మునుపటి నా మాట
ఏమిటో... ఒక వైపంతా టీవీ చానెళ్ళ గోల! మరో వైపు మొబైళ్ళ రొద! ఇంకొందరికి కంప్యూటరూ, ఇంటర్నెట్టూ....పిచ్చి పిచ్చిగా ఉంది కదండీ ఈ ప్రపంచం, విశ్వం గారూ’
‘గట్టిగా అనకండి లోకనాథం గారూ. మనవలు వింటే మనల్ని వేరే గ్రహం నుంచి ఊడిపడిన జీవుల్లా చూస్తారు. అయినా ఒక్క క్షణం టీవీ గానీ, మరేదైనా గాని లేని చోట ఒక్క గంట ఉండనిస్తే మీరు ఉండగలరా చెప్పండీ. చుట్టూ సందడిగా ఉన్నా మనలో మనం నిశ్శబ్దం అనేది సృష్టించుకోవాలి. మనకెంతవరకు అవసరమో అంత వరకే ఈ పరికరాలు ఉపయోగించాలి.’
1 Comment
‘ఒహో ఒహో నిన్నే కోరెగా ...కుహూ కుహూ అనీ కోయిల’- పాట వింటుంటే సలీల్ చౌదరీ, ‘ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో’ –పాట వింటుంటే నౌషాద్ గుర్తుకొస్తారు. ఎందుకంటే కళ్ళు మూసుకునీ వింటున్నాం కనుక. ఒక్కసారి కళ్ళు తెరిచి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలోని ఈ రెండు పాటలు చూస్తూ వింటే అప్పుడనిపిస్తుంది ‘అరె....ఇవి ‘ఈవిడ’ మీద పాటలా?’ అని. అక్కడ మన స్వరకర్త రాజేశ్వరరావు గుర్తుకు రానే రారు. పైగా దృష్టి అక్కినేని మీద నుంచి ఆవిడ మీదికి పోతుంది. 'ఈవిడ' చిరునవ్వు అలాంటిది, ఒక కోయిల గొంతులోని పంచమ స్వరంలా, ఒక పూవు పరచే పరిమళంలా. ఇంటిగుట్టు – సినిమాలో హీరో రామారావు, హీరోయిన్ సావిత్రి. అయితే అందులో ‘నాయుడోరింటికాడ నల్ల తుమ్మ సెట్టు కాడ సిటారు కొమ్మ మీద సెటాపటా లేసుకోనీ సిలకలల్లె కూకుందాము రాయే’ వంటి జానపదం చూడకుండా వింటే మల్లాది వారి రాతకి అబ్బుర పడడమెంత సహజమో, చూస్తూ వింటే ‘అరె ..ఇది 'ఈవిడ' మీది పాటా, పైగా గిలిగింతల జంబలకడి పంబ రేలంగి కూడా ఉన్నాడు’ అని విడ్డూరంతో విజిల్స్ వెయ్యడమూ అంతే సహజం. ఇదే సినిమాలో మరో చిలక పాటుంది. ‘బలు వన్నెల చిన్నెల దాన, వనరైన దాన’ అని ప్రారంభమౌతుంది ఆ పాట. వినగానే పల్లవి లోని పదాలబట్టి మల్లాది వారి రాతే అని ఈసారికి పసిగట్టేసినా, చూడగానే మాత్రం ‘అరె..ఇదీ 'ఈవిడ' మీది పాటేనా?’ అని పసితనపు అమాయకత్వం ముసిముసి నవ్వులు రానిస్తుంది. ‘చిట్టి తమ్ముడు’ సినిమా ఒకటుందని ఎప్పుడో మరచిపోయాం. (యూ ట్యూబు వింత ఏమిటంటే అక్కడ మనకి బాగా తెలిసిన సినిమాల పాత దృశ్యాలు లభించడం గగనమౌతుంటుంది. ఎప్పుడూ విననివి మాత్రం కోకొల్లలు). ఈ సినిమాలో ఇంతవరకూ చెప్పుకున్న ‘ఈవిడ’ పాటలు విడివిడిగా రెండున్నాయి. ‘మెరుపు మెరిసింది’ –పాటలో పాపం ఎప్పుడూ ఒక్క పాటకైనా నోచుకోని కండల విలనుడు రాజనాల కనిపిస్తారు (డబ్భయిల కాలంలో ఆంజనేయ వేషం వేయడంతో ఈయనకి పాటలొచ్చాయి అనుకోండి, అదృష్టవంతుడు). ఈ పాటలో మెరుపు,ఉరుము – వీటి అభినయం ‘ఈవిడ’ ద్వారా చూడగానే మనం కూడా కళ్ళూ చెవులూ తెరుస్తాం. అదీ 'ఈవిడ'కి తెలిసిన విద్య. ‘జమిందారీతనం వల్ల వచ్చిన వల్లమాలిన బద్ధకం’ తనకుందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎన్నో సందర్భాల్లో అంటూ ఉండేవారు. పాట వ్రాసి ఇవ్వండి శాస్త్రి గారూ అని హడావుడి చేసే ఏ నిర్మాతా ఆయన చుట్టూ తిరగలేదు. ఆయన పాట కావాలనుకునేవారు ఆగేవారు. అది ఇన్స్టంట్ కాఫీ కాదాయె. అమృతం ధార. ఆగాల్సిందే. ‘ఎందుకే నీకింత తొందర?’ అని ఆయన తన తొలి సినిమాతోనే స్పష్టం చేయడంతో తరువాత ఏ నిర్మాత కూడా ఆయన్ని తొందర పెట్టలేదు. ఆగితే మంచి చిలక పలుకులు దక్కుతాయని వారికి తెలుసు. అలాగని శాస్త్రిగారు తన ధోరణిలో ఏదో రాసుకుంటూ పోలేదు. సినిమాలో సందర్భానికి సరిపోయేలా రాస్తూనే తన శైలిని మాత్రం త్యాగం చెయ్యలేదు. ఆయన తన చుట్టూ టేప్ రికార్డర్ పట్టుకు తిరిగేలా ఎవర్నీ శాశించలేదు. ఇక్కడో ముక్క అక్కడో ముక్క చెప్పి పాట అయిందనిపించే సవ్య సాచి కారు ఆయన. అయినా పాటలందు కృష్ణశాస్త్రి పాటలు వేరయా అని ఇటు నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో పాటు శ్రోతలకు కూడా తెలుసు. రికార్డులున్న రోజుల్లో ఎక్కడో దూరాన్నుంచి సినిమా పాట వినిపిస్తుంటే ‘కృ.శా. గారి పాటలాగుంది’ అని చెవులు తొందర పడేవి. నిజానికి ఆయన పాటకెటువంటి దృశ్యం అక్కర్లేదు. అదృశ్యంతోనే మనో చిత్రాన్ని దర్శించుకోవచ్చు. ఆ మనో చిత్రానికి న్యాయం కూర్చాలని ప్రతి స్వర కర్తా మడి కట్టుకుని మరీ స్వర పరిచేవారు. ఉదాహరణకి- చక్రవర్తి సంగీతంలో కొన్ని వేల పాటలు వచ్చి ఉండవచ్చు. ఆయనదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉండి ఉండవచ్చు. అన్ని వేలపాటల్లో కొన్నిటిని వేళ్ళమీద లెక్కించాల్సి వస్తే అందులో రెండు వేళ్ళ మీద వెంటనే వచ్చి వాలే పాటలు కృష్ణశాస్త్రి రచనలే. అవి- చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, కుశలమా నీకు కుశలమేనా ...అన్నవే. రెండు పాటలూ యుగళ గీతాలే. ఆ రెండు కూడా బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడినవే. చీకటి వెలుగులు పాట శ్రావ్య రాగమాలిక. అది చక్రవర్తి గారిని ఉన్నత శిఖరాన కూర్చోబెట్టింది. కుశలమా – పాట ఎంత ఆధునికమో అంత శ్రావ్యమైనది కూడా. మరొకరు సత్యం. వీరు ఎప్పటినుంచో చిత్రసీమలో ఉన్నా, ఎన్ని పాటలకో హిందీ బాణీలు ప్రేరణగా తీసుకున్నా శాస్త్రిగారి పాటలు తన చేతిలో పడేసరికి తన స్వంత బాణీలోని సత్తా చూపించుకున్నారు. ఎదుటనుంచి కదలను పదములింక వదలను, నేటికి మళ్ళీ మా ఇంట్లో ఎంచక్కా పండుగ, దూరాకాశ వీదుల్లో తారా దీపాలు, రామా ఓ రామా రావా కనరావా - ఈ పాటలన్నీ ఆయన చక్కగా చెక్కిన స్వర శిల్ప రూపాలు. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|