మునుపటి నా మాట
2: ముందు నువ్వు 'అన్నా అన్నా విన్నావా' అని ట్యూన్ లో పాడుతూంటే వింటున్నాను- అదా సంగతి- ఏదీ మన సుసర్ల దక్షిణామూర్తి గారి గురించేనా నువ్వంటున్నదీ? 1: నూటికి నూరు శాతం ఆయన --- అదే ఆ మహానుభావుడి గురించే. 2: ఆ పాట కూడా ఆయన కట్టినదే—ఐతే ఇబ్బంది ఏమిటంటే దాని మాతృక ఓ హిందీ పాట, బొంబాయి రవి అంటారే ఆయన కట్టినది. 1: అలాంటివి తెలుగు సినిమాల్లో తప్పని గానీ, సరి అనిగానీ అనలేం. తప్పని సరి –అంతే! 2: శ్రీశ్రీ జోకులాగ ఉందే- 1: నువ్వన్న ఆ పాట – 'చందామామా దూర్ కే పుయే పకాయీ బూర్ కే' . గమ్మత్తేమిటంటే సుసర్ల వారి చాలా పాటల్లో చందమామ, వెన్నెల ఉంటాయి. అలా ఈ హిందీ చందమామా కూడా తెలుగయ్యాడు. 2: అంటే గుర్తొస్తున్నాయి- ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో’ అన్నది సంతానం నుంచి ఒకటి, ‘చల్లని రాజా ఓ చందమామా’ అన్నది ఇలవేల్పు నుంచి ఒకటి, ‘అందాలా చందమామా’ అన్నది సంసారం నుంచి ఒకటి. ఇంకా-- 1: సుసర్ల వారూ, సుశీల పాడిన యుగళ గీతం ఉంది కదా- చల్లని పున్నమి వెన్నెలలోనే ఒళ్ళు దహించే వేడి ఎందుకో? – అది కూడా ఇలవేల్పు సినిమా నుంచే. 2: ఇదేదో పింగళి వారు రాసిన ‘వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే చల్లనేలనో’ పాటని తలపోస్తోందే! 1: ఇలవేల్పు లో చాలా వరకు పాటలు వడ్డాది వారు రాసినవి.
2: ఇలవేల్పు పాటల పుస్తకం ఉంటే బావుణ్ణు. 1: దానికేం భాగ్యం- మా మిత్రుడు మస్తాన్ రెడ్డి విశాఖపట్నం లో కొన్నేళ్ళ క్రితం ఆరిపాక సూరిబాబు వారిని కలిసి నా పాటల హాబీ గురించి చెబితే ఆయన సంతోషించి ఆయన దగ్గరున్న ఇలవేల్పు పాటల పుస్తకం ఇచ్చారు. ఎంత భాగ్యం! పైగా ఆ పాటల పుస్తకం మీద ‘భరాగో ‘ వారి సంతకం కూడా ఉంది. అది మరింత భాగ్యం. గింజ గింజ మీదా రాసి ఉంటుందట అది ఎవరి నోటికి ప్రాప్తమో , వారి పేరు! ఇంకా చాలా పాటల పుస్తకాలు ఛత్రపురం బాబీ, బరంపురం సుందర్, బరంపురం చిన్నమ్మవారి కోవెల దగ్గర ఒకనాటి కిళ్ళీషాపు, కాకినాడ సినిమా హాళ్ళ రోడ్ కొసాన కిళ్ళీ షాపు , విశాఖ పూర్ణా మార్కెట్ - వీరి, వీటి దయ వల్ల ప్రాప్తించినవే. 2: ఆ ఇలవేల్పు పాటల పుస్తకం, అందులోని పాటలు ‘కనులు చదివినా పాటే ’ లో నువు చూపిస్తే మరీ భాగ్యం! 1: సుసర్ల వారికిప్పుడు తొంభై ఏళ్ళు కదా- అంటే ఆ వయసులో అంతా చిన్న పిల్లలే కదా. అందుకే ‘అన్నా అన్నా విన్నావా –చిన్ని కృష్ణుడు వచ్చాడు’ అని ఈ రోజు పాడుకోవడం సబబు గానే ఉంటుంది. 2: ఈ రోజు అంటే ఏ రోజు? 1: అదే- నవంబర్ 11 న. 2: అంటే 1921 నవంబర్ 11 న ఆయన పుట్టారు- ఈ సంవత్సరం ఈ లెక్క బావుంది 11.11.11. పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు, పిల్లల్ని కనే వాళ్ళు ఈ ప్రత్యేక దినం కోసం కలవరిస్తూ ఉండాలే. ఐతే – సుసర్ల వారి పాటలకా రోజు మాంఛి డిమాండ్ ఉండాల్సిందే. 1: తెలుగు వాళ్ళు ఆయన్ని మరిచిపోకుండా ఉంటే చాలు. 2: సుసర్ల వారిది దివిసీమ కదూ. 1: పెదకళ్ళేపల్లి – అదే దక్షిణ కాశీ- ఆయన ఊరు. దివిసీమ గుర్తు చేశావు- గుర్తుందా 1977 నవంబర్ 19 న ఆ దివిసీమ పెను తుపానూ, ఆ అతలా కుతలం! 2:ఎలా మరచి పోవడం? ఈ నవంబర్ నెలలో ఎన్నో మంచివీ , ఎన్నో చెడ్డవీ విశేషాలు జరిగాయి. 1: మంచివే తలుచుకుందాం. నవంబర్ నెల సుసర్ల వారికి మరపు రానిది. 2: ఎలా? 1: నవంబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ కదా. ఆ తొలి ఉత్సవంలో ఈ నవంబర్ బార్న్ సుసర్ల వారు ప్రార్థనా గీతం పాడితే ఆయన్ని సన్మానించింది ఎవరనుకుంటున్నావూ? నవంబర్ బార్న్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ! 2: అవునవును. ఇంకోటి తెలుసా- సుసర్ల వారు అప్పటి సిలోన్ జాతీయగీతం ట్యూన్ చేశారని విన్నాను. 1: అదే- అంత గొప్ప విషయాన్ని ఎక్కడా ఎవరూ ప్రస్తావించక పోవడం బాధాకరం. యూ ట్యూబులో ఆ ఊసే లేదు. కె.రాణిచేత ఆయన పాడించిన ఆ గీతం రికార్డ్ గానూ వచ్చిందట. ఇవాళ మన వి.ఏ.కె. రంగరావు గారు తన అమూల్య ఖజానా నుంచి తీసి వినిపిస్తే బావుణ్ణు. 2:అనంత శయనుడు బోల్డంత బంగారం అదీ దాచుకున్నట్టు మన వి.అనంత కృష్ణ రంగరావు బంగారం లాంటి ఖజానా దాచుకున్నారు. ఈ మధ్య కాలంలో అమీన్ సహానీ రేడియో లో మళ్ళీ పాత వారి గురించి వినిపిస్తున్నట్టు మన వి.ఏ.కె.గారు కూడా అలాంటి ప్రోగ్రాం ఇస్తే బావుణ్ణు’ 1:అప్పుడు ఎంచక్కా సుసర్ల వంటి వారి పాటల చరిత్ర, మాటల భాగ్యం దక్కేది మనకి. 2:ఆ మధ్య ఓ టీవీ ‘ఛా’నెల్ వాళ్ళు గొప్పగా సుసర్ల వారిని ఇంటర్ వ్యూ చేసినప్పుడు ఆయన ‘ఆలీబాబా నలభై దొంగలు’ (1956) సినిమా పేరు చెప్పగానే వీళ్ళు ముందూ వెనకా ఆలోచించకుండా ఎన్టీఆర్, జయలలిత నటించిన ఆలీబాబా నలభై దొంగలు (1970) సినిమా పాట – నీలో నేనై నాలో నీవై – అనేది చూపించారు. సుసర్ల వారు చెప్పింది ఆయన మ్యూజిక్ ఇచ్చిన సినిమా. వీరు చూపించిన సినిమాకి ఘంటసాల మ్యూజిక్. 1: అలా ఇచ్చి వాళ్ళూ ఓ మంచి పనే చేశారు- సుసర్ల వారికీ, ఘంటసాల వారికీ మంచి అనుబంధముంది అనేది తెలిసేలా చేశారు. ఒకప్పటి రోజుల్లో లక్ష్మమ్మ , శ్రీ లక్ష్మమ్మ కథ (1950)అనే ఒకే కథ ఉన్న సినిమాలు రెండు పోటీ గా వచ్చాయి. లకారం సినిమాకి ఘంటసాల, శ్రీకారం సినిమా కి సుసర్ల మ్యాజిక్ ఇచ్చారు. 2: రెండూ సంగీతపరంగా గొప్పవే. ఆయన సకారాత్మకంగా చేసినవి సంసారం (1950), సర్వాధికారి (1951), సవతి పోరు (1952), సంతానం (1955), సంకల్పం (1957) అనే అయిదు సినిమాలుంటే శ్రీకారం చుట్టినవి మూడే సినిమాలున్నాయి - శ్రీ లక్ష్మమ కథ (1950), శ్రీమద్విరాట పర్వం (1979), శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984). ఈ చివరి సినిమాతో ఆయన సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. 1: సుసర్ల వారు సినిమాలకి రాక ముందు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. అంతకు ముందు హెచ్ ఎం వీ కంపెనీ లో పని చేశారు. అక్కడే ఆయనకి విశ్వనాథన్-రామ్మూర్తి జంట లోని రామ్మూర్తి కొలీగ్. తరువాతి కాలంలో వీరంతా కీ.శే.సుబ్బరామన్ దగ్గర పని చేసినవారే. ఐతే ముందు సుసర్ల వారి ప్రతిభ- అంటే సుసర్ల వారు మంచి గాయకుడు, వయోలిన్ వాద్యకారుడు కాబట్టి- గుర్తించి సినిమాల్లోకి ఆయన్ని రప్పించినది బి.ఎన్.ఆర్ అనే భీమవరపు నరసింహారావు గారే. 2: సుసర్ల వారు అందరికీ గుర్తుండేది ‘నర్తనశాల (1963)’ సినిమా వల్లనే. 1: అవును. అందులో ఆయన తన స్వర విశ్వరూపం చూపించేరు. మళ్ళీ అంతే హుషారుగా ఆయన అదే ఎన్టీఆర్ సినిమా‘శ్రీమద్విరాట్ పర్వం’ కి పాటలు కట్టి భేషనిపించుకున్నారు’ 2: కరెక్ట్. ఇక్కడో విశేషం ఉంది- ఈ రెండు సినిమాల్లోనూ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడడం. 1: అది బాలమురళి వంటి మేధావుల సంస్కారం. సుసర్ల వారి తాతగారు (దక్షిణామూర్తి) త్యాగరాజ స్వాముల శిష్యులైనఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారి శిష్యులు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దక్షిణామూర్తి (తాతగారు) శిష్యులు.పారుపల్లి వారు బాలమురళి వారి గురువులు. సుసర్ల వారు లతా మంగేష్కర్ వంటి మహా గాయనికి తొలి తెలుగు పాట పాడే అవకాశం కల్పించారు. బాలమురళి వారికి సినీ ‘సలలిత రాగ సుధా రస సారం’ తొలి సారిగా అందింది సుసర్ల వారి వల్లనే. ఒరియా గాయకుడు రొఘునాథ పాణిగ్రాహి గారికి ఇలవేల్పు లో అవకాశమిచ్చారు. ఘంటసాల కాక ఏ ఎన్ ఆర్ కి మరో గాయకుడు పాడడం ఆనాటి ఒక విప్లవమే కదా. అంత దాకా ఎందుకూ- సుసర్ల వారే స్వయంగా ఏ ఎన్ ఆర్ గారికి పాడితేనూ! గాయనీమణులు ఎం ఎల్ వసంతకుమారి, జమునా రాణి, లీల, బెంగళూరు లత లను పరిచయం చేసింది సుసర్లవారే. సుసర్ల వారు సంతానం లో శిష్యుడు కోదండపాణి గారికి అవకాశమిచ్చారు. ఇలా కొత్త గొంతుల్ని ప్రోత్సాహించే సుసర్లవారి గుణం కోదండపాణి గారికి కూడా అలవాటైంది. పాణి రఫీ, ఏసుదాస్, వాణీ జయరాం, ఆనంద్ ల గళాలు తెలుగువారికి పరిచయం చేశారు. పాణి తీసుకొచ్చి, తీర్చి దిద్దిన ఎస్పీ బాలుడు ఇవాళ పద్మభూషణుడు. బాలు సుసర్ల వారిని తాతయ్యా అని ప్రేమతో పిలిచే వారు. బాలమురళి వారిని నాన్నగారూ అని ఆప్యాయంగా పిలిచేవారు. 2:పదహారవ ఏటనే ‘గజారోహణ’ గౌరవం పొందిన సుసర్ల వారిని భారత ప్రభుత్వం సత్కరించాలి. తన నటనతో ఎస్వీ రంగా రావు ‘నర్తనశాల’ సినిమాకి విశ్వ ఖ్యాతి తెచ్చినట్టే తన సుస్వర సంపదతో సుసర్ల ఆ సినిమాకి జీవం పోశారు. మహానటిసావిత్రి సరే సరి. ఇక ఎన్టీఆర్ – వహ్వా. 1: ఎన్టీ ఆర్ సుసర్ల వారికో బిరుదు ఇచ్చారట. దాని పేరు- స్వర సుధానిధి. ఆయనకి ఈయన ప్రతిభ పట్ల గౌరవముండేది. అందుకే శ్రీమద్విరాటపర్వం, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర - రెండు చిత్రాలూ సుసర్ల వారి చేతిలో పెట్టారు ఎన్టీ ఆర్. 2: నర్తనశాల లో శోభన్ బాబు పైనే యుగళ గీతముంది. శ్రీశ్రీ వారి పాట- ‘ఎవ్వరికోసం ఈ మంద హాసం’ అది. ‘ఎవ్వరి’ అనే మాట పలికించిన తీరు ఒక ఎత్తు, పాటలో వినిపించే నేపధ్య సంగీతం, అందుకు తగ్గట్టు ఎల్.విజయలక్ష్మి వేసిన అడుగులు మరో ఎత్తు. 1: సఖియా వివరించవే- ఆ పాట ఎంచక్కా తెలుగు గజల్ అని చెప్పుకునేలా చేశారు. 2: అన్నపూర్ణ – సినిమా ఏ ఎన్నార్ సినిమా అనుకునే అవకాశముంది. అది అన్నపూర్ణా స్టూడియోస్ ది కాదు. జగపతిసంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ తీసిన తొలి సినిమా. జగపతి వారి ఈ తొలి సినిమా లో పగటిపూట వెన్నెలని తళ తళ మిల మిల మెరిపించి చూపించినవారు సుసర్ల వారే! 1:అన్నట్టు ఈ జగపతి నిర్మాత రాజేంద్ర ప్రసాద్ వారి పుట్టిన రోజు ఇటీవలే అంటే నవంబర్ 4 న జరిగింది. ఆయన ఎనభై లోకి అడుగు పెట్టారు. 2: వి బి రాజేంద్ర ప్రసాద్ తన స్వంత సినిమాలకి ఎక్కువగా ‘అ’ లేదా ‘ఆ’ అక్షరం తో వచ్చే టైటిల్స్ పెట్టే వారు. అలా మొదలైంది అన్నపూర్ణ (1960)నుంచే. అప్పుడు దక్షిణా మూర్తి సంగీత దర్శకులు కదా. ఈ ‘ద’కార మహిమేమో కానీవి.బి. కొన్నేళ్ళ తరువాత ‘దసరాబుల్లోడు’ సినిమాని రంగుల్లో తీసి స్వయంగా దర్శకత్వం బాధ్యత చేపట్టేరు. 1: జగపతి వి బి, గజారోహి సుసర్ల ల పుట్టిన రోజులు నవంబర్ లోనే కావడం కూడా బావుంది. ఇన్ని కబుర్లు చెప్పుకుంటున్నామా – అటు చూడు చందమామ, పైగా కార్తీక వెన్నెల, అచ్చం పాల గిన్నెలా. సుసర్ల వారికి గ్రీటింగ్స్ చెప్పేశాం. ళాకు ళిద్దరొస్తోంది’ 2: నిద్దురపోరా తమ్ముడా---- 1: అదే సుసర్ల వారు లతా మంగేష్కర్ చేత పాడించిన పాట , మరో వెర్షన్ ఘంటసాల కూడా పాడారు. ఇప్పుడు తెలుగు సినిమాకి ఎనభై ఏళ్ళు. సుసర్ల వారికి తొంభై. అంటే తన పదో ఏటనే ప్రహ్లాదుడిని తొలి బొమ్మ గా చూసి ఆనక అలాంటి బొమ్మలకి సంగీతమిచ్చిన పలు భాషా కళా స్రష్ట ఈ మహానుభావుడు సుసర్ల వారికి జయహో! [కనులు చూసినా పాటే: నర్తనశాల (మహా నటుడు ఎన్టీ ఆర్ హావ భావాలు రాగానికి తాళానికి తగ్గట్టుగా ప్రదర్శించడం చూసి తీరాల్సిందే), సంతానం ( మహా నటి సావిత్రి ముఖ కవళికలు మనోహరం, మహా నటుడు ఏ ఎన్నార్ లో ఘంటసాల ఎంతగా ఇమిడిపోతారో అంతే స్థాయిలో ఏ ఎన్నార్ అభినయం ఉంటుంది ) ; కనులు మూసినా పాటే: రెండు పాటల్లో (ఇంత చల్లని రేయి, నాటి రోజు ఏల రాదు) రాగ మాలికలు గమనించండి, సుసర్ల వారి గాత్రం పరిశీలించండి, కస్తూరి శివ రావు హాస్య నటుడే కాదు మంచి గాయకుడు కూడా అనేది గ్రహించండి ; కనులు చదివినా పాటే: ఇలవేల్పు పాటల పుస్తకం తెరవండి;ఆహా ఆహాహా : ప్రతి రాతా ప్రసిద్ధమే - విశాఖ సూరిబాబు లేఖ ] -డా .తాతిరాజు వేణుగోపాల్ , నవంబర్ 10, 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|