మునుపటి నా మాట
![]() 'నా..(ఆవలిస్తూ) కొరియా గుండ్రంగా రాయడం వచ్చు, తెలుగు వంకర టింకరలు లేకుండా వ్రాయడం వచ్చు' 'కొరియా వచ్చు, తెలుగు వచ్చు... అంటే మీరు ప్రపంచ లిపుల్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం పొందిన కొరియా, తెలుగు రెండూ తెలిసినవారిగా గర్వ పడాలి' 'కొరియా కాదండీ స్వామీ .. ఆవలిస్తూ నాకొరియా అనడంలో కొరియా అన్నదే మీకు వినపడింది. నాకు + ఒరియా = నాకొరియా అన్న నా 'సంధి' ప్రేలాపన అలా ఉంది మరి. కనుక నేనన్నది ఒరియా అని గ్రహించగలరు. చిత్తం స్వామీ' 'ఒరియా ఏమిటండీ ..ఇప్పుడది ఉడియా అయింది కదా' 'అభిషేక్ బచ్చన్ గెట్ ఏన్ ఐడియా అన్నట్టు ...గెట్ ఇంటూ ఉడియా..లెద్దురూ' 'కనుక నే చెప్పేది వినండి- ప్రపంచ భాషా లిపులలో కొరియా లిపి మొదటి స్థానం పొందితే మన తెలుగు లిపి రెండో స్థానం పొందింది' 'ఆహా( ... ఇంతకీ ఎవరిచ్చారు ఆ స్థానాలు? ఎవరి ఆస్థానంలో?' 'మద్రాసు విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారు....' 'ఏ(విటే(విటీ ...ఆయనదా ఈ చి'లిపి' తనం?' 'అదే మరి.. మాట పూర్తి కానివ్వక మధ్యలోఆపితే మీనుంగులు మారిపోయి మీనమేషాలు లెక్కేసుకోవాల్సి వస్తుంది' 'ఆపను లెండి.. కానీండి స్వామీ' 'ఈ మాడభూషి వారు థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ లో ఐఎఎ అంటే ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 4 వరకు నిర్వహించిన రెండవ ప్రపంచ లిపుల సదస్సులో పాల్గొన్నారు. పాల్గొని సమగ్రమైన పత్ర సమర్పణ చేశారు' 'పత్రిక లోని న్యూస్ చదువుతున్నట్టు భలేగా ఉంది మీ ధోరణి' 'పత్రిక లోని కటింగ్ ముందేసుకునీ చదివితే వచ్చేది అదే మరి. ఇదిగో ఇలా చీటికి మాటికి బ్రేకులొద్దు సుమీ' 'సుమీ... నయం. తెలియని వాళ్ళు నా పేరు సుమిత్ర కాబోలు, నన్ను మీరు అల్లారు ముద్దుగా సుమీ అని పిలుస్తున్నారు అని అనుకోగలరు, హలో లక్ష్మణా' 'బ్రేకులే అనుకుంటే వాటితో పాటు జోకులూనా?' 'రామ రామ ! లూనాలు, టీ వియస్ ల కాలం ఇంకా ఎక్కడిదండీ స్వామీ' 'మెషిన్ కి కాలదోషం ఉందేమో కాని భాష కి ఉండదు సుమండీ' 'ష కారాలూ మిరియాలూ నూరకండి స్వామీ, చెప్పండి' 'ఆ సదస్సుకి 33 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారట. తెలుగు,కన్నడ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ,ఉర్దూ భాషలకి చెందిన ప్రతినిధులు వచ్చారట' 'నిధుల సమస్య వచ్చి తతిమ్మా భాషల వారు వారి వారి ప్రతినిధుల్ని పంప లేదేమో' 'పంప లేదూ, ఊలార్ లేదు...సరసమైన భాషా ప్రసక్తి తెస్తుంటే ఈ సరస్సులెందుకండీ' 'బావుంది.. మీరూ జోకుతున్నారు. ఎలా ఉందంటే- మన ముళ్ళపూడివారి జోకులా ఉంది. అందాలరాముడు సినిమాలో రావి కొండల రావు గారు నాస్తికులు.ఆయన ఎదో చెబుతూ వస్తూ ' దేర్ ఈజ్ నో గాడెట్టాల్' అంటారు, ఇటు వైపు ఉన్న వైఫ్ 'ఇప్పుడా డెట్టాల్ గొడవెందుకండీ' అని అంటుంది' 'అదండీ తెలుగు... ఇంగ్లీష్ కలిపేసినా ఇంగువ చారులా ఘుమఘుమ లాడుతుంది' 'ఇప్పుడు మీరు ఘు అని ఈజీ గా టైపు చెయ్యగలరు, అనగలరు. కాని ఎందరికో ఆ గుణింతం రాయడమంటే కంఫ్యూజనే. అలాగే ష , ఘ లు రాయడంలోనూ ఇబ్బంది పడుతుంటారు. జ్ఞా పకం అని అంటూ టైపు కొట్టేసే అంత సులువు కాదు రాయడం. రాత సరే.. కొందరికది నోరు తిరగదు. ఐకమత్యం లో ఐ రాయడం. ఔనా లో ఔ, రాజౌతాడు లో జౌ రాయడమంటే చెమటలు పోస్తాయి కొందరికి. క్ష ఉందా రాయగలరు గానీ పలికేటప్పుడు ఛ అనేవారున్నారు. ఇవన్నీ ఏమాత్రం బాగా రాయలేని వారికి ఆ అక్షరమో, గుణింతమో గుర్తుంటే చాలు కంప్యూటరు సాఫ్ట్ వేర్లు ఆదుకుంటున్నాయి..ఇంగ్లీషులో మీటలు మొత్తేస్తే మాటలు వాటంతట అవే వచ్చేస్తున్నాయి' 'ఏమిటండీ మీరు మరీనూ.. ఒక పక్క ద్వితీయ స్థానం పొందింది మహాశయా అని తెలుగు లిపిని చూసి నేను గర్వ పడ్తుంటే, ఆ విన్న వార్తని అందరికీ చేరవేద్దా మనుకుంటే ఈ పెడసరం మాటలేమిటీ మధ్యన?' 'పెడసరం అని మరీ పెద్ద స్వరంతో అనకండి..నలుగురు వినీ నడుం విరవగలరు ..నాదేలెండి. మిగతా వార్త చెప్పండి స్వామీ' 'క్రీస్తు పూర్వం 400 సంవత్సరం నుంచి తెలుగు లిపి స్పష్టంగా ఉందట. పైగా బ్రాహ్మీ లిపి క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల నుంచి ఉందట. అందులోంచే అన్ని భారతీయ భాషలూ తమతమ లిపుల్ని పొందాయట' 'మరి కొన్ని భాషలకి లిపులు ఎందుకు లేవో ...లిపులమ్ముగా అక్కడ వివరించారా' 'అదేమో తెలియదు.. పేపరు వాడు రాయలేదు' 'అదే మరి.. లిపి లేని వాళ్ళు వేరే భాష లిపిలో రాసి ఉంటారు.. వాళ్ళు ఆ సదస్సుకి రావడం తుస్సు మని ఉంటుంది' 'వాళ్ళ గోల మనకేల? బ్రేకులు చాలించి చెవాకులు ఆపి నా వాక్కులు విందురూ' 'చిత్తం... బాల వాక్కు బ్రహ్మ వాక్కు.. చెప్పండి స్వామీ' 'ఏమిటీ.. నేను బాలుడినా ? కొంటెగా నవ్వితే బాల మురళిని, మిమిక్రీ చేస్తే బాల సుబ్రహ్మణ్యాన్ని, తల ఊపితే బాల కృష్ణని, కథ చెబితే బాల చందర్ ని తెలుసా' "మీరు నలుగురు బాల మూర్తుల ప్రస్తావన చేస్తే ఎలా?.. మీరు మూడు మూర్తులా 'బాల' మేధావులే" 'మేధావి అన్నారు బాగుంది. పైగా గుర్తొచ్చింది కూడా. అక్కడ తొమ్మిది మంది న్యాయ నిర్ణేతలు, యాభై మంది పరిశీలకులూ మాడభూషి వారి పత్రాన్ని సాంతం చదివి శాంతంగా ఈ నిర్ణయానికొచ్చారు ... తెలుగు లిపి ద్వితీయం అని' 'కొరియా లిపి ప్రధమం అనీ.. అవునా? ఒరియా భాషా లిపి వెళ్లి ఉంటే కొరియా బదులు ఒరియా వచ్చేది. ఓకే ..అంటే ఓ అన్నది కె అయిపొయింది' 'దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు' "హైలో హైలెస్స ... వాతావారణంలో లో ప్రెషర్ ఉంటే భీభత్సం , హయ్ ప్రెషర్ ఉంటే ఉత్సాహం ..కనుక ఈ 'హై , లో' ల మధ్య హై అనేది లెస్స కాదా?" 'అది మీ వరకే. భాషలో చెల్లదు. హిందీలో ఎ, ఏ అని లో గా ఒకటి, హై గా ఒకటి లిపిలో ఉండవు. కనుకనే రఫీ గారు తార లెంతగా మెరిసేనో అనడానికి తారాలేంతగా అని అన్నారు. ఇక్కడ లో లెస్స అని మనకి తెలుసు' "ఉ, ఊ అని లో, హై వోవల్స్ ఉన్నాయి కదండీ హిందీలోనూ.. అయినా సరే 'వేణుగానమై' అనడానికి బదులు వేణూ గానమై అని పలికారు రఫీ గారే కాదు జానకి గారూనూ" 'సంగీతంలో ఇలా హ్రస్వాలు దీర్ఘాలు కావడం, దీర్ఘాలు పొట్టివి కావడం మామూలే. కోతిబావకు పెళ్ళంట ....కాస్త కోతీ బావకు పెళ్ళంట గా మారలేదూ. తాళం కుదిరితే పల్లకీ లోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే అని పాడుకోవచ్చు, కుదరక పొతే పాటల పల్లకివై ...అని సరిపెట్టుకోవచ్చు. పల్లకి, పల్లకీ రెండూ సబబే ఇపుడు. పాడేవారికి ఎవరో ఒకరు ఎంత ఫెయిర్ చేసి పాట రాసిచ్చినా వారు రాసిన లిపిని ఓ కంట కనిపెడుతూ, తనకి తెలిసిన లిపిని ఊహిస్తూ, సంగీత దర్శకుడు ఎలా నేర్పితే అలా గాయనీ గాయకులు పాడాలి. సుశీలమ్మ గారు కౌగిలి అన్న మాట ఒక్కో సారి ఒక్కో రకంగా పలికే వారు. కోగిలి, కవుగిలి...అన్నట్టు ఉండేవి. బాలు గారు రాగాల పల్లకిలో కోయిలమ్మా, రాశాను ప్రేమలేఖలెన్నోఅన్నవి 'రా' తో అంటే ర-దీర్ఘంతో ప్రారంభమైతే రావ్ గాల, రావ్ శాను అనే అన్నారు. ఆయన మొట్ట మొదటి పాటలోనూ తెగ దీర్ఘాలున్నాయి. రావే కావ్య సుమబాలా, జవరాలా ప్రియురాలా, నవరాగ మాలా ....మళ్ళీ వినండి. ఆయనని అవి ఎంత కష్ట పెట్టేయో. రామకృష్ణ గారు సరేసరి... నడుము ఉన్నట్టా మరి లేనట్టా .....అని పాడుతున్నారో లేక నదుము ఉన్నత్తా మరి మేనత్తా.. అని అంటున్నారో తెలిసేది కాదు. ఆనంద్ ఒక మనసు పాడితే మోహనరాగం .. పాడుతుంటే ఎందుకో 'హృదయం' అనే మాటలో 'హృ' దగ్గర కాన్ఫిడెన్స్ లేకుండా పాడారని పిస్తుంది' 'మంచి లిపి రాసి ఇచ్చినా కొందరికి ద, ధ ల మధ్య పేచీయే, పదాలు పలికేటప్పుడు.. కథ కాస్త కధ అయ్యి ఇప్పుడు కద అయి పోయింది. బావగారు కాస్త భావ గారయ్యారు. భావ గీతం బావ గీతం అయ్యింది. గాలి కొందరికి ఘాలి. ఘంటసాల కొందరికి గంటసాల. బంధం లో ఒత్తు స్థాన భ్రంశం చెంది భందం అవుతోంది. కొందరికి బాధ పెద్ద బాధ. నొరు తిరక్క కాదు ఒత్తు ఎక్కడో తెలియక భాద అనాలో లేక భాధ అనాలో తెలియక తిక మక పడిపోయి ఎందుకొచ్చిన కష్టం లెద్దూ అని హాయిగా బాద అంటున్నారు. ఎవరికి వారే కృష్ణా గోదావరీ మంజీరా నాగావళీ వంశధారా తీరే .... పధ్ధతి మార్చుకోరు. స్పష్టత అనవసరం. మన లిపి వరల్డ్ నెంబర్ టూ అనుకొంటూ చంకలెగరెయ్యకుండా ముందు మన భాష సరిగా పలకడం నేర్చుకోవాలి. ఔనా కాదా చెప్పండి స్వామీ... అరరే .. అంత సెన్సిటివ్ అయితే ఎలాగండీ.. ఆ కన్నీరేమిటీ' 'అదా ..లిపి లేని కంటి బాస ..' 'చంపేరు స్వామీ. వేటూరి వారి పాటని ఇలా మలచుకున్నారా?' 'కాదు తలుచుకున్నాను. రాయడం మీద చాలా పాటలు విన్నాను కాని 'లిపి' ని పల్లవిలో పెట్టి పాట రాయొచ్చని నిరూపించాడు మహానుభావుడు' 'ఇంకా ఎందుకు ఆలస్యం ...ఆ పాట విందాం పదండి' 'లిపి అంటే అక్షర ఆకృతి కదా. లిపి మీద అన్ని పాటలు లేవు కాబట్టి అక్షరం మీద ఉన్నవి వినిపిద్దురూ' 'నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు....అని..' 'నాలాంటి మరో బాల మేధావి ...బాలగంగాధర తిలక్ ...రచయితా, కవి అన్నారు కదూ. అయితే మరి వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్ల?' 'బాపూ బొమ్మ' 'బాపు శ్రీరామరాజ్యం సినిమాని నిలబెడితే బంగారు నంది సినిమాకి వచ్చింది. మరెందరికో బహుమతులొచ్చాయి. బాపు వారికి ఏమీ రాలేదు అని తెలిసి నాకున్న ఒక్క మతి కాస్త పోయిందనుకోండి' 'మీకు మతి పోయిందని తెలుస్తూనే ఉంది... అయినా ఆయనకీ అవార్డులతో ఏం పని? ప్రపంచంలో తెలుగు లిపికి కొత్త రూపం ఇచ్చిన బాపు లిపి చాలు ...అది అందరికీ ఆయనిచ్చిన కానుక. ఒక్కసారి సంపూర్ణ రామాయణం (1972) సినిమా టైటిల్స్ చూస్తే సరి. కన్నుల పండుగ చేస్తుంది ఆయన లిపి. అవునండీ .. సందేహం.. వేటూరి వారు లిపి లేని కంటి బాస (భాష) అని ఎలా ఊహించారో ..' 'చిలిపి కనుల తీయని చెలికాడా, మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు ...అని కవులు కనుల ప్రసక్తి చిలిపితో ముడి పెట్టి తీసుకొచ్చారు కాబట్టి ..వెరైటీ గా 'ఛి' ఎందుకూ అని లిపి లేని కంటి భాష వేటూరి వారు ఎన్నుకున్నారు' 'ఎనీ వే ...తెలుగు భాష,లిపి విషయంలో కృషి చేసి ఘనత సాధించి పెట్టిన మాడభూషి సంపత్ కుమార్ గారికి కృతజ్ఞతలు,అభినందనలు, అభివందనాలు' 'ముక్తాయింపు ... అక్కడ సదస్సు లో తెలుగు అని అన్నారో, టెల్గూ అని అన్నారో తెలియదే' 'అది లిప్ మూవ్ మెంట్ సమస్య తప్ప లిపి కదలిక కొచ్చిన నష్టమేం లేదు' 'నాకో అయిడియా వచ్చింది. తెలుగు లిపి సినిమాల్లో చూడాలని మీకుందా? అయితే ఎంచక్కా సినిమాలలో ముందొచ్చే టైటిల్స్ షాట్ చూపిస్తే సరి. దసరాల సందర్భంగా ఈ సరదా కబురు మనకి చేరవేసిన సరస్వతీ దేవికి నమో నమో. మనల్ని తెలుగు వారిగా పుట్టించి చేరదీసిన వెంకట రమణుడికి బ్రహ్మోత్సాహ భరిత పాదాభివందనాలు' 'అబ్బో.. బ్రహ్మ కడిగిన పాదము అన్న అన్నమయ్యని గుర్తు చేశారు' 'తెలుగు నుడికారానికి శబ్దాకారం ఇచ్చిన అన్నమయ్య, తెలుగు నుడిలో బాధా తప్త వేదన జోడించిన రామదాసు, తెలుగుని రాగ మయం చేసిన త్యాగయ్య, తెలుగుని తాళ మయం చేసిన క్షేత్రయ్య - ఆ నలుగురికి మనం ఋణపడి ఉన్నాం. వారి వల్ల ఇంకా తెలుగు లిపి బ్రతికి బట్ట కట్టుకుంది' 'వర్తమానంలోకి వద్దాం- మల్లాది వారు వేంకటేశుని 'తెలుగు వారి ఇలవేలుపు' (రహస్యం, 1967) అన్నారు. అంతకు ముందే పింగళి వారు 'ఆంధ్రదేవా' అని సంబోధించారు (మహామంత్రి తిమ్మరుసు,1962). తెలుసాండీ?' 'అవును స్వామీ... రహస్యం సినిమా టైటిల్స్ లో కనిపించే అక్షారాల వెనక ఘంటసాల వారి మధుర గళం 'తిరుమల గిరివాసా' అని వినిపిస్తుంది. విందాం, చూద్దాం పదండి. ఆంధ్రదేవా ..అని వచ్చే ఆ పాట కాస్త విషాద యోగం లోనిది. మినహాయిద్దాం. ఇప్పుడన్నారే..సంబోధన అనీ ..కొందరు తెలియక సంభోదన అని అనడం కద్దు. ఈ 'ఒత్తుల డబ్బా' మన లిపి అనే షెల్ఫ్ లో గమ్మత్తుగా చోటు చేసుకుంది' 'ఒత్తైన జుట్టున్న వారు సైతం ఒత్తులు పలకలేక చింపిరి జుట్టుతో తేలుతారు అంటారు అవునా?...సరే ... కనులు చూసినా పాటే ..బావుంది . ఆ చూపుతో లిపి లేని కంటి బాస ..పాట కూడా ఇవ్వొచ్చుగా..' 'వద్దులెండి...ఎంత జంధ్యాల వారైనా అక్కడక్కడా తీసిన ఎబ్బెట్టు భంగిమలున్నట్టున్నాయి. హాయిగా కళ్ళు మూసుకుని విందురూ..' 'అంటే- కనులు మూసినా పాటే... లో నా చాయిస్ పాట అన్నమాట' 'భాష - అని కూడా సెలవిచ్చుకున్నాం కనక 'భాష' అనే మాట ఉన్నవీ, భాషా దోషాలు లేనివీ అయిన పాత పాటలు కొన్ని విందాం' 'అంటే..మౌనమే నీ భాష ఓ మూగ మనసా..వంటివా?' 'గుప్పెడు మనసు సినిమా లోని ఆ పాట చిత్రీకరణ అదేమిటో అలా గందర గోళంగా ఉందేమిటీ.. బాలచందర్ గారిదేనా?' 'ఏదీ ... వీడియో క్లిప్పింగ్ ఇవ్వండి.. తెలుసుకుందాం.. వద్దులెండి ..ఆడియో మేలు. ఆ చేత్తో మేఘ సందేశం లో బాలమురళీ కృష్ణులు పాడిన పాట ఇవ్వడం మరవకండి' 'నా భాషకు గీర్వాణి గా ...అని ఎంత హుందాగా అభినయించారండీ ఆ పాటలో మంగళంపల్లి వారు..అయినా ఇప్పుడది కనులు మూసినా పాటే . ఎందుకంటే మేఘసందేశం సినిమా వచ్చి ముప్ఫయి ఏళ్ళయింది కదా ..విడి విడిగా పాటలు చూడ నోచుకోలేక పోతున్నాం' 'మేఘం ఉన్నట్టుండి గర్జిస్తుంది ...ఆది నుంచి ఆకాశం మూగది. అనాదిగా తల్లి ధరణి మూగది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ..ఈ నడమంత్రపు మనిషికే మాటలు ...అన్నారు వేటూరి వారు. ఎంత మాటకారి మనిషికైనా మనసు మూగదే. ఆత్రేయ ఆ మూగ మనసుకొక భాషుంటుంది, చెవులుండే మనిషికే వినిపిస్తుందా అని వేటూరి వారికంటే ముందే చెప్పారు. ఏదీ.. ఘంటసాల వారి గొంతులో ఆత్రేయ గారి గుండెకాయ చూద్దామా?' 'ఉహూ(. విందాం. చూస్తే.. ఎ ఎన్ ఆర్ వారి నటన గుండె పిండుతుంది కాబట్టి ' ‘భాష రాని పాపాయి బోసినవ్వు చాలదా’ ‘సి నా రె... వహ్వారే... ఎంత బాగా అన్నారూ.. మాటల కందని అన్ని భావాలు ఒక పాటలో మూట గట్టి ఇచ్చినందుకు మెచ్చుకుంటూ విందాం. బహుశా ఆచార్యుల వారికి తెలుగు భాష తొలి శ్వాస’ 'ఒక్కొక్క పాటలోని భావం అలా అలా సిరా రూపం దాల్చి లిపి లో శిల్పంలా నిలిచి పోయి మన హృదయం కోవెల్లో పూజలందుకోవడం ..ఎవరి గొప్పతనం అందాం ?' 'తిరుగులేని సత్యం.....అది తెలుగు గొప్పతనం!' 'అవును.. తెలుగు లిపి ద్వితీయం అయితే నేం? తెలుగు భాష అద్వితీయం' -డా. తాతిరాజు వేణుగోపాల్ , 17 అక్టోబర్ 2012 (అద్వితీయ దసరా నవరాత్ర ప్రారంభంలో ద్వితీయ రాత్రం)
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|