మునుపటి నా మాట
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించడంలో డిసెంబర్ నెలా, సెప్టెంబర్ నెలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, ఎలా అంటే .. డిసెంబర్ లో winter solstice, సెప్టెంబర్ లో autumnal equinox వస్తాయి కాబట్టి. ఆ లెక్కన కాలం మారుతుంది. అలాగే ఒక న్యాయమైన తీర్పు చుట్టూ భారతీయుల మనసులు పరిభ్రమించడం గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభమై ఈ ఏడు సెప్టెంబర్ నెలతో ముగిసింది. కాలం మారింది. గాయాన్ని మాన్పింది. అందరి గురి ఒక ఆరుగురి పైన ఇన్నాళ్ళూ ఉండగా నలుగురికి ఉరితీత ఖాయం అన్న విషయం తెలిసి అందరి మనసులూ కుదుట పడ్డాయి. ఆరుగురిలో ఒకడు తనంతట తాను తల తెంచుకున్నాడు. మరొకడు ‘పాపం పసివాడు’ అన్న ధోరణిలో తప్పించుకున్నాడు. మిగతా నలుగురు కోర్టు తీర్పుకి తల దించుకున్నారు. ఒక డిల్లీ యువతి పట్ల జరిపిన పాశవిక చర్యకి వీళ్ళు ఉరికంబం ఎక్కడమే సరియైన న్యాయం అని న్యాయ దేవత గ్రహించింది. ఈ తీర్పు వెనక కోట్లాది గొంతుల ఆక్రోశం, ఆవేశం, సడలని పట్టు, శాంతియుత పోరాటం అన్నవి ప్రముఖ పాత్ర పోషించాయి. వాటికి జయం లభించింది. ఆ అభాగిని దామిని, నిర్భయగా అందరికి చెరొక కంటిలో అశ్రుకణంగా మిగిలినా ఆమె అసలు పేరు జ్యోతి. ఆ జ్యోతి తొమ్మిది నెలల క్రితం దారుణంగా ఆరిపోయింది. అయినా ఇవాళ నవ మాసాలు మోసి భారత మాత మళ్ళీ కన్న ఈ ఆడ శిశువుని న్యాయ దేవత తన తీర్పు పొత్తిళ్ళలో ఉంచి లోకానికి చూపించింది. దుష్టులుంటారు ....కరడు గట్టిన దుష్టుల్ని చూసినప్పుడల్లా,వినినప్పుడల్లా అయ్యో నారాయణా, దుష్ట శిక్షణ కోసం అవతరించు నాయనా అని ఎవరు మాత్రం కోరుకోరు? శ్రీకృష్ణుడు సంభవామి యుగే యుగే అన్నాడు. అంత భరోసా ఇచ్చిన వాడు ఏవో లెక్కలు తేల్చుకుని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడేమో ! బ్రహ్మ సృష్టించి, శివుడు నడిపిస్తే విష్ణువు ‘స్థితి’ బాధ్యత తీసుకున్నాడు. లోకం అనగానే దుష్టులూ,శిష్టులూ కలిసే ఉంటారు. కేవలం శిష్టులే ఉండరు. అలాగనీ అంతటా దుష్టులే ఉండరు. దుష్టత్వం మితి మీరినట్లయితే ఎప్పుడో ఒక చోట దానికి తెర పడాల్సిందే. శ్రీకృష్ణుడిగా ఒక పరిపూర్ణ అవతారమెత్తిన శ్రీమన్నారాయణుడు కృష్ణుడి ద్వారా తన అవతారాలన్నీ ఎందుకోసమో అన్నది స్పష్టం చేశాడు. తన శ్రీరామావతారంలో రాముడి ద్వారా నారాయణుడు పరశురాముడికి అంతకు ముందు తన అవతార రూపం పరశురాముడే అన్నది గుర్తు చేశాడు.
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|