మునుపటి నా మాట
‘సూర్య ‘భగభగ’ వానుడు అని ఈమధ్య ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో వచ్చిన హెడ్డింగ్ చూశాను. ఎవరి ‘పన్’ డిత్యమో గానీ , బాగానే ఉంది!’ ‘ఏం బాగో? ఎండలు మాడి మసి చేస్తుంటే’. ‘ఇదేం కొత్తకాదు, మన అమ్మమ్మల చిన్నతనంలో ఉన్నట్టే ‘రోహిణీ కార్తుల్లో’ ఎండలు ఇప్పుడూ ఉంటున్నాయి. అయితే ఓ పదేళ్లుగా ఏ ఏటికి ఆ ఏడే ‘ఈసారి ఎండలు నెత్తిని నిప్పుకుండలు’ అని ఉక్క భరించ లేక తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నాం. ఎండల్లాగే పుచ్చు రాజకీయాలు మన బుర్రల్ని దొలిచేస్తున్నాయి. అలా ఊడిపడిన పెచ్చులు ‘భూగోళ తాప ప్రభావం’ అని సరిపెట్టుకుంటే సరి. పాత ఊరే మన కొత్తగూడెం. కాని అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీలకి చేరుకునీ ఎప్పటికప్పుడు కొత్తగా గిన్నీస్ రికార్డ్ కెక్కబోతుంటే తన్నేసి పోతున్నారు. కొన్నేళ్ళ క్రితం కూడా రామగుండం లో ఇలాగే 50 డిగ్రీలు దాటితే అది రికార్డ్ కెక్కడం చూశామా?
0 Comments
‘అబ్బబ్బ బ్బ ! దొంగ లం.కొ. వంద రూపాయలు కొట్టేశాడు, నన్నేమార్చి’ – రాఘవరావు ఇంట్లో కాలు పెడుతూనే పెళ్ళాంతో అన్నాడు. ‘సర్లే. ఏంటా తిట్టు... మెల్లగా..., చుట్టు పక్కల వాళ్ళు వింటారు..’ అందామె. ‘వాళ్ళు వినటానికి మెల్లగా తిట్టమంటావా?’ –రా.రా. సరసోక్తి. ‘సర్లే సంబడం’ –ఆమె ఊత పదం. ‘ఎలా మోస పోయానో నాకే అర్ధం కావడం లేదు’ , గొణుగుడు ఆపలేదు ఆయన. ‘సర్లేవోయ్, దానికంత చింత ఎందుకూ? అవునుగానీ, చెప్పా గుర్తుందా, పనమ్మాయికి రేపు జీతమిస్తానని మాటిచ్చా. తెచ్చావా? లేక పొతే దొంగ ముం. మరో మూడు రోజులు పని మానేస్తుంది’ ఆమె బాధ ఆమెది. ‘ఆవిడగారు మానేస్తే నాకే కదా శిక్ష... తెచ్చా.. పనంటే గుర్తొచ్చింది దొంగ వెధవ జురాసిక్ కి ఫోన్ చెయ్యాలి. ’ –రా.రా ధోరణే అంత. ఆమెకి తెలుసు ‘జురాసిక్’ అంటే ఈయన గారి కొలీగ్ కె.సి.రాజు పేరు తిరగేసి ఈయన కోడై కూస్తున్నాడని. రాకరాక తన చెల్లెలు గిరిజ వస్తే ఈయన గారి కోడ్ లాంగ్వేజ్ తెలియక ఎంత భయపడిందీ.. ఈయన రాగానే చెల్లెలు సోఫాలో కూర్చున్నది కాస్త లేచి నిలబడితే ‘ఫరవాలేదు జరిగి, కూర్చో’ అన్నాడు. అప్పుడు తనే చెల్లితో అంది- “ ‘జరిగి’ అంటే నువ్వే, గిరిజ ని తిరగేసి అన్నారు బావగారు. ఇంగ్లీష్ లో రాసే ‘సత్యం’ కాస్త తిరగవేస్తే ‘మేటాస్’ అయ్యిందనీ ఇప్పుడంతా అంటారు గానీ, బావగారు ఇలాంటివి ముందే కనిపెట్టేరు” అని. అప్పుడు చెల్లెలు నవ్వేసింది. 2: ‘ఆధా హై చంద్రమా రాత్ ఆధీ’, ‘ఇక్ రాత్ మే దో దో చాంద్ ఖిలే – ఇక్ గూంఘట్ మే( , ఇక్ బదిలీ మే(’ 1: ఓహో, ఏ(విటి కథ, పింగళి నాగేంద్రరావు గారి వర్ధంతి కదా అని ‘వెన్నెలలోనే వేడి ఏలనో, వేడిమి లోనే చల్లనేలనో’ పాట పాడుకుంటూ వస్తావనుకుంటే , ఏకంగా సగం చంద్రుడు, రెండు చందమామలంటూ హిందీ లెక్కలు చెబుతున్నావ్ ఇవాళ! 2: అదే మన స్పెషాలిటీ. ఇవాళ ఓ ఖగోళ విశేషం జరగబోతోంది. కిందిటేడులాగే ఇవాళ చంద్రుడు సూపర్ మూన్ కాబోతున్నాడు. కన్యాకుమారిలో ఇలా సూర్యుడు అస్తమిస్తాడో లేదో చెంద్రుడు ఉదయించే ఘట్టం బావుంటుందని అంతా అక్కడికి పరుగులు తీస్తున్నారు. ట్రైన్ టిక్కెట్లు దొరక్క, తత్కాల్ క్యూలోని దళార్లకి మూడేసి వందలు పైగా చమురు పొయ్యలేక నా ప్రయాణం నా ఖర్మ అనుకుంటూ ఏదో ఇలా పాటలు పాడుకుంటూ గడిపేద్దామని నిశ్చయించుకున్నా. 1: మంచి పని చేశావ్. అయినా రోజూ కనిపించే చంద్రుణ్ణి ఏదో నిశితంగా పరిశీలిస్తున్నట్టు నీలాగే ఎందరో పోజు కొడతారు. ఏ కన్యనో, కుమారినో చూడ్డానికే గాని చంద్రుడి కోసం కానే కాదు. 2: ఎంత మాట అన్నావ్. 1: సరేగానీ, ఇందాక పాడేవే –ఆధా హై చంద్రమా అనీ. చెప్పు ఏ రాత్రి అలా చంద్రుడు కనిపిస్తాడు? 2: కవులంతా పున్నమి నాటి నిండు చంద్రుణ్ణి తలుచుకోవడం ఎరుగుదుం, అలాంటిది వీడెవడండీ బాబూ, సగం ముక్క అంటాడూ... హీరో గాని ఆష్ట్రనామరా? పూర్వ రంగం : ఇద్దరు స్నేహితుల మధ్య పాన ఘోష... 1:‘మత్త’ – అనే సంస్కృత అవ్యయం సంస్కృతార్ధంలో వాడితే ‘నా వలన’ అనే అర్ధం వస్తుంది. అదే ‘మత్త’ అనే విశేషణం ఉంది చూశావూ , మత్తెక్కినది, గర్వించినది అని అర్ధమిస్తుంది. అలా వచ్చి చేరినదే మన భాషలోని ‘మత్తు’ అనే వైకృత దేశ్య విశేష్యము. అంతేగానీ ‘నా వలన మత్తెక్కినది’ అని మాత్రం అనకు. ఎంత పార్టీ అయితే మటుకు పుచ్చుకోవడమేనా? నాలా మడి గట్టుకోవచ్చుగా? 2: అబ్బబ్బ, ఏదో చిన్న తప్పు చేస్తే మరీ దేవ భాష, మన భాష అన్నీ తీసుకొచ్చి నన్నిలా ఎద్దేవా చెయ్యడం నీకు తగదు సుమీ. 1: ఇప్పుడు సుమీ అంటున్నావు. నిన్న రాత్రి సునామీ. అవునా కాదా? అయినా నీకెలా గుర్తుంటుందిలే? అప్పుడు నీ స్టేజే వేరు. ఒకటే మంపు, ఒకటే కంపు! 2: మంపు అంటే? 1: అదే – మత్తు. 2: అలాగా ? కంపు అంటే వాసన, అంటే సువాసన అని పూర్వం కవులు పద్యాల్లో చెప్పేవారు. తెలుసా? 1:ఎవరికంపు వారికింపు. కంపు అనగానే శ్రీశ్రీ గారి ఛలోక్తి గుర్తొస్తుంది. ఆయన ఇలా అన్నారు- ‘ సిరిసిరి మువ్వ తరువాత చాలామంది శత’కంపు’ పద్యాలు రాస్తున్నారు’ . నవ్వేవా? సరే గానీ ప్ర.సా.దు తెలుసా? అమితాబ్ బచ్చన్ కి ‘కడుపులో నొప్పి’ అని వినగానే అఖిల భారత ‘అయ్యయ్యో అలాగా?’ సంఘం వారంతా హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు ముంబైలో. రజనీకాంత్ కి ఒంట్లో బావులేక సింగపూర్ వెళ్ళారని తెలియగానే అఖిల దక్షిణ భారత ‘అరరే అవునా’ సంఘం వారంతా ఎదురు తెన్నులు చూస్తూ గడిపారు చెన్నైలో. చెరొక సముద్రం పక్కనున్న ఈ రెండు చోట్లా ఎప్పుడూ ఇంతేనేమో! కావాలంటే సహకారం, కోరుకుంటే సానుభూతి సెలబ్రిటీ లకి లభిస్తాయి అక్కడ. ఆవిడ ఎందరికో తన సహకారం అందించింది. అటువంటి ఆవిడకి సంఘాల సానుభూతి లేదు. పోనీ ఆవిడ మొక్కూ మొహం తెలియని పాత నటి కాబోలు అని చేతులు దులిపేసుకోవడానికి వీల్లేదే! దిక్కూ మొక్కూ లేకుండా పడి ఉన్న అనాధ నటి కాబోలు అని పొరబడడానికి వీల్లేదే! మరి ఆవిడని సినీ పరిశ్రమ ఎందుకనీ పట్టించుకోలేదు? శ్రమ అనుకోకుండా ఒక్కసారైనా ఒక్కరైనా ముంబై నుంచి పూణే వచ్చి ఆమెని పలకరించి వెళ్ళలేదేం? దూరాభారమా? నవ్వుతారు పసివారు ఇది వింటే. ఇప్పుడు శ్రమ పడి వస్తారు. కాని ఏం ప్రయోజనం? ఎందుకంటే ఆమె కన్నెత్తి చూడలేదు, చిరునవ్వి పలకరించలేదు. అసలు భౌతికంగా ఆమె ఉంటే కదా.. ఏప్రిల్ 29 ఆదివారం రాత్రి అచలమైన ధైర్యంతో నిజంగానే మృత్యువుతో పోరాడి, ఇక వల్ల కాదని ఏ దేవ్ లోకం పిలుపో అందుకుందామె. ఆమె పేరు అచలా సచ్ దేవ్! ఆమె డబ్భై ఏళ్ళు హిందీ సినిమాల్లో ‘అమ్మ’ పాత్ర పోషించింది. దేవానంద్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ -----ఇందరికి ఆవిడే అమ్మ. మీనాకుమారి కి ఒకసారి అమ్మ, మరొకసారి అత్త. లక్ష్మికి అత్తే. కొందరికి వదిన. మరికొందరికి అక్క. మనకి కొన్నాళ్ళు కన్నాంబ, మరి కొన్నాళ్ళు అంజలీదేవి ఎలాగో హిందీ వారికి తరతరాలకూ ఆమె అలాగ. ఆ అమ్మ ని బాల్రాజ్ సహానీ ‘యే మేరీ జొహర జబీన్’ అని పొగుడుతుంటే సిగ్గుల మొగ్గ అవ్వడం గుర్తుందా? తన సిగ్గు మొహాన్ని చేతులతో కప్పేయలేదు ఆమె. ఎందుకంటే రెండు చేతులూ డోలు వాయిస్తున్నాయి అతని పాటకి. మొహం చాటుచేసుకుంటే నటన తెలిసేదెలా? మరి అటువంటి నటీమణి కడపటి రోజుల్లో ఉందని కొన్ని నెలలుగా తెలిసినా ఆమెనెరిగిన నటీనటులు మొహం చాటు చేసుకున్నారేం? |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|