మునుపటి నా మాట
‘ఒహో ఒహో నిన్నే కోరెగా ...కుహూ కుహూ అనీ కోయిల’- పాట వింటుంటే సలీల్ చౌదరీ, ‘ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో’ –పాట వింటుంటే నౌషాద్ గుర్తుకొస్తారు. ఎందుకంటే కళ్ళు మూసుకునీ వింటున్నాం కనుక. ఒక్కసారి కళ్ళు తెరిచి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలోని ఈ రెండు పాటలు చూస్తూ వింటే అప్పుడనిపిస్తుంది ‘అరె....ఇవి ‘ఈవిడ’ మీద పాటలా?’ అని. అక్కడ మన స్వరకర్త రాజేశ్వరరావు గుర్తుకు రానే రారు. పైగా దృష్టి అక్కినేని మీద నుంచి ఆవిడ మీదికి పోతుంది. 'ఈవిడ' చిరునవ్వు అలాంటిది, ఒక కోయిల గొంతులోని పంచమ స్వరంలా, ఒక పూవు పరచే పరిమళంలా. ఇంటిగుట్టు – సినిమాలో హీరో రామారావు, హీరోయిన్ సావిత్రి. అయితే అందులో ‘నాయుడోరింటికాడ నల్ల తుమ్మ సెట్టు కాడ సిటారు కొమ్మ మీద సెటాపటా లేసుకోనీ సిలకలల్లె కూకుందాము రాయే’ వంటి జానపదం చూడకుండా వింటే మల్లాది వారి రాతకి అబ్బుర పడడమెంత సహజమో, చూస్తూ వింటే ‘అరె ..ఇది 'ఈవిడ' మీది పాటా, పైగా గిలిగింతల జంబలకడి పంబ రేలంగి కూడా ఉన్నాడు’ అని విడ్డూరంతో విజిల్స్ వెయ్యడమూ అంతే సహజం. ఇదే సినిమాలో మరో చిలక పాటుంది. ‘బలు వన్నెల చిన్నెల దాన, వనరైన దాన’ అని ప్రారంభమౌతుంది ఆ పాట. వినగానే పల్లవి లోని పదాలబట్టి మల్లాది వారి రాతే అని ఈసారికి పసిగట్టేసినా, చూడగానే మాత్రం ‘అరె..ఇదీ 'ఈవిడ' మీది పాటేనా?’ అని పసితనపు అమాయకత్వం ముసిముసి నవ్వులు రానిస్తుంది. ‘చిట్టి తమ్ముడు’ సినిమా ఒకటుందని ఎప్పుడో మరచిపోయాం. (యూ ట్యూబు వింత ఏమిటంటే అక్కడ మనకి బాగా తెలిసిన సినిమాల పాత దృశ్యాలు లభించడం గగనమౌతుంటుంది. ఎప్పుడూ విననివి మాత్రం కోకొల్లలు). ఈ సినిమాలో ఇంతవరకూ చెప్పుకున్న ‘ఈవిడ’ పాటలు విడివిడిగా రెండున్నాయి. ‘మెరుపు మెరిసింది’ –పాటలో పాపం ఎప్పుడూ ఒక్క పాటకైనా నోచుకోని కండల విలనుడు రాజనాల కనిపిస్తారు (డబ్భయిల కాలంలో ఆంజనేయ వేషం వేయడంతో ఈయనకి పాటలొచ్చాయి అనుకోండి, అదృష్టవంతుడు). ఈ పాటలో మెరుపు,ఉరుము – వీటి అభినయం ‘ఈవిడ’ ద్వారా చూడగానే మనం కూడా కళ్ళూ చెవులూ తెరుస్తాం. అదీ 'ఈవిడ'కి తెలిసిన విద్య.
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|