మునుపటి నా మాట
ఆలాపన తీస్తూ మా గుమ్మం ముందు తలుపు కొట్టకుండా నిలబడి ఉన్నారంటే ఆ వచ్చినవారు కచ్చితంగా మూర్తిగారే అవుతారు. ఆయన తీసే ఆలాపనలు మాకు కొట్టిన పిండి. యథా ప్రకారం ఆ రోజు తలుపు తీసి ‘రండి సార్ రండి.. అంతా బావున్నారా?రండి రండి’ అన్నాను. ఆయన ఆలాపన ఆపకుండానే అంతా బాగే అన్నట్టు నుదురు ఎగరవేస్తూ లోపలకి వచ్చేశారు. ‘మా చక్కగా ఉంది మీ ఆలాపన’ – ఈ పొగడ్త బహుశా మూర్తిగారు వినివిని కాబోలు పట్టించుకో లేదు. ‘రసికరాజ తగువారము కామా’ అన్నాను, అదే ఆయన ఆలపించారని.... నా జ్ఞానం ఆయన ముందు ప్రదర్శించాలని నా తపన. ‘కామా అన్నారు కాబట్టి ఆలాపనకి ఫుల్ స్టాప్ పెడుతున్నా’, అంటూ మూర్తిగారు... ‘మీకే కాదు అందరికీ నేనిచ్చే సందేశమిదే... రోజుకో ఆలాపన చొప్పున మూడు వందల అరవై చిలుకు పాత పాటలు ఏడాది పొడుగునా పాడుకోండి... రాగాలతో ఆరోగ్యం ఈక్వల్ టూ రోగ విహీనం’- నవ్వుతూనే మరో ఆలాపన అందుకోక మనసులోని మాట చెప్పేశారు. ‘మీరు పి.హెచ్.డి డాక్టర్ కాదండీ, నిజం డాక్టరేమో అని నా అనుమానం’, నా పొగడ్తకి కిసుక్కున ఆయన నవ్వాలని నా తాపత్రయం. ‘నాకు అవకాశం ఇస్తే.. లేదూ వస్తే .... మ్యూజిక్ లోనూ పచ్చడి చేయాలని ఉంది.. అదే.. పి.హెచ్.డి!’, సెటైర్ లో మూర్తిగారిది అందెవేసిన చెయ్యి. ‘పచ్చడి... భలేవారే.... పి.హెచ్.డి లు అలా రుబ్బినవే అంటారు’ – చనువుగా అనగలిగేది మూర్తిగారితోనే కనుక అనేశాను. ఆయన తలూపలేదు. లోలోపల మరేదైనా ఆలాపన తలెత్తిందేమో. ‘మా ఇంట్లో పి.హెచ్.డి అంటే ముగ్గురని అర్ధం’, సగం కళ్ళజోడులోంచి మూర్తిగారు చూశారంటే ఆయన భలే మూడ్ లో ఉన్నారనే అర్ధం. ‘అదెలా?’ అమాయకుణ్ణి అడగనూ అడిగేను, బదులు తెలుసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదూ? ‘నాది పాట కదా..అంటే పి, మా ఆవిడది హార్మోనియం .. అంటే హెచ్ , ఇంక..’ అర్ధోక్తిలోనే ఆయన్ని ఆపేస్తూ నా తొందర ప్రకటించి నేనన్నా, ‘ డీ .. అంటే మీ అమ్మాయి డాన్స్ .. కదండీ’ ఇద్దరం నవ్వుకున్నాం.
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|