మునుపటి నా మాట
ఆలాపన తీస్తూ మా గుమ్మం ముందు తలుపు కొట్టకుండా నిలబడి ఉన్నారంటే ఆ వచ్చినవారు కచ్చితంగా మూర్తిగారే అవుతారు. ఆయన తీసే ఆలాపనలు మాకు కొట్టిన పిండి. యథా ప్రకారం ఆ రోజు తలుపు తీసి ‘రండి సార్ రండి.. అంతా బావున్నారా?రండి రండి’ అన్నాను. ఆయన ఆలాపన ఆపకుండానే అంతా బాగే అన్నట్టు నుదురు ఎగరవేస్తూ లోపలకి వచ్చేశారు. ‘మా చక్కగా ఉంది మీ ఆలాపన’ – ఈ పొగడ్త బహుశా మూర్తిగారు వినివిని కాబోలు పట్టించుకో లేదు. ‘రసికరాజ తగువారము కామా’ అన్నాను, అదే ఆయన ఆలపించారని.... నా జ్ఞానం ఆయన ముందు ప్రదర్శించాలని నా తపన. ‘కామా అన్నారు కాబట్టి ఆలాపనకి ఫుల్ స్టాప్ పెడుతున్నా’, అంటూ మూర్తిగారు... ‘మీకే కాదు అందరికీ నేనిచ్చే సందేశమిదే... రోజుకో ఆలాపన చొప్పున మూడు వందల అరవై చిలుకు పాత పాటలు ఏడాది పొడుగునా పాడుకోండి... రాగాలతో ఆరోగ్యం ఈక్వల్ టూ రోగ విహీనం’- నవ్వుతూనే మరో ఆలాపన అందుకోక మనసులోని మాట చెప్పేశారు. ‘మీరు పి.హెచ్.డి డాక్టర్ కాదండీ, నిజం డాక్టరేమో అని నా అనుమానం’, నా పొగడ్తకి కిసుక్కున ఆయన నవ్వాలని నా తాపత్రయం. ‘నాకు అవకాశం ఇస్తే.. లేదూ వస్తే .... మ్యూజిక్ లోనూ పచ్చడి చేయాలని ఉంది.. అదే.. పి.హెచ్.డి!’, సెటైర్ లో మూర్తిగారిది అందెవేసిన చెయ్యి. ‘పచ్చడి... భలేవారే.... పి.హెచ్.డి లు అలా రుబ్బినవే అంటారు’ – చనువుగా అనగలిగేది మూర్తిగారితోనే కనుక అనేశాను. ఆయన తలూపలేదు. లోలోపల మరేదైనా ఆలాపన తలెత్తిందేమో. ‘మా ఇంట్లో పి.హెచ్.డి అంటే ముగ్గురని అర్ధం’, సగం కళ్ళజోడులోంచి మూర్తిగారు చూశారంటే ఆయన భలే మూడ్ లో ఉన్నారనే అర్ధం. ‘అదెలా?’ అమాయకుణ్ణి అడగనూ అడిగేను, బదులు తెలుసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదూ? ‘నాది పాట కదా..అంటే పి, మా ఆవిడది హార్మోనియం .. అంటే హెచ్ , ఇంక..’ అర్ధోక్తిలోనే ఆయన్ని ఆపేస్తూ నా తొందర ప్రకటించి నేనన్నా, ‘ డీ .. అంటే మీ అమ్మాయి డాన్స్ .. కదండీ’ ఇద్దరం నవ్వుకున్నాం.
0 Comments
బప్పా అంటే తండ్రి. బాబా అని కూడా అన వచ్చు. హిందీలో బాప్, గుజరాతీ లో బాపు, మరాఠీలో బప్పా, ఒరియా లో బొప్పా అంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రమే వినపడే ‘గణపతి బప్పా మోరయా’ వంటి నినాదం ఇప్పటి మాధ్యమాల ధర్మమా అని ఆంధ్రలోనూ వినబడుతోంది. ‘పుడ్చా వర్షా లౌకర్ యా’ అనే మరో నినాదం కూడా ఉంది. చవితి నుంచి పది రోజుల వరకు ఉత్సాహంగా ఉత్సవాలు జరుపు కొన్నాక విగ్రహ నిమజ్జన సమయంలో గణపతి దేవుణ్ణి మళ్ళీ ఏడాది మరలి రమ్మంటూ జనం పలికే జేజేలు అది. లోకమాన్య బాల గంగాధర్ తిళక్ స్వాతంత్ర్య పోరాట సమయంలో పుణేలో ‘సామూహిక గణేష్ ఉత్సవాలు ఆచరించుదాం రండి' అని ఇచ్చిన పిలుపు నేటికీ మాన్యతని పొంది యావత్ మహారాష్ట్ర ఆదరించి ఆనందించే ఒక సదాచారంగా మారింది. మహారాష్ట్రలో సాధారణంగా ఏ ముఖ్యమైన పండుగ కైనా అయిదు రోజులు కేటాయిస్తారు. ఉదాహరణకి - హోలీ పండుగ . ఇది పౌర్ణమికి వస్తుంది కనుక అక్కడినుంచి వచ్చే అయిదవ రోజుని ‘రంగ్ పంచమి’ గా ఆచరిస్తారు. ఆ రోజూ హోలీ నాటిలా రంగులు చల్లుకున్నా అది కేవలం వ్యక్తిగతం. బహిరంగంగా ఆడి ఇతరుల్ని ఇబ్బంది పెట్టరు. ఇక- వినాయక చవితి తరువాత వచ్చే మూడవ తిథిని గౌరీ ఆవాహనం, నాలుగవ తిథిని గౌరీ పూజ, అయిదవ తిథిని గౌరీ విసర్జనం వంటి కార్య క్రమం తప్పక పాటించి పురాణ కథకి జీవం పోస్తారు. తనయుడితో పాటు తల్లినీ స్మరించడం ఎంత గొప్పది! చెప్పాలంటే - మహారాష్ట్రీయుల కుల దైవం గణపతి. అంతే కాదు ప్రతి కుటుంబానికి వేరుగా ఒక ఆధ్యాత్మిక గురువు కూడా ఉంటారు. ప్రతి శుభ కార్యానికీ గణపతితో పాటు వారి వారి గురు దీవెనలు కూడా కోరుకుంటారు. గణపతి అంటే గణాధిపతి, శివుని ప్రమథ గణాల వేలుపు కనుక గణేశుడు. హ్రస్వంగా ‘గణేష్’ అంటున్నాం. భాద్రపద శుక్ల (శుద్ధ) చతుర్ధి (చవితి) తిథిలో గణపతి ఆవిర్భావం జరిగింది. ఈ యేడు (2012) మనకి రెండు భాద్రపదాలు వచ్చాయి. ముందు వచ్చి వెళ్ళిపోయినది అధిక భాద్రపదం. అధిక మాసం అని మనం అంటాం. ఉత్తరాన మల్ మాస్/మాహ్ అంటారు. ‘వందే మాతరం’ అని పేపర్లో పెద్ద శీర్షిక, ‘వందే’ మాటని చిక్కని ఎర్ర రంగులో ముద్రించి మరీనీ. ఎందుకూ అంటే .. 09 సెప్టెంబర్ ఆదివారం నాడు ఈసురోమంటూ ఉండని శాస్త్రవేత్తలున్న మన ఇస్రో వారి నూరవ గ’ఘన’ వీధి విహారం విజయవంతమైంది కనుక. శ్రీహరికోట గట్టి మేల్ తలపెట్టితే శ్రీ కాళహస్తీశ్వరుడు ఎట్టి ఆపదా రాకుండా కాచాడు. అప్పుడనిపించింది ఇస్రో వారికి ఈ ‘వంద ...ఏ మాత్రం?’ లక్ష్యసిద్దిలో వెయ్యికి చేరగలరని! అందుకే ప్రస్తుతానికి ఎస్వీ రంగారావు ..అదే ..మన సినీ ఘటోత్కచుడు అన్నట్టు ‘వెయ్యి వీరతాడు’. -------- టీవీలో మళ్ళీ వీకెండు కోలాహలం ఓ వీశెడు. ఎందుకూ అంటే...అమితాభ్ బచ్చన్ మళ్ళీ కరోడ్పతుల్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు కనుక. తాతగారైన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక బుజ్జిపాపతో టీవీ షోలో ఆడుకున్నారట కూడా. పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కుమార్, సంజీవ్ కుమార్, అమితాభ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, ఓంపురి, అమ్రీష్ పురి ల నటనతో పాటూ ఆకట్టుకునేది వారి వారి వారేవా అనిపించే వాచకం. అలా భేషైన మాటల వల పన్ని అమాంతం తెలుగువారిని దోచేసిన ఏకైక భారీ జీవి మన యశస్వీ రంగారావు గారొక్కరే. ఆ రోజుల్లో టీవీలుంటే తప్పక మన రంగారావు గారు ‘ఎవడురా కోటీశ్వరుడు?’ అనే కార్యక్రమం బుల్లి తెర మీద చూపేవారేమో. నేపధ్యంలో ‘ధనమేరా అన్నిటికి మూలం’ అని ఒకే ఒక్క లైన్ వినపడేదేమో, అన్నిటికి ధనమే మూలం కాకపోయినా. హఠాత్తుగా రంగారావు గారు గుర్తుకు రావడం ఏమిటీ? జయంతి గానీ వర్ధంతి గానీ వస్తోందా? కొందరంతే.. వారికివేవీ చెల్లవు. నిత్య స్మరణీయులు. ------ ఇప్పుడు ఎటు విన్నా ఒకటే నామం – శిరిడీ సాయి! నాగార్జున సినిమా.. రాఘవేంద్రరావు సినిమా .. కీరవాణి సినిమా.. ముఖ్యంగా మహేంద్ర రెడ్డి సినిమా. కుటుంబ సమేతంగా సినిమా చూసి వస్తుంటే కాస్త ఇన్నాళ్ళకి మనసునిండా ‘రెట్టించిన హాయి’ దట్టించినట్టయింది. ‘నీకెట్టుందో కాని’ అని ఒక పాత పాటలో అన్నట్టు మహారాష్ట్రలోని తెలుగువాళ్ళ మైన మాకు హాలు సమీపించగానే తెలుగు ముఖాలు కనిపించడం మటుకు హాయీ ముప్పావే. ఈ హాయి ఎంత పని చేసిందంటే ఇంటర్ వెల్ లో హాలు బయట నున్న అమ్మకాల స్టాల్ కుర్రవాడిని ‘ రెండు కాఫీలు ఇవ్వు బాబూ’ అని తెలుగులో అడిగేంతవరకూ వెళ్ళింది. తెలుగు తెలియని ఆ అబ్బాయి ఆదిత్య 369 లో చంద్రమోహన్ ‘ మీరంటున్న మాటల్లో ఒక్క పొట్టా, పొట్టి తప్ప నాకేవీ అర్థం కావట్లేదు’ అన్నట్టు మొహం పెట్టి ఒక్క కాఫీ అనే మాటనే అర్ధం చేసుకునీ మనల్ని వెర్రి గా చూడటం! అది హాయీన్నర. సినిమాలో సాయిబాబా ఇంగ్లీష్ మాట్లాడం హాయీమ్పావు. -------- యువి అనగానే అల్ట్రా వాయిలేట్ కిరణాలు అనుకునే అమాయకులుండరు ఇండియాలో, అదీ ఈ రోజుల్లో. ఎవడిక్కావాలి రేడియేషన్ , ముందుండగా క్రికెట్టు మెడిటేషన్! ‘యువరాజ్’ ని ముద్దుగా ‘యువి’ అని పిలుస్తారని కడుపులో ఉన్న బిడ్డ కూడా కాలు తన్ని మరీ చెప్పగలదు. క్యాన్సర్ రక్కసి నుంచి ముక్తి పొంది కాలుణ్ణి జయించి మళ్ళీ మైదానంలో అడుగు పెట్టిన యువికి విశాఖ ..‘పట్టం’ కట్టి బహుమతీ ప్రదానం చేసి అనంతరం ఆయన ఆడితే చూద్దామనుకుంది. ఇంతా చేస్తే మేఘావృతమై బెదిరించిన ఆకాశం ఆఘ మేఘాల మీద వాన కురిపించి ఆశ నిరాశ చేసింది. కాదు.. ఆంధ్ర ఆకాశం కురిపించిన ఆనంద బాష్పాలేమో అవి. బంతులబ్బాయి మీద ప్రేమతో మంచుకణాల పూబంతులు విసిరేసిన స్ఫటిక పుష్పాలేమో అవి! ---------- ఇ’సుమన్’తైనా కోపం ఉందేమో అని ఎంత తేరిపార చూశినా ఆ ముఖంలో అప్పుడు కనపడేదే కాదు ... ఇంక ఇప్పుడు అలా వెతకడం అసలు వీలు పడదు. విధికి కోపమొచ్చి విధి లేక ఆ ముఖాన్ని చాటు చేసింది. మూడు పదుల వయసులోనే అక్షరాల ఆకుల తోడుగా విధి విన్యాసాల ముళ్ళనేవి బాధిస్తాయి జాగర్త అంటూ హెచ్చరిస్తూ విరబూసిన టీవీ గులాబీ ‘సుమన్’ ....విధి వీధి విహారానికి ఈ నలభై అయిదు ఏళ్ళ వయసునే ఎంచుకోవాలా? కుంచె పట్టి రంగుల ముంచి బొమ్మలు గీశాడు. మంచి పాత్రలు సృష్టించి బుల్లి తెర మీద కదిలే బొమ్మలు చూపించాడు. ఇలకు దిగిన అలల సముద్ర నిర్దేశకుడు చంద్రుడి ముద్ర ఉన్న దర్శకుడై ఇలా అలా ..ఇలా కాదు అలా , అలా కాదు ఇలా అని పాత్రధారుల నుంచి హావభావ తరంగాలు రాబట్టుకున్నాడు. కంచికి పోలేని కథలు అల్లాడు. తూచి తూచి మాటలు పేనాడు. ఎంచి ఎంచి భావ స్పూర్తి కలిగించే పాటలు రాశాడు. స్వరాలు అందించాడు. అమెరికా లో చదివిన కమ్యూనికేషన్ చదువుని ఆంధ్రలో సక్రమంగా ఉపయోగించాడు. కొత్త పద్ధతులతో తెలుగు టీవీ లకి కొండంత మార్గదర్శి అయ్యాడు. ఆఫీసు బాధ్యతలు ఆ రెండు భుజాలమీదే అవలీలగా మోశాడు. తాను రామోజీరావు కుమారుడైనా తన వంతు జన్మ సార్ధకతగా, తానుగా తన బహుముఖ ప్రతిభని ఒక కళాకారుడిగా నమ్ముకున్నాడు. ‘ఆంజనేయా మహానుభావా.. సుందరా.. శ్రీ రామదాసా.. అంజనీ సుతా ...వాయు పుత్రా ..ఓ పవనాత్మజ ఓ ఘనుడా’ ‘ఓం తో కాక ఆం తో ప్రారంభించావ్ చూడు ఆ మాటలు సముద్రాల వారివి , సుందరా రామదాసా నుంచి వాయు పుత్రా అన్నావ్ చూడు అది నీ స్వంతం. చివర్లో ఓ పవనాత్మజ అంటూ పొగిడావే.. అది తాళ్ళపాక అన్నమయ్య కీర్తనం’ ‘ఆహా.. బుద్ధికి బృహస్పతివి... కలిపి కొట్టి కావేటి రంగా అని నేననుకున్నా..నిజంగా.. మా బాపు వారి ముత్యాలముగ్గు సినిమాలోలా నా ఎదుట వచ్చి వాలావు. సంతోషం. ధన్యుడనైతిని .. ’ ‘సగంలో ఆపేయక ...ధన్యుడనైతిని ఓ రామా ..అని రామదాస కీర్తన పాడావో సంతోషిస్తాను. నాకు నిత్యం రామనామం వినిపించాలి. అవునూ .. వాలావు అంటున్నావు. అంటే నాకు మా లావైన తోక.. అంటే వాలం ఉందనేగా నీ వెటకారం’ ‘అయ్యయ్యో .. ఎంతమాట.. ఆంజనేయా..నువ్వంటే మమకారమే కాని వెటకారమా తండ్రీ! ఇంతకీ నేనెందుకు పిలిచానో అడగవేం?’ ‘ఏముంటుందీ ...లోకపాలకులు కరువయ్యారు రామరాజ్యం కావాలి అనేగా? సీతమ్మను వెతికి పెట్టమంటే నా తండ్రి రామయ్యకి సాయపడ్డాను కానీ మీ లోకానికి మళ్ళీ రామరాజ్యం తెమ్మంటే నా వల్ల కాదు బాబూ .. రామ!రామ! ..ఏం మనుష్యులు ఏం మనుష్యులు!’ |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|