మునుపటి నా మాట
(సినిమా) తెర తీయగ రాదా.... అదేమిటోగానీ థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే అప్పట్లో…అంటే అరవైల్లో డబ్భయిల్లో (అంటే..వయసనుకునేరు..కాదు పంతొమ్మిది వందల అరవైల్లో,డబ్భయిల్లో అన్నమాట) .. ఎన్ని సొంత షరతులో ...టికెట్ తీసుకునీ లోపల కూర్చుంటే ఎదురుగా స్క్రీన్ ఖాళీగా కనిపించాలి, వెనక కన్నంలో నుంచి చూసి ప్రోజక్టర్ వాడు ట్రింగ్ అని బెల్ మోగించాలి, వెండితెర మీద న్యూస్ రీల్ రావాలి, ఆ తరవాతే అసలు సినిమా, ఆ సినిమా కైనా మొదటి స్లైడ్ ‘యు’ ఉందా, ‘ఏ’ ఉందా [ సైడ్ రొద: ఇప్పట్లో లాగ అప్పట్లో యూ/ఏ అనే మొహమాటం కేసు ఉండేదా, ఏమో గుర్తు లేదు], ట్రయాంగిల్ ఉందా అని గబుక్కున చూడడం, ఎన్ని రీళ్లు అన్నది గమనించడం ఉండేది [సైడ్ రొద: కొన్ని సినిమాలకి రీళ్లు 18 అనిగానీ 22 అని గానీ మొదటి స్లయిడ్ పడేసరికి హాలంతా ఒకలాంటి మూకుమ్మడి శబ్దం ..చాలా పెద్ద సినిమా సుమా అని ఆ శబ్దానికి అర్ధం]. ఈలోగా ఆలస్యంగా హాల్లో దూరిన వాడొకడు ప్రొజక్టర్ వెలుగుకి అడ్డం రావడం, వాడి పెద్ద తలకాయ సీన్ కి అడ్డం వచ్చిందని వీలైనంతమంది ఒకేసారి ‘ఏయ్ ఏయ్’ అని కేకలు వేయడం కూడా జరుగుతుంటుంది. వి.రామం అనే వ్యక్తి కోరే సినీ విరామం...... సినిమా మధ్యలో ఇంటర్వెల్ అనేది అప్పడాల వాడికే ఎప్పుడూ తెలిసిపోతుంది. అప్పడాల వాసనతో మన ముక్కే కాదు మొహం కూడా వాడి వైపే తిరుగుతుంది. ఈ లోగా పెద్ద సౌండ్ తో ఇంటర్వెల్ కార్డ్ వచ్చి పడుతుంది. ఇంటిల్లిపాదీ వెళ్ళేమనుకోండి ఓ చిన్న సంచీలో ఓ పొట్లం ఉండేది. ఆ పొట్లంలో నూనె పీల్చుకోగా మిగిలిన గోరువెచ్చని గార్లు వాటి పేరు గార్లు అని హాలంతా తెలిసిపోయేలా కవ్వించేవి. ఇక వరసగా తలా ఒక్కోటి తింటూ సినిమా కన్నా గార్లే బావున్నాయని సినిమాకి రాని అమ్మ పాకశాస్త్ర ప్రావిణ్యాన్ని ప్రశంసించడం అదో థ్రిల్ [సైడ్ రొద: అప్పుడప్పుడే ఇంటింటికి ఓ గ్యాస్ స్టవ్, ఓ గ్యాస్ సిలిండర్ ఉండే కొత్త పధ్ధతి రావడంతో ,ఈ రోజుల్లోలా ఏడిస్తే ఏడుస్తారని గానీ,అరిస్తే ఏడాదికి ఆరు సిలిండర్లు మాత్రమే అని గానీ ఇబ్బంది పెట్టే పద్ధతులు లేకపోవడంతో బంధు మిత్ర సపరివారంగా నెలకో నాలుగు సినిమాలు చూసి ఆనందించే వారు ఆ రోజుల్లో]. (ఆఖరి) పట్టు విడువ రాదు ..... ముందో రెండు మూడుసార్లు చూసేసిన వాళ్ళు సినిమా ఆఖరౌతోంది అని పనిగట్టుకు చెప్పే వాళ్లలా లేచి నిలబడుతుంటారు. ‘కూర్చోండి’ కాస్త ‘కూర్చో వయ్యా’ కి మారి అక్కణ్నుంచి ’ఏయ్ కూర్చో’ వరకు మార్పిడి జరిగి పోతుంది. ఇన్ని రకాల మర్యాదలతో తిట్టించుకున్నా సదరు ఆసామి నా సామి రంగా పట్టు విడవడే [ సైడ్ రొద: కొన్నాళ్ళు సినిమా అయిపోగానే జెండా, వెనక జాతీయ గీతం వచ్చేవి. బుద్ధిగా నిలుచునే వారు. మెల్లమెల్లగా ఓపికలు నశిస్తూ రావడంతో ఆ ఘట్టానికి స్వస్తి చెప్పారు].
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|