మునుపటి నా మాట
వర్తమాన పుణ్య లబ్ది కోసం ఒకరు, భవిష్య మోక్ష ప్రాప్తి కోసం ఒకరు అక్కడికొస్తారు. తనువు రాల్చేముందు తనివారా ఆ లయకారుడి నొక్కసారి చూస్తే చాలు అనుకునే వయో వృద్ధులు కొందరు అక్కడికొస్తారు, చిన్నపిల్లల్ని బంధువులింట విడిచి పెట్టి రాలేక తమతో తీసుకు వచ్చిన దంపతులు కొందరు అక్కడ తారస పడతారు. వీరంతా ఒక టయిపైతే, అబ్బే పుణ్యం కాదు, మోక్షం కాదు ఆహా ఆ హిమాలయ సౌందర్యం కనులారా చూడాల్సిందే అని ఊరికే కెమెరాలుచ్చుకు బయలు దేరేవారు కొందరు అక్కడ చేరతారు. ఏటేటా ఆరు నెలల కాలం పాటు అక్కడి కొచ్చే జనం నిజంగానే ఒక ప్రభంజనం. శీతాకాలం అక్కడి రాకపోకలు నిషేధం. ఎక్కడ జన సంచారం ఉంటుందో అక్కడ వ్యాపార దృష్టి కూడా ఉంటుంది. కనుక ధనార్జనకీ తావే అనువైనదని, అలా సహాయపడడం తమ వైనమని సాహసించి బస చేసుకున్న విక్రయదారులు కూడా అక్కడ ఎక్కువే. కొండ చివర్లలో ఒరుసుకునీ నిలబడేలా వసతి గృహాలు ఎవరి అనుమతి మీద కట్టించారో ఆ శివుడికే ఎరుక. అది సహాయానికి పరా కాష్ట అనాలా? ఊహాతీతమైన విపత్తుకి వైతాళిక మనుకోవాలా?
0 Comments
బెంగుళూరులో ఉన్నప్పుడు పరిచయమై ఇప్పటికీ స్నేహ హస్తం అందజేస్తున్న మంచి మిత్రులు సూర్యనారాయణ గారు. ఈయన అక్షరశిల్పి. గాయకుడు. ఈయన ఇటీవల తమ ప్రియమైన తండ్రిని కోల్పోయారు. అయ్యో అనుకున్నాను, అశ్రు నివాళి అర్పించాను. వీరి కుటుంబం సంగీతమయం. బహుశ: సూ.నా. గారి తండ్రి గారో, తల్లి గారో సంగీత సామ్రాజ్యాధి నేతలు కావొచ్చు. మా తండ్రి గారు నా రెండేళ్ళ వయసులో తన నలభై అయిదేళ్ళ వయసు లోనే కాలధర్మం చెయ్యటంతో అప్పటి అమాయక వయసులో లాగనే ఇప్పటికీ ఆ బాధ తీవ్రత అన్నది మనసులో నిలవలేదు. నాన్నగారికి 'స్పోర్ట్స్'తో పరిచయం ఉన్నట్టు ఒక పాతకాలం ఫోటో చెప్పింది. విషయాల్ని స్పోర్టివ్ గా తీసుకోవడమే తప్ప స్పోర్ట్స్ ఆడడంలో పెద్దగా ఆసక్తి మా తరానికి లేదు. సాహిత్యాభిలాష ఒకటి మాత్రం అందరికి దక్కింది. ఎవ్వరం తొలినాళ్ళలో భక్తికి పెద్ద పీట వెయ్యనే లేదు. అమ్మమ్మ,అమ్మలది నిండైన భక్తి సామ్రాజ్యం. మా నాన్న జ్ఞాపకాలు తనకు మాత్రమే మిగిలాయి కనుక కలిసినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో గుర్తుచేసేవాడు మా పెద్దన్నయ్య. ప్రతి విషయానికి తన వాక్ చాతుర్యం జోడించి భళ్ళున నవ్వేసే అన్నయ్య ఎక్కడ ఉన్నా ఉదయం కోడికూత గానీ, కాకి అరుపు గానీ అవసరం లేకుండా అలా ఠక్కున ఏ అయిదింటికో నిద్రలేచి ఒక్కడే ‘సీరియస్’ గా ఆరు బయట ఆరు వరకు మార్నింగ్ వాక్ చేసి వచ్చే వాడు. అటువంటిది మొన్న అంటే మే31 న పెద్దన్నయ్య అర్ధరాత్రి దాటాక ఒక్కసారి కన్ను తెరిచింది ఎటువంటి సంకేతం, అనుమానం అనేవి లేకుండా తీవ్రమైన గుండెపోటుతో కన్ను మూయడానికే అని తెలిసి అందరి కళ్ళు చెమర్చాయి. వయోభారమా అంటే ఏదీ ఇంకా డబ్భయి యేళ్ళే కదా – అంతలోనే అన్నయ్య ఆత్మని పరమాత్మ తొందర పెట్టేయడం ఏం బావులేదు. ఫోటోలో ఆ నవ్వుతున్నది మా అన్నయ్యే. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|