మునుపటి నా మాట
యుగాంతం ...యుగాంతం అని దేశవిదేశాల్లో ఎందరో గొంతులు చించుకున్నారు, కొందరు సరదాగా, మరికొందరు నిజంగానే భయపడుతూనే. మాయన్లు (మయన్లు) ఏదో పాపం వాళ్ళ పూర్వీకులు లెక్క కట్టి చెబితే మిగతా వారంతా ఈ ‘జగమే…. మాయ కావడం’ ఖాయం అనుకున్నారు. ‘ఖాయము కాదిలన్ మనుజ కాయము’ అన్నారు కరుణశ్రీ కవిపుంగవులు. అయితే గియితే మనిషికే గాని ఈ ఇలకేదో ముంపు ఉందని ఎవరూ అనుకోరు. ఇంతకీ మాయన్లు ఏమన్నారూ? 21-12-2012 నాటికి 5,125 సంవత్సరాలు పూర్తయి ఒక శకం ముగుస్తుంది అనేగాని మొత్తం మానవ జాతి అంతరిస్తుందని కాదు. అంతెందుకూ, సరిగా మన పంచాంగం మనం తిరగేస్తే మనకి కూడా ఈ ఏడాదికి 5,113 కలియుగ సంవత్సరాలు ముగిసాయని తెలిసేది. అసలు మన కలియుగ కాలం ఎంత? 4,32,000 సంవత్సరాలు. అబ్బో—ఎంత దూరమూ అది ఎంత దూరమూ ! కాలం గురించి చెబుతూ దూరం దూరం అనడం ఘోరంగా లేదూ? కాలమే ‘దూరం’ అవ్వడం ఒక కాంతి సంవత్సరానికే సాధ్యం. మరో వారంలో మననుంచి దూరం అవుతుంది ఈ యేడు. మరో కొత్త వత్సరం, అదో కొత్త ఉత్సాహం. ఎన్నో కాంతులు, ఎన్నో చీకట్లు కలబోసుకుని ఒక్కొక్క సంవత్సరం వస్తుంటుంది.
0 Comments
శ్రీవేంకటరమణ – ఏడుకొండల సాక్షిగా ఏడక్షారాల ఆంధ్ర దేవుడు, తెలుగువారి ఇలవేల్పు. వెంకటేశ్వరరావు – కూడా అంతే..అదే ఏడక్షారాల ఆంధ్రుడు, తెలుగువారికి మరో రకంగా వేలుపు. అలా చెప్పే కన్నా ‘పద్మశ్రీ ఘంటసాల’ అని మార్చితే, అవీ ఏడక్షారాలై ఒద్దికగా ఉండి, బొద్దుగా ఉండి ఏడు స్వరాల రూపం దాల్చి ‘తెలుగువారి గళవేల్పు’ రూపంగా పరిచయమైపోవూ? అంతా ఆ ఏడుకొండలవాడి లీల అని అనుకుంటే లీల అనే మలయాళం మాతృభాషైన గాయని ఎంచక్కా తెలుగు వారికి తన సుస్పష్ట నవ్య దివ్య గాత్ర ‘సుమ’ పరీమళం అందించారూ.. అలా ఆమెను పరిచయం చేసినది ఘంటసాల వేంకటేశ్వరుడే! (సావిత్రి నటనకి జానకి స్వరాలా అని సంశయించే వారికి ‘తనకన్నా జానకి బాగా పాడుతుంది ఇలాంటి స్వర రచన’ అని ‘నీ లీల పాడెద దేవా’ పాటని జానకికి అందేలా చేసిన లీల గొప్పతనం సంగీత ప్రపంచానికి ఒక ధర్మ ప్రవచనం. కాకతాళీయంగా ప్రాసకవి ఆరుద్ర రాసిన ఆ పాటలో ‘లీల’గా పదం పడడం ఏడుకొండలవాడి లీల! ఆ పాట జానకి సంగీత గగనంలో వెన్నెలలు తీసుకొచ్చింది. అసలు వెన్నెల మహిమలు ‘లీల’గా తెలియడం అన్నది పింగళి వారి లీల. సావిత్రికి లీల నేపధ్యమే సరి తూగేది అని నిర్ధారించుకున్న రోజులవి కనుక చిత్రంలో నటించబోయి తప్పుకుని ‘మిస్సమ్మ’ అయిపోయారు భానుమతి . ఏమిటో ఈ మాయ.. అంతా నాగిచక్రనాగేంద్ర మాయ!) ‘నమస్కారం మాస్టారూ ... మీకు తొంభై ఏళ్ళు..’ ‘అవునా బాబూ... భూమ్మీద ఉంటే కదూ .స్వర్గ సీమలో ఈ గంధర్వ లోకంలో వయో పరిమితులు లేకుండా సుఖంగానే ఉన్నాను’ ‘మాస్టారూ.. భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అని మీరన్నారు. అదే.. పాడారు. కానీ మీరు లేక ఈ భూమ్మీద మాకేం సుఖం ఉందనీ? 1944 లో స్వర్గసీమ సినిమాలో తొలిసారిగా నట గాయని, బహుముఖ వరదాయిని భానుమతి గారితో యుగళ గీతం పాడి ..’ ‘అవును అలా సినిమాల్లో గాయకుడిగా అడుగు పెట్టాను. అప్పటికి నా వయసు ఇరవైరెండేళ్ళు’ ‘చిన్నవయసులోనే, సినీసీమలో ప్రవేశిస్తూనే గాయకుడిగా ఉంటూ సంగీతదర్శకత్వ బాధ్యతలూ భుజాన వేసుకోవడం మీ వంటి ప్రజ్ఞావంతులకే సాధ్యం. కాని మా బాధల్లా మీరు అయిదుపదుల వయసు చాలనుకునీ స్వర్గసీమకి వెళ్లిపోవడం’ ‘అంతా ఆ ఏడుకొండలవాడి నిర్ణయం బాబూ..మూడు దశాబ్దాలు అన్ని రకాల పాటలు పాడాను, స్వరాలూ సమకూర్చాను ......అది చాలు బాబూ..’ ‘మల్లాది రామకృష్ణ శాస్త్రి కవి గారు ఏడుకొండలవాడిని తెలుగు వారి ఇలవేల్పుగా కీర్తించారు. మేమంతా ముక్త కంఠంతో మిమ్మల్ని తెలుగువారి గళవేల్పు అని నిత్యం స్మరిస్తున్నాం. మీ అమూల్యమైన పాట సంపద ముందేసుకుని తరిస్తున్నాం’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|