మునుపటి నా మాట
అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ శారద రాత్రులన్నీ శక్తి మయమే. ఎర్ర రంగు శక్తికి చిహ్నం. ఆ రంగు విప్లవానికి ప్రతీక అని కొన్నాళ్ళు భ్రమలో పడ్డాం. చెడు మీద దాడి చేసి మంచిని బ్రతికించడమే విప్లవమైతే మన లోని ఎర్రటి రక్తం అడుగంట కూడదు, ఉడుకు రక్తం కావాలి. అదే అమ్మవారు నేర్పిన శక్తి పాఠం. కాళీ మాత అనగానే కన్నెర్ర చేసే శక్తి గా, నల్లని రూపంగా భయపడతాం. జేజమ్మ పేరు చెప్పి అనవసరంగా పిల్లల్లో భయం కలిగిస్తాం. మనం సహితం భయంతోనే పూజలు చేస్తాం, భక్తితో చెయ్యాలి అని తెలిసి కూడా. మన అమ్మ కున్నట్టే అమ్మవారిది కూడా చల్లని చూపే. ఇది తెలిసి కూడా నమ్మకం కలగదెందుకు? దేవులపల్లి వారు ‘కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి (సుఖదు:ఖాలు, 1967)’ అని ప్రకటించారు. వీటూరి వారు ‘లోకాలేలే చల్లని తల్లీ (ఉక్కు పిడుగు, 1969)’ అని కొనియాడారు కదా ఇంకా సందేహమెందుకు? దాశరథి వారు ఇలా కాదని ‘అమ్మా నీవు లేని తావే లేదు..మా మదిలో నిలిచిపోవమ్మా(పచ్చని సంసారం,1970)’ అని కోరుతూ ‘ఈ లోకులంతా నీ పాపలమ్మా లాలించవమ్మా పాలించవమ్మా’ అని అభ్యర్ధించారు కదా. పాపల్ని లాలించే అమ్మ దెప్పుడూ చల్లని మనసే. అమ్మ దృష్టిలో అంతా సమానులే. ‘పాపులూ పుణ్యులూ నీ పాపలే (కనకదుర్గ పూజా మహిమ, 1960)’ అని అమ్మతో నివేదించుకున్నారు జి.కె. మూర్తి గారు. కాని వింత సృష్టిలో కొందరే మంచివారు, ఎందరో చెడ్డవారు. అసురులు అనండీ రాక్షసులు అనండీ వారిలోనూ మహత్తరమైన జ్ఞానం ఉన్నా అహం పాళ్ళు ఎక్కువ. ఆ విర్రవీగుడు తనమే వారి చేత వెర్రి పనులు చేయిస్తుంది. సురల వ్యధ తీరాలంటే అసురుల కథ ముగియాల్సిందే. అసురల కథ ముగియడమన్నది వారి వధతోనే సాధ్యం. విష్ణువు కొందరిని, పరమశివుడు కొందరిని, శ్రీకృష్ణుడు కొందరిని, శ్రీరాముడు కొందరిని ఇలా పురుషులు వధించిన అసురులు కొందరైతే అమ్మ మాత్రమే వధించగలిగిన అసురులు ఎందఱో ఉండేవారు. అందులో ప్రముఖుడు మహిష ముఖుడు మహిషాసురుడు.
0 Comments
కళ్ళు తెరిచి చూస్తుంది పసి పాప.
ఎదురుగా తన బొమ్మ చూపిస్తూ ఓ కనుపాప. ఆ కనుపాపలో ఉన్నది తన బొమ్మే అని తెలియని తనం. ఆ అమాయకపు చిరునవ్వే, ఆ ఆకలి ఏడుపే ఆ కనుపాప ధనం. కనుపాపకో పేరుంది. అమ్మ. కమ్మనైన అమ్మ మాట వేదం. కమ్మనైన అమ్మ చేతి వంట ఆహా. అమ్మ కొంగు తగలక పొతే అమ్మో. అమ్మ కనుమరుగైతే అయ్యో. జగన్మాత అమ్మలాగ వేద వాక్కుతో జగతిని పాలిస్తుంది. అన్నపూర్ణ అయి అమ్మ లాగ అన్నం పెడుతుంది. కొంగు చాటున మనల్ని దాచి గొడుగులా నిలుస్తుంది. కంటికి కనపడక దోబూచులాడిస్తుంది. అందుకే ఆమె అమ్మలగన్న అమ్మ. ఆమెకెన్నో రూపాలు. ఆమె వెన్నో భావాలు. ఆమె కొండ మీద కొలువుండగలదు. గుహల్లో విహరించగలదు. గ్రామాల్లో వసించగలదు. గుండెల్లో నిలువగలదు. బతుకమ్మ ఆమె. గాజులమ్మ ఆమె. నూకాలమ్మ ఆమె. పెద్దమ్మ ఆమె. కనక దుర్గమ్మ ఆమె. పైడి తల్లి ఆమె. కాళి మాతఆమె. సర్వ శక్తీ ఆమే. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|