ఇప్పుడీ ఊళ్ళో సెల్లు రింగు టోన్ గా పారుపల్లి వారి ‘గోవింద’ స్మరణ సదా వినిపిస్తుంది. ఆలయం, కోవెల, గుడి, మందిరం – ఒక్కో మాటకి ఒక్కో అర్థం ఉన్నా హోలు మొత్తంగా ఒక పవిత్ర స్థానం అది.
మా మా(వయ్య అంటుండే వాడు – విశ్వనాథ్ అన్ని సినిమాల్లోనూ గుడి, గోదావరి లేదా రివెర్ కాన్సెప్ట్ లేకుండా ఉండదనీ. ఆయన సునిశిత పరిశీలనా చాతుర్యానికి కించిత్ అబ్బురపడీ విశ్వనాథుని సినీ అన్వేషణ ప్రారంభించా ఆనాడే. బహుశ: 'శంకరాభరణం' విశ్వనాథుని విశ్వానికి పరిచయం చేసినట్టుగా మరోటి లేదేమో. అప్పటినుంచే కోవెల వాతావరణం కొత్తగా అందరికి తెలిసింది. వెనక్కి వెళ్లి చూద్దును కదా- సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి – ఇవన్నీ కోవెల చుట్టూ తిరిగిన చిత్రరాజాల్లాగే కనిపించాయి. అన్నిటా టెంపుల్ షాట్స్ సింపుల్ గా ఒకటో ఆరో ఉన్నట్టే అనిపించాయి. ఇంకాస్త వెనక్కి వెళితే- ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అనే భలే టైటిల్ ఎవరు పెట్టారో గానీ ఆ సినిమాకి కె. విశ్వనాథ్ గారే డైరెక్టర్. ఇందులో కృష్ణశాస్త్రి గారి గొబ్బిళ్ళ పాట ఉంది, అందులో లేత బాలు పలికిన ‘నీ కోవెల, ఈ ఇల్లు, కావిళ్ల భాగ్యం’ వంటి పలుకులున్నాయి. పాటలోనే ఉంటే ఇంకా కోవెల చూపకుండా ఉండగలరా విశ్వం గారు! ఇంత మధురమైన విజీనారం సుశీలమ్మ గొంతు ‘శంకరాభరణం’లో ఎందుకు లేదో ఆ విశ్వనాధునికే ఎరుక. స-కారం, శ-కారం వంటి సినీ టైటిల్ సెంటిమెంట్ లేని రోజుల్లోనూ విశ్వం గారి సినిమాలు ఎంతో బావుండేవి. అంతెందుకు- అన్నపూర్ణా వారు అనుకున్నఆస్థాన దర్శకుడు ఆదుర్తికి బదులు ఆయన సహాయ దర్శకుడైన కె.విశ్వనాథ్ చేతిలో ‘ఆత్మ గౌరవం’ సినిమా పెడితే విశ్వం ఎంత బాగా తీసారూ! ఈ సిన్మాలో ఉన్నన్ని డ్యూయట్లు మరే సిన్మాలో లేవు. వెతికి చెప్పగలరా? ఇంకో విశేషం- విశ్వనాథ్- సాలూరు రాజేశ్వర రావుల కాంబినేషన్ లో ఇది తొలి సినిమా అయితే ఆ తర్వాత ‘కాలం మారింది’. నిజంగానే శంకరాభరణం తరువాత పేపర్లలో సినిమా కాలమ్ అనేది మారింది. ‘ఆత్మ గౌరవం’ సిన్మాలో ఈ ‘టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ సర్’ (గుడి మెట్ల బంగారయ్య – ని మా పసి(డి) రోజుల్లో తమాషాగా అందరూ ఆంగ్లీకరించి నవ్వుకునే వారు) గుడి చూపించలేదేమో అనుకున్నానే గానీ ‘ఓహో ఓహోహో ఓహోహో –టింగ్ టింగ్ టింగ్ –ఒక పూల బాణం తగిలింది మదిలో’ పాట చిత్రీకరణంతా హనుమకొండ వేయి స్తంభాల గుడి , రామప్ప గుడి చుట్టే జరిగినట్టనిపించింది. ఎందుకు డౌటేహం? వీడియో క్లిప్ చూడండి. ఎలాగూ అదీ ఇదీ మాట్లాడుకునీ ఇంత దూరం వచ్చేసాం కాబట్టి ఒకసారి ‘ గుడి గంటలు’ మ్రోగిద్దాం. ఈ ‘గుడి గంటలు’ ఏమిటీ – ఇది విశ్వనాథ్ సినిమా యేనా అని కొందరు, కాదు కదా అని కోపంతో కొందరు ఈపాటికి కామెంట్ రాయబోతూ ఉండ వచ్చు. నా విన్నపంబేమన – ఈ సినిమా లో ‘నీలోన నన్నే నిలిపావు నేడే –ఏ శిల్పి కల్పనవో ఏ కవి భావనవో’ అనే ఎన్టీఆర్ ఆర్ట్ వేస్తూ పాడే పాట నొక్కసారి గుర్తు చేసుకోండి. ఇది అనిసెట్టి వారి పాట. ఇందులోని చివరి చరణంలో ‘తొలి ప్రేమ దీపం వెలిగించి నావే- తొలి పూల బాణం వేసింది నీవే’ అని ఉంటుంది. అవునా? మరి ‘ఆత్మ గౌరవం’ పాటలో దాశరథి వారు ఆ ‘ఒక పూల బాణం తగిలింది మదిలో – తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే’ అని అనిసెట్టి మాటలే పునరుక్తం చేసారేం? విశేషం ఏ(విటంటే ఆ తొలి పాటలో ఆ మాటలు చరణం చివర్లో వస్తే ఈ మలి పాటలో ఏకంగా పల్లవిలోనే పల్లవించాయి. రెండూ ఘంటసాల (ఒకటి సోలో గానూ, ఒకటి డ్యూయట్ గానూ) పాడినవే. ఆ తొలి పాట ఎన్టీఆర్ దయితే ఈ మలి పాట ఏ ఎన్ ఆర్ ది. అందుకే అన్నారు కొసరాజు గారు- ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అనీ. నిజమే సుమండీ అని సినారె ‘ ఏనాడు ఏమౌనో ఎవరికి తెలుసు’ అన్నారు. అదే కొసరాజు ‘చెప్పటమే నా ధర్మం –వినకపోతే మీ ఖర్మం’ అని ఎన్టీఆర్ చేత అనిపించి విదిలించుకు పోతే దేవులపల్లి వారు ‘ తెలుసు కొనుట నీ ధర్మం- తెలియకుంటె నీ ఖర్మం’ అని ఏ ఎన్ ఆర్ చేత అనిపించి బెదర గొట్టేసారు. కాశీ విశ్వనాథ యాత్ర నుంచి కాపీ రైట్ వార్త వరకూ ‘ఈ పూట నా మాట’ సాగింది. ‘కాపీ’ అనరాదు ‘ఇన్స్పిరేషన్’ అనాలి- అనేది బప్పీదా ఉవాచ. రేపో ఎల్లుండో- మరిన్ని ఈ ఇన్స్పి’రేషన్’ క్లబ్ లో కొన్ని ‘కాపీ’ కప్పులు పంచుకుందాం. -- తాతిరాజు వేణుగోపాల్ (19 ఫిబ్రవరి 2011 )
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|