మునుపటి నా మాట
శ్రీ రామ నామం ఒక్కటి చాలు – మన శరీరంలోని, మన మనసు లోని ‘ ఎనర్జీ’ రీ చార్జ్ కావడానికి. అందుకే ఆనాటి పెద్దవాళ్ళు పనుల మధ్యలో ‘శ్రీ రామ’ అంటూ అలసటని ఆవలకి నెట్టేస్తూ ఉండే వారు. త్రేతా యుగం, ఆ యుగం, ఈ యుగం అనే లెక్కలకు అతీతంగా ఉండే ఓ అద్భుత శక్తి రాముడు. శ్రీ రామ కథ అంటే మొత్తం రామాయణం, లేదూ అంటే రామాయణం లోని ప్రతి ఒక్క కాండ! రామాయణం కల్ప వృక్షం. ఒక్కొక్క కాండ ఒక శాఖ. అందుకే వాల్మీకి రామాయణం ‘నిత్య’ పారాయణం చేయడం ఎందరికో ఇష్టం. కానీ కొందరికి సంస్కృతం అంటేనే చాల కష్టం. ఇదిగో ఇటువంటప్పుడే ఒకరు మంచిని బోధిస్తే ఆ సారాన్ని వారి వారి భాషల్లో తెలియ జేయడం అనేది గొప్ప గొప్ప మేధావులు చేసే పని అని తెలుస్తుంది.. ఉత్తర భారతాన అంటే తూర్పు ఉత్తర ప్రదేశ్ లో అవధి భాష ఉంది. తన భాషలో వాల్మీకి రామాయాణ గాధని సరళంగా చెప్పాలని తపన పడి సరిగ్గా శ్రీ రామ నవమి నాడే ( 1574 లో) శ్రీకారం చుట్టేడు తులశీ దాస్ గోస్వామి. అప్పటికి ఆయన వయసు నలభై రెండేళ్ళంటారు. అదే ‘శ్రీ రామ చరిత్ మానస్’ అంటే శ్రీ రామ లీలా మానస సరోవరమన్న మాట. చాలా చోట్ల ‘తులసీ రామాయణం’ అని అంటారు. ‘ఇదీ ఒక కావ్యమా’ అని ఆ తరం పెద్దలు ఈసడించుకున్న వారూ ఉండే వారట. చదవగా చదవగా అందులో భక్తి, జ్ఞానం, ముక్తి లేదా మోక్షం అనే మూడు అంశాలు ఉన్నాయని తెలుసుకునీ, తేల్చుకునీ ఆనక వేనోళ్ళ కొనియాడేరట. ఏడు అధ్యాయాల ఈ గ్రంధం సుమారు రెండున్నర ఏళ్లలో అయోధ్య, వారణాశి ప్రాంతాల్లో ఉంటూ రాసి పూర్తి చేసాడట ఆయన. కావ్య నియమం లో చౌపాయీ, దోహా, ఛంద్ ప్రయోగించాడు. ఈ దోహా మన ద్విపద లాంటిది. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, లంకా, ఉత్తర కాండలు రాసి వాల్మికి చెప్పిన లవ కుశ ఉదంతం మాత్రం విడిచి పెట్టేడట తులసీ దాస్. కారణం- అంత ‘సుకుమార ప్రేమ మూర్తి’ గా తను చిత్రించిన ‘సీతామాయి’ని కష్ట రూపంలో చూపించడం ఇష్టం లేక. బాల కాండ నిడివి కూడా ఎక్కువగానే ఉన్న శ్రీ రామ చరిత్ మానస్ లో లౌకిక, పారమార్ధిక భావ తరంగాలు సమ ఉజ్జీలుగా విరుచుకు పడుతుంటాయి.
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|