మునుపటి నా మాట
‘నా మది నిన్ను పిలిచింది గానమై వేణూ..’ ‘ఆ వస్తున్నా.. పిలిచారా రామం?’ ‘భలేవారండీ .. రఫీ గారి పాట పాడుతున్నా.. అంతే’ ‘ఓహో.. అలాగా.. వేణూ అని దీర్ఘం తీసి... ఆపితే.. నన్నే పిలిచారనుకున్నా’ ‘అదే నా బాధ.. పాపం ఆయన్నీ తెలుగు పాట పాడమన్నప్పుడు సంగీత దర్శకుడు..ఎవరూ.. సాలూరు హనుమంతరావు గారు.. ఎక్కడ విడగొట్టాలో, ఎక్కడ కలపాలో చెప్పలేదనుకుంటా’ ‘మీరన్నది నిజమే.. వేణూ గానమై అని వస్తుంది కదూ.. వేణుగానమైకి బదులు’ ‘హిందీ లో హ్రస్వాలతో ఇబ్బందే. అక్కడ దీర్ఘాలే హెచ్చు. రఫీ గారిదే ఇంకో పాట ..తార లెంతగా మెరిసేనో... అన్న పల్లవిలో ఆయన తారా లెంతగా .. అనే పాడారు. అంతే కాదు ఎంతవారుగానీ, ఎంతగా అనే చోట ఆయన యంతవారు, యంతగా అనే అన్నారు’ ‘ఇంతకీ నా మది నిన్ను పిలిచింది గానమై ..పాట ఎత్తుకున్నారు, విశేషం?’ ‘మదికీ, సంగీతానికి అనుబంధం ఉందా? ఉంటే.. తెలుగు వారికి అది హిందీ నుంచి వచ్చిందా... ఇదే నా ఆలోచన’ ‘అసలు మది అన్నది మతి: అన్న సంస్కృత శబ్దానికి వికృతి అండీ’ ‘మతి అంటే బుద్ధి కదా. మది కూడా అంతేనా?’
‘మది అంటే మనస్సు, బుద్ధి.. రెండూనూ’ ‘కాబట్టే మనసుని కూడా సంగీతంతో ముడి పెట్టారు మన కవులు’ ‘ఆగండాగండి.. రామం గారూ.. హిందీ నుంచి ఆ అనుబంధం వచ్చిందా అని మీరన్నారు, అవునా?’ ‘అవును..’ ‘హిందీ లో దిల్ అంటే మనస్సు, హృదయం. దిలాసా అంటే ధైర్యం. కాబట్టి మది అనగా మనస్సు, దిలాసా అని నా అభిప్రాయం’ ‘మీరనేస్తే సరా? లోకులు వింటే నవ్విపోతారు’ ‘ఉండండి.. హిందీ పాటలు కొన్ని మోసుకొచ్చాను గొంతులో. పాడేసి భారం దించేసుకోవాలి. ఒకటి...గాతా రహే మేరా దిల్ .. చూశారా మనసు పాడుతోందట. ఇంకోటి- రే మన్ సుర్ మే గావ్... ఓ మనసా శ్రుతిబద్ధంగా పాడవే అంటున్నారు. హిందీలో మనసుకి సంగీతంతో అనుబంధం ఉందని చెప్పినట్టే కదా’ ‘మనసు పాడింది సన్నాయి పాట .. అది మన తెలుగు వారికి నచ్చిన అనుబంధం’ ‘నా మనసే వీణియగా పాడనీ.. నీ మనసే వేణువుగా సాగనీ ..నీనీనీ .. అనికూడా సాగదీశారు కదా మనవాళ్ళు. మలయాళంలో పంజాబీ ఉత్తమ సింగ్ ఉత్తమంగా ఓ పాట చేశారు- మది మౌనం వీణే పాడుం’ ‘మనసు అనే మూడక్షరాలకన్నా బహుశా మది అనే రెండక్షరాలు మేలేమో.. అందుకనే మనవాళ్ళు ఎక్కువగా మదిని సంగీతంతో ముడిపెట్టారు’ ‘మీరీ మాట అనకుండా ఉండగలరా? వస్తూనే నా మది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై .. అన్నారుగా?’ ‘ఏమో .. సడన్ గా అనిపించింది ......నా మది పాడిన ఈ వేళలో’ ‘అది కూడా పాటే. ఘంటసాల వారికి అప్పుడు శరీరం, శారీరం ఇబ్బంది పెడుతున్న దశ. మది పిలవడమనేది ఇంతకు ముందూ విన్నాం అండీ . గుర్తుందా మీకు ? పిలిచే నా మదిలో వలపే నీది సుమా .. పాట’ ‘ఒక కవి కేవలం మది పిలవడం గురించి ప్రస్తావిస్తే మరో కవి ఆ పిలవడాన్ని ఒక అలంకారంతో జోడించారు.. అంతేగా?’ ‘ఒక కవి మనసు పాడింది సన్నాయి పాట .. అనగానే మరో కవి మదిలో వీణలు మ్రోగే .. అని అనిపించారు. మధ్యలో అరుదైన ఓ పాట ఉందండీ ... మదిలో మౌనముగ కదలె మధురవీణ... అని పల్లవి’ ‘ఊహూ(.. అంతగా విన్నట్టు లేదు.. ఏ సినిమాలోది ఏమిటీ?’ ‘శకుంతల ..సినిమా పాట అది. బేహాగ్ రాగంలో ఉంటుంది. స్టేజి మీద పాడేవాళ్ళు ఇలాంటివి నేర్చుకోవాలి’ ‘ఇంతవరకూ మనం ఎన్నుకున్న పల్లవుల్లో వేణువు, వీణియ, సన్నాయి .. ఇవన్నీ వాయిద్యాలై ఉన్నాయి’ ‘వాయిద్యం ప్రసక్తి లేకుండా, పాట అనేది రాకుండా రాగం మోసుకొచ్చారు కొందరు కవులు. అలా మదికి, రాగంతోనూ ముడి పెట్టారు’ ‘అన్నీ సంగీతం భాగాలే కదండీ. మది, పిలవడం – ఈ రాగం అనే మాట మీరు గుర్తు చెయ్యడం బావుందండీ. ఒక పాత పాట బాలసరస్వతి, ఘంటసాల గారి యుగళ గీతం...’ ‘మదిలోనే మధురభావం, పలికేను మోహన రాగం... అదేగా మీరనబోయేదీ. మది పిలిచింది కొందరిని, మది పలికింది కొందరికి’ ‘నా మదిలోని భావం పసిగట్టారు మహానుభావా.. మోహన రాగం అనగానే ఒక పాట గుర్తుకొచ్చేయాలి. మీరాగండి.. నన్ను పాడ నివ్వండి.. ఒక మనసు పాడితే మోహన రాగం ...’ ‘ఇది మాస్టర్ వేణు గారు చివరి రోజుల్లో చేసిన అద్భుతమైన పాట.. అందరికీ ఒకటే తెలుసు ... పి.సుశీల గారు ఆ పాట పాడారని. ఇంకో వెర్షన్ ఉంది, జి.ఆనంద్ పాడారు’ ‘అయితే.. ఖజానా దులిపి నజరానా గా ఈ పాట మన శ్రోతలకి ఇవ్వాల్సిందే’ ‘ఇప్పుడు కాదు. మనసు కన్నా మది పదిలం. ఇవాళంతా మదిలో విరిసే తీయని రాగం మైమరపించేను’ ‘ఒహోహో.. యమన్, బేహాగ్ రాగాల మిశ్రమం అండీ ఈ పాట .. ఘంటసాల వారి ముద్ర స్పష్టం. రాగ మాలికలో ఉన్న శంకరాభరణం సినిమా పాట ఏమందీ .. రాగం తానం పల్లవి..నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి... అనేగా. బాలు ఇంత గొప్పగా పాడి అందరి మదిని ఆకట్టుకున్నారు. చివర్లో ఆ 'నిర్వాణ' ఒక్కటే కాస్త ఇబ్బందికరంగా వినిపించింది’ ‘నీ మదిలో దాగిన పాట నా పెదవిని పలికింది’ ‘నా మదిలో ఉన్నవి మీరు పాడేస్తే ఎలా? చూశారా.. ఎలా తన్నుకొస్తున్నాయో.. అరుదైన పాటలు. కమ్మనైన జానకమ్మ గారి గళ విన్యాసం అది. ప్రస్తుతానికి మది అనగా మనసారా పాడునది అని నేనంటాను. అసలు ఏ పాటనైనా మనసు పెట్టి పాడాలి. గొంతు సరస్వతీ కటాక్షం. మల్లాది కవి గారు ఏమన్నారూ... మది శారదా దేవి మందిరమే.. అనేగా?’ ‘అక్కడితో ఆగలేదు.. రాగభావమమరే గమకముల నాద సాధనలే దేవికి పూజ... అని విన్నవించుకున్నారు. ఇంతవరకూ బావుంది.. మదిలోని ‘మ’కారాన్ని మనసారా పాడునది అని మీరు అన్నారు. రెండో అక్షరం ‘ది’ సంగతో? ఏమిటండీ .. మాటాడరూ? ఏదో విన్న పాటలాగే ఉంది .. హమ్మింగ్ చేస్తున్నారు మీరు. ఆ( .. చౌదవీ(కా చాందో హో ... అవునా?’ ‘సారూ.. వచ్చేసారు .. నా రూట్ లోకి. ది- అక్షరాన్ని నేను ‘దిలాసాగా హమ్మింగ్ చేయునది’ అని నిర్వచిస్తాను’ ‘అంటే.. ఒక గాయకుడో, గాయనియో మనసులో అనుకుంటూ బయటకి హమ్మింగ్ చేస్తూ పాట ఎత్తుకోవడమా?’ ‘ఒక్కోసారి ఇద్దరూ హమ్ చేస్తారు. చౌదవీకా చాంద్ హో .. సోలో అయితే .. ఆ రాగ ఛాయలో కట్టిన ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి .. డ్యూయట్. ఆ పల్లవి మొదట్లో ఇద్దరూ హమ్ చేస్తారు. ఊహలు గుసగుసలాడే .. పాట మరో ఉదాహరణ’ ‘హమ్ అంటే మనం, నేను అని హిందీలో వూరికే అనలేదేమో’ ‘అబ్బా? ఏం జోకేరండీ. గోకులాష్టమి వెళ్ళిపోయింది. జోకులాష్టమి వస్తున్నట్టుంది’ ‘అష్టమి సరే.. ఇప్పుడున్నది అసలే కరువు.. పైగా అధిక మాసం’ ‘అవునండోయ్.. అధిక భాద్రపద మాసం గత శనివారం నుంచి. ఇలా రెండున్నర ఏళ్ళకోసారి అధికమాసమనేది వస్తుంది. మనకిక్కడ పాటలకి కరువు లేదు కానీ.. అధిక మాసంలా నేను అడిషనల్ బెనిఫిట్ ఈ హమ్మింగోపాఖ్యానం అనేది ఇస్తాను. క్లాస్ రూమ్ లో అధిక మాసోపాఖ్యానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంగ్లీషులోనూ, టెల్గు లోనూ’ ‘ఇంతకీ ఈ సోలో హమ్మింగ్ అనండీ....డ్యూయల్ హమ్మింగ్ అనండీ .. అవి ఇలానే ఉంటాయి. బహుశా మీ మదిలో ఓవర్ ల్యాపింగ్ వాయిస్ అనేది కదులుతోంది. అవునా కాదా?’ ‘మీ పేరు రామం గానీ .. మీ మదికి విరామం లేదండీ. ఈ ఓవర్ ల్యాపింగ్ రెండు రకాలు. పురుష గళం ప్రముఖం అయితే స్త్రీ గళం హమ్ చెయ్యడం ఒకటి. స్త్రీ గళం ప్రముఖ మైతే పురుష గళం హమ్ చెయ్యడం మరోటీ’ ‘అసలీ సిస్టం ఎవరు కనిపెట్టారో? ఈ పాటల వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. స్టేజి మీద ఒక్క గాయకుడో, ఒక్క గాయనియో ఉన్నారను కోండీ.. ఓవర్ ల్యాపింగ్ మినహాయించి సోలోగా పాడేసుకోవచ్చు’ ‘ఏదో ..అంతగా పరిచయం లేని పాట అయితే పరవాలేదేమో.. పాట స్వరూపం మొత్తం తెలిసిన శ్రోతలు కెవ్వున కేకలు పెట్టవచ్చు’ ‘మన పాత కెవ్వు, కేక .. నేగా మీరు వాడినదీ? ఈ రోజుల్లో కొత్త అర్ధాలు వచ్చాయండీ’ ‘వాటి సంగతికేం గానీండి.. ఒక్కటి మాత్రం నిజం. పాట అనేది గొంతులో కదిలే ప్రతి వ్యక్తీ సిగ్గుతోనో, పాట ట్యూన్ తెలిసినా ఓపెన్ గా పాడే ధైర్యం లేకనో బాత్రూం లో దూరి ధైర్యంగా ఆ పాట హమ్ చేసుకుంటాడు’ ‘బాతు రూమ్ లో హంస ధ్వని ....జలసంబంధమేమో?’ ‘జలసంబంధం... అంటే గుర్తొచ్చింది ఒక జలకాల పాట.. ఆడవే జలకమ్ములాడవే...ఇందులో తెలుగు శోభన్ పదం పాడుతుంటే మళయాళం షీలా ఓవర్ ల్యాపింగ్ పాడుతుంది. నిజంగా దర్శకుడు శ్లాఘనీయుడు. ఎందుకంటే .. సినిమాలో ఆ అమ్మాయి రష్యన్ దేశం నుంచి వస్తుంది. కాబట్టి తెలుగు పదానికి ఆమె హమ్మింగ్ ఇవ్వడం ఎంతో సబబు’ ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ.... అని హీరో చిలిపిగా ప్రశ్నిస్తే ఎంత గడుసైన హీరోయిన్ అయినా ఠపీమని జవాబివ్వక హమ్ చేసి కవ్వించాలి. అలా ఈ పాట చేయడం పుల్లయ్య గారి గొప్పతనమేమో! అసలు పాటలో హమ్మింగ్ అనేది ఉంచాలా వద్దా అన్నది దర్శకుడూ, నిర్మాతా అనుకుంటారేమో. పాట సన్నివేశం పండాలి కదా. నాకు తెలిసి నటీమణి బి.సరోజాదేవి నటించిన పాట సన్నివేశాల్లో హమ్మింగ్ ఎక్కువగా ఉండేది. ఆవిడ నోట వచ్చే ముద్దు ముద్దు మాటలే కాదు, ఆవిడకి సుశీలమ్మ పాడిన హమ్మింగులూ మెచ్చేవారు అప్పటి కళా పిపాసులు. ఒక సినిమాలో చిత్రకారుడు ఊహా సుందరి చిత్రాన్ని గీస్తూ నీలోన నన్నే నిలిపేవు నేడే అని పాడితే ఆ సుందరి ఆ రోజు హమ్ చేసింది. అదే మరొక సారి రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో అని చిత్రకారుడి ప్రసక్తి రాగానే ఆ మరో సుందరి హమ్ చేసింది కాస్త మోడరన్ గా. ఒకసారి పడవ మీద నాయకుడొక్కడే కొండ గాలి తిరిగింది గుండె ఊసులాడింది అని పాడగానే అక్కడెక్కడో గట్టు మీదున్న నాయిక హమ్ చేసింది. ఇంకోసారి సాగేను జీవితనావ అని మళ్ళీ నాయకుడు పడవ ప్రస్తావన తేగానే నాయిక హమ్ చేసింది. ఇలా కొన్ని పాటల్లో హమ్మింగ్ సారూప్యాలు బలేగా కనిపిస్తాయి, అదే.. వినిపిస్తాయి’ ‘ఇవన్నీ వినాలని ఉంది. వీలయితే వీడియోలు తెండి. గోదావరీ అవీ చూడ్డానికి బావుంటాయి. సరే..ముక్తాయింపుగా ఓ ఇంపైన స్లోగన్ ఇద్డురూ’ ‘ప్రపంచంలో అంతా కళా పిపాసులే.. అందరూ కోరుకునేవి ఫ్రీ పాసులే!’ 'రిపీట్ ప్లీజ్' 'ప్రపంచంలో అంతా కళా పిపాసులే ....అందరూ కోరుకునేవి ఫ్రీ పాసులే' ‘పోన్లెద్దురూ .. సంగీత కళా పిపాసి ఆర్ధికంగా కాకపోయినా హార్దికంగా ఆదుకుంటున్నాడు. అది చాలు’ ‘కరెక్ట్. అందుకే మదికీ సంగీతానికీ అనుబంధమనేది ఉందని తెలుస్తోంది’ 'అందరూ అదే అనాలి.. అప్పుడే మన ప్రయత్నం సఫలం' [సినీ నటి, రంగ స్థల నటి , రేడియో నటి, సినీ గాయని, నేపధ్యగాయని, రేడియో గాయని, బిలియర్డ్స్ క్రీడాకారిణి, తొలి చెన్నై ఆంధ్రసభ కార్యదర్శి........ఇంత చరిత్ర ఉన్నది ఎవరికీ? ఇతిహాసం విన్నారా ..ఆ అతిసాహసి మనకిక లేదని కూడా విన్నారా? ఆల్ బొమ్మలే లో ఆమె రూపం, తీరైనమాట లో ఆమె గురించిన వ్యాసాలు ఉన్నాయి. [కనులు చూసినా పాటే, కనులు మూసినా పాటే.. హమ్మింగ్ కి ఆడా మగా తేడా లేదు కాబట్టి మీరు ఎవరి పక్షం? చెప్పండి..హమ్ చేస్తే ఎలా తెలిసేది?] -డా. తాతిరాజు వేణుగోపాల్ , 26 ఆగస్టు 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|