మునుపటి నా మాట
జూన్ నెల ఆరంభం అంటే కేరళలో ‘వానా కాలం వచ్చేసిందోచ్’ అని కొబ్బరి తోటలు తలలూపాల్సిన సమయం. ఇక అక్కణ్నుంచి మెల్ల మెల్లగా ఆంధ్రలోకి ఋతుపవనాలు ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే దశ. అయితే ఈ ఏడాది (2012) ‘మరి కొంచెం నిద్దురకానీ’ అన్నట్టు కేరళ వైపు ఋపవనాల రాక కొద్దిగా ఆలస్యమౌతోంది. ‘ఇంకా ఎండల కుంపటి నెత్తిని పెట్టుకు ఊరేగాలా’ అని దేశం మొత్తం అందరిలోనూ ఒక నీరసం ఆవహిస్తోంది. ఊరేగక పోయినా, ఉన్న ఊళ్ళో ఉన్నా దొందూ దొందే. ఇక్కడ కుంపటి అక్కడా రాజుకుంటోంది. జూన్ నెల ప్రారంభ కాలంలో ఈ రాజుకోవడం మాట పక్కన పెట్టి కోవా లాంటి ‘రాజా’ వారి గురించి అనుకోవడం ఈ పూట కాస్త రిలీఫ్ అనిపించదూ? ఇంతకీ ఏ రాజా వారో? ‘అయ్యా...మాకు స్కాములూ గట్రా తెలియవండీ ..ఏదో సంగీతం పిచ్చ ఉన్న వాళ్ళం ...మాకు తెలిసి ఇద్దరే రాజాలు – ఒకరు మెత్తని గొంతు గలాయాన ఎ ఎం రాజా – ఆయన లేరు. ఇంకో ఆయన – లయని ఆలయం గా మార్చుకున్న ఇళయరాజా – ఆయన పుట్టిన రోజు జూన్ 2న (జూన్ 3 అని కొందరంటారు). ‘ హమ్మయ్యా ...ఈయన ఊసెత్తితే మంచిది...కాస్త ఏ(విటీ...చాలా రిలీఫ్ మాకు’ అని కోరే వారి సంతోషం కోసమే ‘ఈ పూట నా మాట’. ఇళయరాజా వారి ఒంటి వయసు ఇప్పుడు 69 ఏళ్ళు. 33 ఏళ్ళ నాటికి గాని ‘స్వతంత్ర స్వర కర్త’ అనే ముద్ర పడలేదు ఆయనకి. ఇ’ళ’యరాజా కి వరాలిచ్చిన తమిళం ‘అన్నక్కిళి’ , తెలుగు ‘భద్రకాళి’ లోని ‘ళ’ కార వేళా విశేషమేమో గానీ మనిషి సరళం, మేధ బహుళం, స్వీయ బర్మన్ గళం, సర్వ manగళం, నవ్వుల గంగాళం, సమ్మోహన వాద్య మేళం------ఇంత నిక్షిప్త గుణ సంపత్తి ‘కల వారు’ రాజా వారు. ఇళయరాజా వారు ఇంకా పదిమందికీ తెలియని గిటారు రాజాగా ఉన్న రోజుల్లోనే స్వర జానకి ‘రాజా.... పిలుపు నాదేనురా...’అని ఒక పాట పాడడం కొందరికైనా గుర్తుండే ఉండాలి. స్వర కర్త ‘సత్యం’ పలికించిన రాజశ్రీ పలుకులవి. అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు- స్వర కర్త జి.కె. వెంకటేష్ దగ్గర ఉండే ఒక రాజా వారు ముందు ముందు ముందుకు దూసుకు వస్తారనీ, అలా వచ్చి సినీ సంగీత ప్రపంచ నడకలో ఒక మార్పు తీసుకు వస్తారనీ!
రాజా వారి స్వరాల కూర్పు, లయలోని నేర్పు స్వర జానకి గళం నుంచి కొన్నేళ్ళు , చిత్ర గళం నుంచి ఆ పైన , శ్రేయా ఘోషాల్ గళం నుంచి ఇక పైన స్పష్టమౌతాయన్నది ప్రపంచం పసిగట్టేసింది. లతా, ఆశా కోకిలల నుంచి ‘వహ్వా రాజా సాబ్’ వంటి తారీఫ్ లు, ఎం.ఎస్. విశ్వనాథన్ వంటి స్వర మేధావి నుంచి ఇసై రాజా ధాటికి ఐసై పోతూ చేసిన ప్రశంశలు రాజా వారికి దక్కిన అమూల్య నిధులు అని ప్రపంచం గుర్తించింది. అందరిలాగనే రాజా కూడా రెండు కళ్ళతో ఏడు రంగులు చూసినా రాజా వారి కళ్ళలో మాత్రం ఏడు స్వరాల రంగు,రుచి,వాసన దాగి ఉంటాయి. ఏడు స్వరాల మ్యాజిక్కే మ్యూజిక్ అని ఆయన అనుకున్నా ‘మెలోడీ’ పట్ల జాలి ఉన్న ఇంద్రజాలికుడు. పాట లోని మాటలు ‘రంపపు కోత’ పెడుతున్నా మెలోడీకి ఏం కాలేదు చూడండి అని చూపగలిగే గారడీడు. పాటలో వేగం ఉన్నా ‘శ్రావ్యత’ చెడకూడదు. పాటలో పరుగు ఆరోగ్యానికి అనువుగా ఉండాలే కాని పడదోసేలా ఉండకూడదు. అదీ ఆయన తనకు తాను అలవర్చుకున్న క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతోనూ, రాజీ పడని స్థిర వ్యక్తిత్వం తోనూ, స్వరాలు అందరికీ అందుబాటులో ఉంచుతూ మొత్తం ‘సినీ సంగీత పరిశ్రమ’ లోనే నిండు క్రమ శిక్షణ తీసుకొచ్చిన అరుదైన దార్శికుడు, సంగీత దర్శకుడు రాజా. రాజా చూడడానికి యోగిలా ఉంటారు. సంగీత సాధన వంటి యోగాభ్యాసమే అలా మలిచింది ఆయన్ని.వయోలీన్స్ మీద స్వరాల కదలికలు తప్ప సంగీతం లో వయలెన్స్ ఎరగని మెత్తని మనసున్న వాడు ఆయన. హార్మోనియం మీద తన బాణీ లోని హార్మనీ ఉందా లేదా అని శోధించుకోవడం, కొత్త వరస సాధించుకోవడం ఇదే యావ యోగ్యతగా ఉన్న మనీషి యావత్ ప్రపంచానికి దక్కడాన్ని మించిన యోగం మరొకటి ఉంటుందా? ‘రాజా – రాజాధి రాజా .. కోట లేదు పేట లేదు అప్పుడూ నే రాజా’ అని సినిమా హీరో తనకి తాను ఉద్దేశించి అనుకున్నా ఆ గీతాన్ని (డబ్బింగ్) రాసిన రాజశ్రీ కలం ‘రాజా’ వారి పేరునే కలవరించి ఉండాలి. పేట నుంచి కోట వరకు ప్రతిధ్వనించిన రాజా ‘ఇసై’ లను విన్న పండిత పామరులంతా ‘సై రాజా సై రాజా’ అని నినదించిన రవం – రాజా వారికి దక్కిన వరం, గౌరవం. పేరు రాజా అయినా బాపూ రమణలు మునుపెప్పుడో ‘మంత్రి గారి వియ్యంకుడు’ నే ఆయనకి అప్పజెప్పారు. వారికి ఇవ్వగలిగే సరియైన బహుమానం రాజ్యమే అని నిర్ణయించుకున్నాక పూర్తిగా ‘శ్రీరామ రాజ్యం’ సమర్పించేశారు ఇటీవల. ఆయన అలతి అలతి మాటలని పిల్లలకి తగ్గట్టుగా ‘అంజలి’ లో వినిపిస్తే పిల్లలు సంతోషించారు. ‘ఓ పాపా లాలి.., లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి’ అని జోల పాడితే వాళ్ళంతా తమ తమ ఇళ్ళల్లో, తల్లుల ఒళ్ళల్లో ఆరోగ్యంగా నిద్ర పోయారు. పెద్దవాళ్ళు ‘జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ ’ అన్నది విని, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అన్నది తెలుసుకుని తమతమ రోజులు, తప్పిపోయిన మోజులు గుర్తు చేసుకునీ ఆరోగ్యంగా నవ్వుకున్నారు. హిందీ శ్రోతలు కూడా ‘సుర్ మయి అఖియో(‘ నుంచి సన్నగా కన్నీరు కార్చి ‘సాథియా.. తూనే క్యా కియా’- అని ఆయన కనిపెట్టిన ఆరోగ్య పధకాన్ని అమలు చేశారు. ఆయన నేర్పిన ఆలాపనలు టీవీ సీరియల్స్ , వీక్షకుల మధ్య ‘పవిత్ర రిస్తా’ ని సాధించి పెట్టాయి, పెడుతున్నాయి. ఇక తెలుగు యువక జనం వైపూ సరికొత్త ఆరోగ్య ప్రభంజనం.... ‘సందెపొద్దుల కాడ సంపంగి’ నవ్వితే ‘బంతీ చామంతీ’ కూడా ‘ ఇందువదన కుందరదన’ వైపు చూసి ‘యమహో నీ యమా యమా అందం’ అనుకున్నాయి. ‘అరె ఏమైందీ ఒక మనసుకు’ ‘కొత్తగా రెక్కలొచ్చెనా’...... ‘ఘల్లు ఘల్లు మంటు’ ...ఎక్కడ విన్నా ‘నాదవినోదము’, ‘తకిట తకిట తందానా’లే, ‘తం తన తం తన తాళంలో రస రాగంలో’ రాజా వారి ‘మాటే మంత్రము!’ ‘రామచిలకా పెళ్లి కొడుకెవరే’ ‘సిరిమల్లె పువ్వా నా వాడు ఎవడే’ – మంత్ర ముగ్ధ అయి కలవరించని యువతి లేదు. దేశీయ పద్ధతిలోనే వాయిద్యాలు ఉపయోగించి ఎక్కడో విదేశాల్లోని కచేరీ వింటున్నఅనుభూతి కలిగించిన రాజా లోని విద్వత్తుకి పేరు పెట్టాలి. చెప్పండి- How to name it? ఏ శబ్దాన్నయినా మోసుకు పోగలది ఏ(వుందీ భూమ్మీద?- Nothing but wind! అలా ఇళయరాజా తను కట్టిన ప్రతి పాటనీ గాలికొదిలేస్తారా... అది గాలి పటంలా ఎగిరెగిరి తిరిగి ‘గాలి పాఠం’ లా సంగీతం బళ్ళో వాలి కొత్త సిలబస్ ‘సెట్’ చేయిస్తుంది. విదేశాల్లోనూ ఆయన ఒక వాద్య ఘోష్టి రాయి విసిరితే అది Blood Stone అయి పోతుంది. అదీ అలా ఉండాలి ‘రాజా’ లా ఉండడమంటే... సంగీత సామ్రాజ్యంలో పోగయ్యే కొత్తదనమే రాజా వారి నిలువెత్తు ధనం! పద్మ భూషణుడు రాజా వారు మూకాంబిక పద పద్మాల భూషణమే తాను అన్నట్టు ‘జననీ జననీ’ అని నిత్యం స్మరిస్తారు, ఆ తల్లి ప్రసాదించిన సంగీత విద్యలోనూ, రమణ మహర్షి ధ్యానం లోనూ మునిగి తేలుతూ ‘గజిబిజి, బిజీ బిజీ ప్రపంచాన్ని విస్మరిస్తారు. అంబ పలికితే సరే. కాని ఇంత పెద్ద రాజా వారిని ‘ఒరే’ అని తెలుగులో అనగలిగిన ‘బాలు’డొకరున్నారు. తమిళంలో ‘ఒరే’ అంటే ‘ఒక’ కాబట్టి ‘రాజా ప్రతిభ ఒక్కటే ... సినీ భవిష్యత్తుకి ఒక వెలుగు రేఖ’ ’ అని ముందు చూపుతోనే ఆ ‘బాలు’డు ఆలోచించి అలా పిలిచి ఉండాలి. ఇంకా చల్లకొచ్చి మంత దాచటమెందుకూ? ఆ బాలుడు ఎవరో కాదు ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం’ అనే ‘కొండంత’ యశశ్విని గోరంత సైజులో గుండెలో దాచుకోవడానికి తెలుగువాళ్ళు, తమిళం వాళ్ళు, కన్నడం వాళ్ళు పధకం వేసి కుదించేసి పిలుస్తున్న ‘బాలు’ గారే. అంబ బాలుడు సుబ్రహ్మణ్యుడే కదా. అదీ చొరవకి కారణం! ఈ ‘బాలు’డు పుట్టిన రోజు – ఈ జూన్ 4 న. అంటే అది- Balu Day ! ఇప్పటికీ ఆయన ‘బాలు’డే! అయితే, 66 ఏళ్ళ వయసు అవలీలగా మోస్తున్న ‘బాలు’డిప్పుడు. ఇరవై ఏళ్ల వయసు నాడూ బాలుడే కనుక సినీ ద్వారం దగ్గర జయుడు లాంటి గూర్ఖా లక్ష్మణ ‘రేఖ’ గీసి ‘ససేమిరా దాటకూడదన్నాడు ఆయన్ని. మిత్రుడు ‘మురళి’ ఎంత శ్రావ్యంగా విన్నవించుకున్నా గూర్ఖా వినడే.. తొలి అవకాశం చేజారిపోయినంత పని చేశాడు. విజయా గార్డెన్స్ కి పిలిపించినది ‘కోదండపాణి’. సినిమా పేరు ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. సంస్థ పేరు- ‘రేఖా అండ్ మురళీ’. ఆలస్యమైనందుకు ఆదిలోనే చీవాట్లు. కారు కోసం చూసి చూసి విసిగెత్తి అలా వచ్చినందుకు ఇదీ ఫలితం. అసలు విషయం – కారు డ్రైవర్ ఎవర్నో దారిలో గ్రుద్దేడు, అయ్యో పాపం అని హాస్పిటల్ కి చేర్చి మరీ వచ్చాడట. ఈలోగా వీళ్ళు కారూ గీరూ రావ్ రావ్ అని తీర్మానించుకునీ ఇటు వైపు వచ్చేశారు. తొలి పాట పల్లవి ‘ఏమి ఇంత మోహం’ అయినా అనుభవం చెప్పినది ‘ఏమి ఈ వింత శోకం’ అనే. అయితే బాలు పాడినవి ‘రావే కావ్య సుమబాలా, జవరాలా, ప్రియురాలా, నవ రాగా భావ మాలా’ – నాలుగు ‘ల’కారాలు. ఇంటి పేరులో ఒక ‘ల’, స్వంత పేరులో ఒక ’ల’ – అనే రెండు లకారాలు ఎప్పుడూ వెన్నంటి ఉన్నా తొలి పాట కూడా లకారాలివ్వడం విశేషం. ఆనాటికి ‘పీల’ గా ఉండి రాను రానూ ‘స్థూల’ కాయుడైన వారికి అక్కడా లకారమే. గానం సరస్వతీ కటాక్షం అయితే , గాయకుడికి లక్ష్మీ కటాక్షం కూడా ఉండాలి. కోరుకుంటే సరి పోదు- కాపాడుకోవాలి. అదియే 'బాల' రహస్యం. రాముడు మంచి బాలుడు – ఇది తెలుగింట ఒక నానుడి. సినీ ప్రపంచం తెలుసుకున్న సత్యం ఒకటుంది- ‘కోదండపాణి’ మంచి ఎంపిక ‘బాలు’డు- అన్నది. ఆ కోదండపాణి గురువు గారు ఏడేళ్ళు చేయి పట్టి ‘బాలు’డిని నడిపించారు. ఈ ‘బాలు’డు గురువాజ్ఞ అయినప్పుడల్లా ‘ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు’ నుంచి ‘పదిలంగా అల్లుకున్న పొదరిల్లు’ ని మించి ‘విశాల గగనములో చందమామ’ వైపు చూసి ‘కొండ పైన వెండి వాన’ కురిపించ గలిగాడు. గురువు కను మరుగైతే ... గానం తన గురుతర బాధ్యతగా తీసుకునీ గురువు పేరిట ‘ఆడియో ల్యాబ్’ సృష్టించి ‘కలకాలం ఇదే పాడనీ ... నీలో నన్నే చూడనీ’ అని అశ్రు ధారని ఆపుకొని ఆశువు, ధారణ ఆయుధాలు ధరించి తిరుగు లేని జైత్ర యాత్ర సాగించాడు. నాలుగున్నర దశాబ్దాల సినీ సంగీత సాగర మథనం లో ఈ పద్మ భూషణుడి అమృత గళం సాధించిన ‘రికార్డు’ల రేకులు నిత్య వికాసం తో వర్ధిల్లుతున్నాయి. అదే చాలు ‘శుభ’ మస్తు, కోరమన్యం. అయితే, ఇవాళ కనులు మూసినా పాటే లో అరుదైన బాలానందం కలిగించే పాటలే విందాం, మరి కనులు చూసినా పాటే కావాలే... రాజా వారి పాటల ఖజానా కొల్లగొడితే దక్కేది రెండు తమిళం, ఓ హిందీ, నాలుగు తెలుగు – వెరసి ఏడు స్వరాల స్వర కర్త స్వర దృశ్య మాలే. -డా. తాతిరాజు వేణుగోపాల్, 3 జూన్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|