మునుపటి నా మాట
Click to zoom నిన్న నిండు పున్నమి చంద్రుడికి గ్రహణం పట్టింది కదూ. నిజం చంద్రుడు కాబట్టి తట్టుకో గలిగాడు. భూమి తన నీడ చూసుకోవాలంటే చంద్రుడు అద్దంలా మారాడు. అంతే! ఇండియాలో ఓ చందమామ ఒక వారం క్రితం వరకూ ఉండేవాడు. 'ఖోయా ఖోయా చాంద్' అని విచిత్రమైన అడుగులు వేస్తూ తన ముద్రని అద్దం పట్టి మరీ చూపించేవాడు. డిసెంబర్ 4 , 2011 తెల్లవారు ఝామున చంద్రుడూ, సూర్యుడూ పోటీ పడుతున్న వేళలో ఈ చంద్రుడు తప్పుకున్నాడు. పదహారు కళల చంద్రుడు 'నటన' తన లక్ష్యమన్నాడు. సూర్యుడు 'బాధపడకు, నీ పాట నేనౌతా' అన్నాడు. రోజూ అతని పాట ఉదయిస్తూనే ఉంటుందిక. సినీ వినీలాకాశం లో ఇండియా చందమామ మసకేసి పోయింది. లండన్ నుంచి ఆ రోజు ఆ కబురొచ్చింది. ఆ ఇండియా చందమామ అసలు పేరు దేవానంద్. దేవభాష పరంగా పేరుకి చెరొక వైపూ 'ద'కారాలు ఉంటే ఇంగ్లీష్ లోనూ రెండు 'డీ'లు కలవాడేగా! why this kolaveri డీ అనే కొత్త పాట ఊరూరా కుర్రకారును హోరెత్తి చంపేస్తుంటే 'ఆ పాట పెట్టి సినిమా తీయడానికి నేను రెడీ' అనగలిగే వాడేనేమో ఈ ఉభయ 'డీ' కుశలోపరి! అందుకేనేమో వయసుకి అటువంటి కొలతే ఇచ్చి 8 పక్కన 8వచ్చేవరకు ఆగేడు. అప్పుడే రెండెనిమిదులు పదహారు కాగలిగే అవకాశముంది. దేవానంద్ అంటే పదహారు కళల చంద్రుడేకనుక 'ever green' గా 'sweet sixteen' లోనే ఉంటాడని అనే మాట నిజమైంది. ఆయన ఏకాకి కాదు. గుంపులో గోవిందా కాదు. ఆయన వయసు వారు 'రామా కృష్ణా ' అనుకుంటూ ఈజీ చైర్ కి అంకితమౌతుంటే తాను మాత్రం 'హరే రామా హరే కృష్ణ-ఆజ్' అనే బిజీ స్క్రిప్ట్ తయారీ లో నిమగ్నమైనవాడు. సోదరులు విజయానంద్, చేతన్ ఆనంద్ తో పాటు నటదర్శకుడుగురుదత్ అనే మువ్వన్నె చెలిమి కారణంగా ఎప్పుడో ఏర్పడ్డ 'నవ కేతన్' ని ఒంటిగా మోస్తూ కొడుకు చేతిలో పెట్టి 'వాపస్ న ఆవూంగా, మై తో చలా జావూంగా' అని మనసులోనే తన పాటనే ఆలపించుకునీ అన్నంత పనీ చేశాడు.
0 Comments
ఆంధ్రలో ఏ గడ్డ కన్న బిడ్డ అయినా 'ఉంగా ఉంగా' అనే అంటుంది. కాని అక్కడక్కడా కొందరు మాత్రమే పుడుతూనే కళాకారులై 'నాటక రంగా' అనో లేదా 'సినీ రంగా' అనో అంటారు. పైగా - పుట్టే ఆ కళాకారుల కళ్ళముందు ఒక మహా విశ్వాకారం ఇట్టే సాక్షాత్కరిస్తుంది. దాని పేరే 'ప్రతిభ'! ఎదిగి ఒదిగి,ఒదిగి ఎదిగి ఉండమని చెబుతూ వచ్చే ఆ మహా విశ్వ సదనంలో కొందరు ఉల్కలై రాలిపోతే మరి కొందరు 'తార'లుగా మిగులుతారు. అతి కొద్దిమందే ధృవ తారలౌతారు. సూర్యుడు శరీరాన్ని, చంద్రుడు మనసుని నియంత్రిస్తుంటే 'తారా పథం' మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తోంది. పదహారు కళల కళాకారుడు అనదగ్గ చంద్రుడి ఒకానొక అమావాస్య కళని 'సినీవాలి' అంటారు. వెలుగునీడల సయ్యాట చంద్రకళ కాబట్టి చంద్రుడికి, సినిమాకి ఎప్పటినుంచో అనుబంధముంది అని తెలుస్తోంది. అందుకే సినిమా కళ ప్రతి ఒక్కరి మనసులో అంతో ఇంతో చోటు చేసుకుంటూనే ఉంది. తెలుపు, నలుపుల నుంచి రంగుల్లోకి మలుపులు తిరిగిన తెలుగు సినీ ప్రపంచం ఎనభై మైలు రాళ్ళ తారా పథం మీద హాయిగా ప్రయాణిస్తోంది. ఐతే మరో ఇరవై మైలు రాళ్ళు దాటినా కూడా ఒకే ఒక్క 'గళం' మాత్రం గుళ్ళోని గంటలా ఆగిపోక ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రతి ఇంట ఇలవేల్పు లాగ 'గళ వేల్పు' అనే కొత్త పదం, కొత్త పదవి ఆ గళం అందుకుని ఉండిపోతుంది. నిజానికి గుళ్ళో దేవుడి పాదం కన్నా ముందు చేయి అందుకునేది గంటనే కదా. ఇక్కడ అలా కాదు- గుడి, గంట అనే ఏక వచనాలు ఏకమై 'గుడిగంటలు' అనే 'బహు' వచనమైపోయి ఒక నానుడిగా నిలిచి ఉంటుంది. తెలుగు వారు ఆ గళానికి, ఆ గుడిగంటల నానుడికి ఎప్పుడో 'ఘంటసాల' అనే పేరు పెట్టి ఉంచారు. మూడు దశాబ్దాల పాటు ఆ గళం, ఆ ఘంటారావం సృష్టించిన 'పాట' తరంగాలు మరో నాలుగు దశాబ్దలకైనా క్షీణించక పోవడం, పైగా అంతకంతకూ విశ్వ ఖ్యాతి పొందడం చూసి ఒక విశ్వ ప్రశ్న తలెత్తింది. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|