మునుపటి నా మాట
ఇలా పలుకు పలుకులో ‘లే’ అక్షరం చేరి తెలుగు భాషకే ఒక అందం వచ్చింది. తెలుగువీర ‘లే’వరా ...అంటే ఇదేనేమో. ‘లే’ వరించిన తెలుగు వాడా అని సంబోధించడం. ఇప్పుడన్న మాటలు ఏవి కూడా లకారంతో ముగియలేదు. అయినా ‘లే’ ఒకటి వాటి చివర్లో చేరగానే ఆ మాటలకే ఒక కొత్త అందమొచ్చింది. లకారంతో ముగిసే స్త్రీ మూర్తులు ఇద్దరున్నారు. ఒకరు ఇల్లాలు. ఏక వచనం. మరొకరు కోడలు ఏక వచనం. ‘ల’ కొమ్మున్న నామవాచకాలివి. వీటికి ఏత్వం చేరి రెండు జాతీయాలు ఏర్పడ్డాయి. అత్తా ఒకింటి కోడలే, ఇంటికి దీపం ఇల్లాలే, ఇవే తరువాత సినిమా పేర్లయిపోయాయి. వీరు సరే. పురుష, స్త్రీ భేదం లేని వారున్నారు. దొంగలు. ఈ బహువచనానికి ఏత్వం చేరిస్తే చెప్పుకోదగ్గ దారుణమైన తీర్మానం - అందరూ దొంగలే. ఒక్క ‘లే’ చాలదని మరొక ‘లే’ గనక చేర్చామా - అత్తా ఒకింటి కోడలేలే, ఇంటికి దీపం ఇల్లాలేలే – అన్నప్పుడు ఎక్కడో వ్యంగ్య బాణం విసిరినట్టనిపించదూ?
0 Comments
ఏవీఎస్ అన్నట్టు అదో తుత్తి........ డాక్టరూ, సంగీత జ్ఞాని అయిన కీర్తిశేషులు శ్రీపాద పినాకపాణి గారు తృప్తిగా నిండు నూరేళ్ళు జీవించినట్టే భావించాలి. ఎందుకంటే వృత్తిలో తృప్తి లేనిదే పరుల బాగు కోసం వైద్యసేవ చేయడం కష్టం కనుక. ప్రవృత్తిగా సంగీత విద్య నభ్యసించి పదిమందికి నేర్పడంలోనూ ఎంతో తృప్తి ఉంది కనుక. రోగాలు మాపేవి రాగాలు అని ఆయన ద్వారా తెలుసుకున్న వారంతా ఎప్పుడో ఒకప్పుడు ఆయన్ని రెండు చేతులా నమస్కరించి తృప్తి పొందే ఉంటారు. తృప్తిగా బతక నిచ్చేది మంచి నీరు కాబట్టి ఆయన వల్ల బతికి బట్ట కట్టిన ఉత్తరాది వారొకాయన పినాకపాణి అంటే ‘పీనేకా పానీ’ అని తృప్తిగా చమత్కరించారు. డాక్టరూ, రచయితా అయిన కీర్తిశేషులు కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఒకనాటి జ్యోతి మాస పత్రికలో ‘మనిషికి ఏం కావాలి?’ అనే సీరియల్ పూర్తి చేస్తూ చిట్ట చివర్న రెండంటే రెండే అక్షరాలున్న, బోలెడంత అర్థమున్న పదం వాడారు - అది ‘తృప్తి!’. నిజమే మనిషికి ఏం కావాలనే ప్రశ్నకి ఇవ్వాల్సిన సమాధానం ‘తృప్తి’యే. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|