మునుపటి నా మాట
జూన్ 17...జూన్ 15....జూన్ 13 అలా చదువుతూ పోతుంటే కేలండర్ రెండేసి రోజుల తేడాతో వెనక్కి పోతున్నట్టు అనిపించడం సహజం. కాల గమనంలో ఒక్కసారి జ్ఞాపకాల దారుల్లో ఆగి వెనక్కి చూస్తే ఆ మూడు రోజులు మన మధ్య లేని మహా పురుషులు ముగ్గురుని గుర్తు చేస్తాయన్నది నిజం. జూన్ పదిహేడున ‘అచ్చ తెనుగుభాష’ పుట్టింది, ఎప్పుడూ, 1905లో. జూన్ 15 న ‘విప్లవ భాష’ కనుమరుగైంది, ఎప్పుడూ, 1983లో. జూన్ 13న ‘గజల్ షాయరీ భాష’ మరో రూపంలో మూగ బోయింది, ఎప్పుడూ ... మొన్న మొన్ననే. అచ్చ తెనుగు భాష కి తెలుగువాళ్ళు పెట్టిన ముద్దు పేరు – మల్లాది రామకృష్ణ శాస్త్రి . విప్లవ భాష తెలుగు వాళ్ళకి నేర్పిన పెద్ద పేరు – శ్రీరంగం శ్రీనివాసరావు. ఇక్కడ దేశం లోని రాజస్తాన్ లోని ‘లూనా’ లో పుట్టి, పొరుగు దేశానికి వలస పోయి కుస్తీ పట్టు తో పాటు పట్టుదలతో గళం సవరించి ‘గజల్ షాయరీ’ భాషకొక రంగు, రుచి, వాసన ఉంటుందని తెలియజేసిన గాయక శిఖామణి పేరు- మెహదీ హస్సన్. మల్లాది వారి తెలుగు కరువై దాదాపు యాభై ఏళ్ళవుతోంది. మహాకవి కదిలించిన సాహితీ విప్లవ రధం ఆగిపోయి ఇంచుమించు మూడు దశాబ్దాలౌతోంది.
0 Comments
‘అనుకున్నామని జరగవు అన్ని... అనుకోలేదని ఆగవు కొన్ని’ – ఎంత బాగా అన్నారు మనసు కవి! వాన కూడా అటువంటిదే. ఇదిగో వచ్చేసింది కొబ్బరి తోటల కేరళకి అని ప్రకటిస్తే అవునుస్మీ ఎవరబ్బా, జబ్బ చరిచిందీ దెబ్బకి కదిలొచ్చింది అని బహుళ ప్రాసలతో బహుదానంద పడ్డాం. అది అంతలోనే చతికిలపడి పోయింది. అయినా ఆశ ఉంది... ఆలస్యమైనా ఆంధ్రలో అమృత ధారలు కురుస్తాయని! ఆ వాన రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడాలి. అంటే ఓ ఐదువందలమంది ఎదురు చూస్తే చాలా? ఎవరది? మరీ లెక్క కట్టి చెబుతున్నారు. బొత్తిగా అతిశయోక్తులు గిట్టవా ఏమిటీ? ‘ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా’ అని శాంతకుమారి ఆర్ద్రంగా పాడితే గోపాలుడు ఆలస్యం చెయ్యనే చెయ్యడు. కన్నులేమిటీ, కాయలు కాయడమేమిటీ—మళ్ళీ ఎవరదీ? జాతీయాలు తెలియని జాతి కాదురా మనదీ. కేరళలో అనంత పద్మనాభుడు ఒక్కసారి నిద్రలేచినట్టున్నాడు – ఇన్నాళ్ళు శయనిస్తుంటే బంగారపు రాశులంటూ కేకలూ బొబ్బాలూనూ ... ఆయన మాత్రం ఎలా నిద్ర పోగలడు? ‘చూడ కళ్ళు చాలవనుకో’ – ఏదీ అతని శయన మూర్తి చూడ ..కాదు, అడుగున ఉన్న బంగారు రాశులు చూడ ... ఏ నోట విన్నా ఏ పూట విన్నా ఇదే మాట. జూన్ నెల ఆరంభం అంటే కేరళలో ‘వానా కాలం వచ్చేసిందోచ్’ అని కొబ్బరి తోటలు తలలూపాల్సిన సమయం. ఇక అక్కణ్నుంచి మెల్ల మెల్లగా ఆంధ్రలోకి ఋతుపవనాలు ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే దశ. అయితే ఈ ఏడాది (2012) ‘మరి కొంచెం నిద్దురకానీ’ అన్నట్టు కేరళ వైపు ఋపవనాల రాక కొద్దిగా ఆలస్యమౌతోంది. ‘ఇంకా ఎండల కుంపటి నెత్తిని పెట్టుకు ఊరేగాలా’ అని దేశం మొత్తం అందరిలోనూ ఒక నీరసం ఆవహిస్తోంది. ఊరేగక పోయినా, ఉన్న ఊళ్ళో ఉన్నా దొందూ దొందే. ఇక్కడ కుంపటి అక్కడా రాజుకుంటోంది. జూన్ నెల ప్రారంభ కాలంలో ఈ రాజుకోవడం మాట పక్కన పెట్టి కోవా లాంటి ‘రాజా’ వారి గురించి అనుకోవడం ఈ పూట కాస్త రిలీఫ్ అనిపించదూ? ఇంతకీ ఏ రాజా వారో? ‘అయ్యా...మాకు స్కాములూ గట్రా తెలియవండీ ..ఏదో సంగీతం పిచ్చ ఉన్న వాళ్ళం ...మాకు తెలిసి ఇద్దరే రాజాలు – ఒకరు మెత్తని గొంతు గలాయాన ఎ ఎం రాజా – ఆయన లేరు. ఇంకో ఆయన – లయని ఆలయం గా మార్చుకున్న ఇళయరాజా – ఆయన పుట్టిన రోజు జూన్ 2న (జూన్ 3 అని కొందరంటారు). ‘ హమ్మయ్యా ...ఈయన ఊసెత్తితే మంచిది...కాస్త ఏ(విటీ...చాలా రిలీఫ్ మాకు’ అని కోరే వారి సంతోషం కోసమే ‘ఈ పూట నా మాట’. ఇళయరాజా వారి ఒంటి వయసు ఇప్పుడు 69 ఏళ్ళు. 33 ఏళ్ళ నాటికి గాని ‘స్వతంత్ర స్వర కర్త’ అనే ముద్ర పడలేదు ఆయనకి. ఇ’ళ’యరాజా కి వరాలిచ్చిన తమిళం ‘అన్నక్కిళి’ , తెలుగు ‘భద్రకాళి’ లోని ‘ళ’ కార వేళా విశేషమేమో గానీ మనిషి సరళం, మేధ బహుళం, స్వీయ బర్మన్ గళం, సర్వ manగళం, నవ్వుల గంగాళం, సమ్మోహన వాద్య మేళం------ఇంత నిక్షిప్త గుణ సంపత్తి ‘కల వారు’ రాజా వారు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|