మునుపటి నా మాట
మూర్తిగారింటికి వెళ్ళాలి. అప్పుడే కదా అన్నాను.. వెళ్ళి మోహన రాగం ఆయన గళం నుంచి వినాలని. ఊరికే అప్పుడలా అన్నానా ...లేక గాంధీ గారే మున్నాభాయికి కనిపించి అతనితో అదేదో సినిమాలో మాట్లాడినట్టు నా చేత అనిపించారా? గాంధీ గారేమిటీ? మోహన రాగం ఏమిటీ? పొంతన లేని గొడవలా అనిపిస్తోందా? ఉంది- పొంతన ఉండబట్టే ఆలోచనలు పొంగి వస్తాయి. గాంధీ గారి పూర్తి పేరేమిటీ? మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ – అవునా? మహాత్ముడి పేరులో మోహన శబ్దం ఉంది కదా. కనుక మోహన రాగం ఈ పూట ఆలపిస్తే ‘మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం’ అత్యంత మోహనంగా, మోహన కృష్ణుడు మురళి నూదినంత మనోహరంగా ఉంటుంది. మనిషిలో ఏది మోహనం? రూపా? నడవడికా? నన్నే కాదు నిక్సన్ ని అడిగినా, పాబ్లో నెరూదా నడిగినా, ఒబామా నడిగినా, ఒసాబిసా బృందాన్నడిగినా వచ్చే సమాధానం ఒకటే- కసాయి వాడిని సైతం మునిగా మార్చేసే బోసినవ్వు, ఆగిపోవడం కాదు సాగిపోవడమే లక్ష్యం అన్నట్టుండే చక చక నడక, దేశమాత స్వేఛ్చ కోసం కాయలు కాచే కళ్ళు, చిన్న అంగోస్త్రం చాలు సిగ్గు పడే ఈ దేహానికి అనేట్టు ఉండే కట్టు, తనని తాను తీర్చి దిద్దుకోవడానికి భగవద్గీత సాయం కోరే చేతులు, రేపటి చిరుగులకి విరుగుడు మంత్రం సూచించే చరఖా, గుండ్రటి విశ్వం లో కాంతి కిరణాలు దారి తప్ప కూడదని చూపించే కళ్ళజోడు ... వెరసి ఒక మానవుడు భూమ్మీద వెలిశాడు. అటువంటి ఏకైక మానవుడిదే మోహన రూపం. మోహనదాస కరంచంద్రుడిని మహాత్ముణ్ణి చేసిన రూపం. ఆ రూపం పుట్టి నేటికి నూట నలభై మూడేళ్ళు కావస్తోంది. నేటి యువత సైతం మహాత్ముడే తమకు ఆదర్శం అనడం వింటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. అది సత్యాగ్రహానికో, అహింసా తత్వానికో అబ్బురపడి యువత చేసుకున్న నిర్ణయం కాదు. కనపడని దేవుళ్ళు ఎందరున్నా కనిపించే దేవుడి కోసం వెదుకులాట ప్రారంభిస్తే తప్పకుండా తేలే మానవ మూర్తి, మోహన మూర్తి కరంచంద్ గాంధీయే.
నా ఆలోచనలు మూర్తిగారింటికి దారి చూపిస్తున్న మెట్ల దగ్గర ఆగాయి. ఒక్క ఫ్లోర్ పైనే ఆయన ఉండేది. లిప్త కాలంలో లిఫ్ట్ లేకుండా చేరుకోవచ్చు. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతుంటే ఒక్కొక్క మాటా స్పష్టంగా వినిపిస్తోంది. ‘నీవు తీసిన బాటలు దాటి నీతిని విడచి నిన్నే మరచి నీ అనుచరులే మారెదరేమో ....నిదురనుండి లేపు ..బాపూ’. స్వతంత్రం వచ్చిన దశాబ్దం నాటికి వచ్చిన సినిమా పాట అది. ఆరుద్ర చమకం అది. తలుపు తడితే పాట సగంలో ఆపేస్తారు మూర్తిగారు. పాట ఆపమని చెప్పే ఆ పని చెయ్యకూడదనుకున్నాను. టేప్ రికార్డర్ లోనూ అంతే- గాయనియో, గాయకుడో పాడుతున్న పాట కనీసం లైన్ పూర్తయ్యేవరకైనా ఆగకుండా కొందరు దాని గొంతు నొక్కేస్తుంటారు. అయ్యో అదేమిటండీ అంటే ‘భలేవారే. మరీ చాదస్తులు మీరు’ అంటారు. మూర్తిగారు పాటలోని మూడో చరణం పాడలేదు. తలుపు తట్టాను. ‘రండి రండి ...ఇప్పుడే....’ అంటూ చెప్ప బోతున్నారు ఆయన. ‘వింటున్నా.. నమో నమో బాపు ..పాటలో ఒక్క చరణమే విన్నా .. కాస్త ముందైనా వచ్చాను కాను. ముందే ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పే అలవాటు లేదాయే. ఆనందం అనేది వెతుక్కోవడంలోనే ఆనందం ఉంది’ అన్నాను. ‘ఆఖరి చరణం ఆపేశా. ఇవాళ గాంధీ జయంతి కదా. ఆయన పుట్టిన రోజున ఆరిపోయిన దీపాన్ని కాదు ఆఖరిదాక అది ఇచ్చిన వెలుగునే గుర్తు చేసుకోవాలి’ అన్నారు మూర్తిగారు. ‘మోహనరాగం లో ఆలపించారు. అసలు మీ ద్వారా మోహన రాగంలోని ఒకటి రెండు కీర్తనలు, కొన్ని సినిమా పాటలు పాడించుకోవాలని అనిపించి ఇటుగా వచ్చాను. కరెక్ట్ గా మీరూ మోహన రాగమే అందుకున్నారు’ అన్నాను. ‘నను పాలింపగ నడచి వచ్చితివో నా ప్రాణనాథా’ అన్నారు.. ఉహూ(.. పాడారు మూర్తిగారు. ‘అయ్యో.. త్యాగయ్య గారి కీర్తన రామ మూర్తి గురించి.. మీ ఈ స్నేహుతుడి గురించి కాదండోయ్ మూర్తిగారూ’ అని నవ్వేశాను. అంతటితో ఆగేనా.. ‘మోహనరాగ మహా మూర్తి స్వంతమాయే’ అని గళం కదిల్చాను. మూర్తిగారి కళ్ళజోడు మరీమరీ నవ్వింది. ‘నవీనుల మధ్య వీనులకి విందు కలిగించిన ఏకైక స్వర కర్త ఇళయరాజా వారే. మోహన రాగాన్ని సొగసుగా తీర్చి దిద్దిన ఘనుడాయన. ఆకాశంలో ఆశల హరివిల్లు, వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే, కొత్తగా రెక్కలొచ్చెనా వంటివి ఎంత బావుంటాయీ! మోహన రాగంలో ఇళయరాజా గారు నిన్ను కోరి వర్ణం అని తమిళంలో ఓ పాట చేశారు. వరణం (రాక), వర్ణం అనే చమత్కారం తమిళ కవికి తోస్తే తెలుగు సేతకి కుదరక ఏదో కిట్టించేశాడు. నిన్ను కోరి అనే వర్ణం ఉంది...’ ఇంకా ఏదో చెప్పబోతున్న మూర్తిగారి మాట పూర్తి చెయ్యనివ్వక తొందర పడ్డా. పడి అన్నా- ‘మూర్తిగారూ.. నిన్ను కోరి వర్ణం త్యాగరాజు గారిదని ఆ అగ్ని నక్షత్రమో ఏదో ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో అనేవారు. కాదంటే వినరే..’. మూర్తిగారు సంగీత రత్నాకరంలాంటి పుస్తకం ఏదో తెస్తున్నారేమో అనుకున్నా. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేల? అన్నట్టు ఆయనకవేవీ అవసరం లేదు. ఆయన అన్నారు-‘ శ్రీనివాస అయ్యంగార్ ...అంటే... రామాంతపురం శ్రీనివాస అయ్యంగార్ .. అసలు పేరు పూచి శ్రీనివాస అయ్యంగార్ ... ఆయన స్వర స్వరచన .. నిన్ను కోరి యున్నానురా నిఖిల లోక నాయకా ... అనే వర్ణం ..మోహన రాగంలో ఉంటుంది. ఆయన తన ముద్రగా వర్ణం చివరలో శ్రీనివాస అని అంటారు’. ‘చెప్పి పుణ్యం మూట గట్టుకున్నారు. ఎవరిదా ఈ వర్ణం అనే ఘర్షణ లేదింక’ అన్నాను. ‘అగ్ని నక్షత్రమే తెలుగులో ఘర్షణ అయింది అని మీరు చెప్పకనే చెప్పారు’ అన్నారాయన. ‘సూర్యుడు నక్షత్రం కదా.. అగ్ని నక్షత్రం అంటే సూర్యుడు అని అనుకునేవాళ్ళూ ఉన్నారండోయ్. కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అంటారని’ చెప్పబోతుంటే ‘ఆస్ట్రాలజీ వాళ్ళకే తెలుసంటారు అని నవ్వేశారు మూర్తిగారు. ‘మనకి ఒకప్పుడు రాజేశ్వరరావు గారు ఎన్నెన్ని మోహన రాగ మాధుర్యాలు అందించేవారూ..పాడవేల రాధికా , వినిపించని రాగాలే, మదిలో వీణలు మ్రోగే, , మధుర మధురమీ చల్లని రేయీ, ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, చేయి చేయి కలుపరావే హాయి హాయిగా’ అని ఒక్కొక్కటీ అలాగే ఆలపిస్తూ ఆగాను. ‘అన్ని ముక్కలూ అతికినా అర్ధవంతంగానే ఉంది. ఒక వాక్యం అయిపోయింది. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో, చెంగు చెంగునా గంతులు వేయండి...’ అని ఆగారు మూర్తిగారు. ‘ఇదీ పల్లవుల ప్రారంభాలతో కూర్చిన వాక్యమే’ అన్నాను. ‘రసాలూరు రాజేశ్వరులు ధన్యులు’ అన్నారు. ‘కవులలో మోహనంగా పదాలు వేయటంలో పింగళి వారిని మించి లేరు అన్యులు’ అన్నాను. ‘దూసుకొస్తున్నాయి ఒక్కోటీ.. తెలుసు కొనవె యువతీ .. ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి.. లాహిరి లాహిరి లాహిరిలో...మనసు పరిమళించెనే తనువు పులకరించెనే ... మౌనముగా నీ మనసు పాడిన ...మోహనరాగ మహా మూర్తిమంతమాయే’ అని నవ్వుతూ ఆగారు. ‘ఈ పూట మాత్రం మూర్తి స్వంతమాయే’ అన్నాను. ‘ఏదో పాటలు వినడం, కొండ గుర్తులు పెట్టుకోవడం తప్ప నా సంగీత జ్ఞానం అంతంత మాత్రమె నండీ.. మీరు సెలవిస్తే ఆ పధ్ధతీ అదీ తెలుసుకోవాలని ఉంది’ అని నసిగాను. ‘తెలుసు కొనవె యువతీ .. అనలేను.. యువకులాయే మీరు’ అన్నారాయన కొంటెగా. ‘యువకుడినా? యాభై పై చిలుకు వాణ్ణి’ అన్నాను. ‘మోహన రాగం అందుకుంటే అరవైకీ ఇరవైకీ తేడా ఉండదు’ అన్నారు. అని - ‘మనం అనుసరించే కర్నాటక సంగీత పద్ధతిలోనూ, హిందుస్తానీ పద్ధతిలోనూ ఈ రాగం గ్రేస్ ఫుల్ గా ఉంటుంది. కర్నాటక పద్ధతిలో మేళకర్తలున్నట్టే హిందుస్తానీ లో థాట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ థాట్స్ కావండోయ్. కళ్యాణ్ థాట్ లో భూపాలీ, భూప్, భూప్ కళ్యాణ్ గా పిలవబడే ఈ మోహన రాగం ఆరోహణలోనూ, అవరోహణలోనూ అయిదు స్వరాలుంటాయి. అందుకే ఔడవ్-ఔడవ్ జాతి అంటారు. మ, ని – ఈ రెండు స్వరాలూ నిషేధం’ అన్నారు. ‘చిత్రంగా ఉందే- ఒక మకారం, ఒక నకారం పేరులో ఉండి కూడా మోహన రాగంలో మాత్రం మ, ని – ఉండవా? చూశారా.. నిధి చాల సుఖమా అని త్యాగయ్య మరో రాగంలో ప్రశ్నించినా మనీ ఊసేత్తవు కొన్ని రాగాలు’ అని గొణిగాను. భళ్ళున నవ్వారు మూర్తిగారు ‘ఫ్రీ ట్యుటోరియల్ ఇది’ అంటూ. ‘షడజ్ (షడ్జమం- స), శుద్ధ రిషభ్ (రిషభం –రి), శుద్ధ గంధార్ (గాంధారం-గ), పంచమ్ (పంచమం-ప), శుద్ధ ధైవత్ (దైవతం- ద)- వీటితో రాగ స్వరూపం స్పష్టమౌతుంది. స రి గ ప ద స – స ద ప గ రి స ..’ అని రాగం అందుకున్నారు ఆయన. ఆయన అంటున్నవి వింటూ రాసుకుంటున్నాను. 'హిందుస్తానీ పద్ధతిలో రాగానికి వాదీ, సంవాదీ స్వరాలు పేర్కొంటారు. భూపాలీ రాగానికి గ – వాదీ, ద –సంవాదీ. మోహన రాగం హరికాంభోజి నుంచి జనించింది. S R2 G3 P D2 S – S D2 P G3 R2 S అంటే స,ప లతో పాటు చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, చతుశ్రుతి ధైవతం – ఈ స్వరాలుంటాయి’ అని ఆగారు. ‘ఒక్కో సారి మోహనం తో పాటు శివరంజని రాగం కలిసి రావడం విన్నా.. సాధ్యమేనా?’ అడిగాను. ‘పాడవోయి భారతీయుడా ... పాట అటువంటిది. అలాగే వేషమూ మార్చెనూ పాట కూడా’ అన్నారు మూర్తిగారు. ‘ఏదైనా స్వరంలో మార్పు జరిగితేనే ఇది సాధ్యమౌతుంది కదండీ’ అన్నాను. ‘మోహనం లోని అంతర గాంధారాన్ని సాధారణ గాంధారం చేస్తే శివరంజని అయిపోతుంది’ అన్నారు. ‘భూప్, పహాడీ ఒకటి కాకపోయినా నా బెంగళూరు మిత్రుడు .. సంతానం ఆయన పేరు... పహాడీ రాగానికి మంచి పేరే పెట్టాడు’ అన్నాను. ‘ఏమని?’ అడిగారు ఆయన. ‘మలయ మోహనం’- అన్నాను. ‘మేధావి అయి ఉంటాడు ఆయన’ అన్నారు. ‘మూర్తిగారూ – ఒక్కో పాట ఎలా ప్రారంభించాలీ .. అనే విషయం గురించి చర్చించుకున్నాం. ఫలానా పాటకి ఫలానా రాగం అనేది నిర్ణయించడం ఉందే..’ అని ఆగాను. ‘దైవ నిర్ణయం’ అన్నారు. ‘స్వరకర్త, రచయితల నిర్ణయం కానే కాదంటారు’ అన్నాను. ‘కీర్తన తనదే, స్వరాలాపన తనదే అయినప్పుడు వాగ్గేయకారుడు ఆలోచించి అలోచించి పదాలు, రాగాలు ఎంచుకోడు. అవి దైవ విదితాలు అంతే. నను పాలింపగ నడచి వచ్చితివో .. అని త్యాగయ్య ముచ్చట పడి మోహన రాగంలో అన్నారంటే బహుశా ఆ మోహన మూర్తి అలా అలా తన వైపు నడచి వస్తున్న అనుభూతి అలా రాయించి ఉంటుంది, ఆ రాగంలో పాడించి ఉంటుంది’ అన్నారు. ‘కొన్ని సినిమా పాటలు ఉన్నాయండీ మూర్తిగారూ.. అందులో మోహన శబ్దం వస్తే మోహన రాగంలోనే స్వర పరిచారు. ఉదాహరణకి మోహనరాగమహా మూర్తి మంత మాయె.. అందుకు విరుద్ధంగా మోహన పదం ఉన్నా సరే మోహన రాగంలో స్వర పరచని పాటలూ ఉన్నాయి. మోహనరూపా గోపాలా .. ఓ ఉదాహరణ’ అన్నాను. ‘మోహన రాగమహా మూర్తిమంత మాయె – పాటలో పింగళి వారి చతురత గమనించారా? మోహన రాగం అంటే ఇక్కడ మనోహరమైన రంగు. ఆమె కుంచెతో అతని రూపాన్ని దిద్దుతోంది. అతను చిత్ర సీమలో .. అంటాడు. అంటే- ఫోటో ఫ్రేం లో అని అర్ధం. ఇంకో చతురత ఏమిటంటే- పెండ్యాల వారు సుశీల గారిని సినీ సీమకి పరిచయం చేశారు. ఆ రకంగా చూస్తే ‘చిత్ర సీమలో వెలయగ జేసి’ అనేది వారికి సరిపోతుంది. ఆ తర్వాత అన్నారే- దివ్య గానమున జీవము పోసి ... అది సుశీల గారికి సరిపోయే నికార్సైన ప్రశంస కదా. మోహన రాగం సుశీల గారి పేటెంట్ అనాలి. ఒక మనసు పాడితే మోహన రాగం .. అనే పాట ఉంది. సుశీల, ఆనంద్ వేరు వేరుగా పాడారు. వేణు గారు సంగీతం. పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం .. అనే పాట ఉంది . బాలు,సుశీల పాడారు. సత్యం గారు సంగీతం.’ ‘వహీదా రెహమాన్ నాట్యంతో మనసులు కొల్లగొట్టిన పాట -మదిలోని మధురభావం పలికేను మోహన రాగం’ ‘ఊ(.. జయసింహ లోని పాట.. బాలసరస్వతి, ఘంటసాల పాడారు. ఇంకా బాలసరస్వతి, ఎమ్మెస్ రామారావు పాడిన పాట ఉంది – ఓ రాజా మోహన రాజా .. అనేది. మొత్తానికి ఈ పాటలన్నిటా మోహన రాగం అని అనక పోయినా కవి మోహన శబ్దం వేసినందుకే మోహనంలో కట్టారో, లేక మోహన రాగంలో కూర్చాను పాట రాయండి అని స్వర కర్త అంటే కవీశ్వరుడు అలా రాశారో .. వారిరువురికే ఎరుక’ ‘మనసాయెరా మాధవా ... అన్న లలిత గీతంలోనూ చివర్లో మోహన మురళీ అని వస్తుంది. పాట కూడా మోహన రాగంలోనే ఉంటుంది’ ‘రఫీ, జానకి ల యుగళ గీతం ...నా మది నిన్ను పిలిచింది గానమై .. వింటూ వింటూ ఒక చోట మోహన మురళీ రాగాల లోన .. తేలుతాం’ ‘మోహనాల వేణువూదీ అంటాడు కవి వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడిని చూపిస్తూ’ ‘మధురమే సుధా గానం ... అని ఒక నాటి మెలోడీ ని తలపిస్తూ మాధవపెద్ది సురేష్ మోహన రాగంలో భలే పాట చేశారు’ ‘అందులోనూ మోహన శబ్దం ఉంది’ ‘మోహన మూర్తీ చంద్రుని గనవే .. అని ఓ డబ్బింగ్ పాట ఉంది. ఘంటసాల,లీల పాడారు. మోహన రాగం కాదు కదండీ’ ‘మోహన, చంద్రుడు .. అన్నారు.. మోహన్‌దాస్ కరం చంద్ రుడి గురించేనేమో..’ ‘సరేనండి మూర్తిగారు.. వెళ్ళొస్తా... సాయోనారా సాయోనారా....’ మెట్లు దిగానన్న మాటే గానీ మోహన రాగం మదిలోంచి దిగనే లేదు. మోహనమైన భూపాలీ రాగాన్ని పరిచయం చేసిన ‘భోపాల్’ లో అంత వికృతంగా గ్యాస్ ట్రాజెడీ జరిగిందే ఒకనాడు- ఆ ఘట్టం మదిలో మెదిలి గుండె బరువైంది. ఇంతకీ ఆ ‘భోపాలుడు’ ఎటు పారిపోయనట్టు? మోహన రాగం లో మురళి నూదే పోజులో గోపాలుడు గుళ్ళోనే ఉంటూ అంతా గమనిస్తున్నాడా? జంక్షన్ లో శిలా విగ్రహం గా మారిన గాంధీ బొమ్మ కెప్పుడూ బోసి నవ్వు ఎందుకుండదు? ప్రశ్నలకి కృష్ణప్రేమ లోని సినీ క్విజ్ కి రానట్టే సమాధానాలు రావు గాక రావు. -డా. తాతిరాజు వేణుగోపాల్ , 02 అక్టోబర్ 2012
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|