మునుపటి నా మాట
నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం వెరసి ఎన్.టి.ఆర్ అనే మణిహారం ----ఔనంటారా కాదంటారా? 'నందమూరి తారక రామారావు' అనే బృహత్ మేరు పర్వత శిఖరాన్ని మనో దర్పణంలో చూసుకుంటే ఎన్.టి.ఆర్ అనే సంక్షిప్త రూపంగా కనిపిస్తుంది. అంతే కాదు- ఆ పొడి పొడి మూడక్షారాల వరస నట రత్నం, తెలుగు వజ్రం, రాత ముత్యం అనే కలబోత మణిహారంలా అనిపిస్తుంది. నటరత్నం- సరే సరి. తిరుగులేని సత్యం. అది ఆయనని వరించిన తొలి బిరుదు. సినీ కళామతల్లి బిడ్డలలో అటువంటి వారే అరుదు. తలపెట్టిన సినీ రంగ 'నటన' అనే వృత్తిలో భాగంగా 'దర్శకత్వం' అనేది అవతల పెట్టక రెండిటినీ సమపాళ్ళలో రంగరించడం ఆయనలాగ అందరికీ కుదరదు. తెలుగు వజ్రం?- ఇంద్రుడి చేతిలో 'పవి' అనే వజ్రాయుధం ఉండేదట. అన్యాయం మీద ఆ ఆయుధం ప్రయోగించేవాడట. తన ఎడమ చేతిని మడిచి ఒక్క వేలే చెంపల్ని తాకిస్తూ ఆత్మీయంగా చూస్తున్న ఆ తెలుగు చూపు లోనూ 'పవి' ఉంది. ఎటొచ్చీ అది 'పవర్ ఫుల్ విస్ డం' అనే ఇంగ్లీష్ మాటల పొడి పొడి రూపం. అదే ఆయన వజ్రాయుధం. అందులో 'తెలుగు వారి ఉనికి', 'ఆత్మాభిమానం' అనే తీక్ష్ణమైన వెలుగులు దాగి ఉన్నాయి. తెర మీది 'కధానాయకుడు' అంచెలంచెలుగా ఎదిగి తెలుగు 'దేశోద్ధారకులు' కావడమన్నది ఆ 'పవి' చలవ లేదా గరిమ. ఇదే ఫోటో తెలుగు వారి ఇళ్ళల్లో మూడు-నాలుగు దశాబ్దాలు అభిమాన దేవుడి పటంగా గోడకానుకుంది. చిత్రం ఏమిటంటే 'కధానాయకుడు' చిత్రంలో ఆయన కుడి చెయ్యి చాచి 'వినవయ్యా రామయ్యా' అన్నప్పుడు ఆయన కూడా అనుకోలేదు మరో దశాబ్ద కాలంలో ఎడమ చెయ్యి చాచి జనాన్ని కదిలించే 'అన్న' గా మారబోతాడని. అదీ నియంత్రణ, క్రమ శిక్షణ అనే రెండు వైపుల పదను ఉన్న 'పవి' మహాత్మ్యం. రెండు చేతులా పని ఉన్నప్పుడే మొండి శక్తి ఆవరిస్తుంది. అందుకే ఎన్.టి.ఆర్ మధ్య రూపం- తెలుగు వజ్రం. రాత ముత్యం?- ఆయన సన్నిహితులూ, స్క్రిప్ట్ చేజిక్కించుకున్న సినీ హితులూ చెప్పే మాట ఇది. ఆయన రాసే అక్షారాలు ఒద్దికగా, పొందికగా, ఓపికగా, నింపాదిగా, నిబ్బరంగా, ఒడిదుడుకులు లేకుండా యోగా ముద్రలో ఉన్నట్టు ఉండేవి. అవే రాత ముత్యాలంటే!
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|