కృష్ణ ప్రేమ
Menu

మునుపటి నా మాట

తెలుగు వారి   ప్రాస మైత్రి 

12/5/2013

3 Comments

 
Picture
హృద్యమైన పద్యం:

‘నేనొక/ పూలమొ/క్క కడ/ నిల్చి చి/వాలున /కొమ్మ వం/చి గో

రానెడు/నంతలో/న విరు/లన్నియు/ జాలిగ/ నోళ్ళు వి/ప్పి మా

ప్రాణము/లు తీతు/వా యంచు/ బావురు/మన్నవి …….

తెలుగు పద్యాల్లో  ‘వృత్తములు’ అనేవి  నేర్చుకున్నప్పుడు, అంటే ఇలాంటి పద్యమొకటి చదివినప్పుడు, పద్యపాదంలోని తొలి అక్షరాన్నియతి అంటారని కొత్తగా చెప్పనక్కర్లేదు.  ‘యతి మైత్రి’ అనేది ఇలాంటి పద్యాలు రాయడానికి ఎంత సహకరిస్తుందో మనకి తెలుసు.  యతి స్థానం లో కొన్ని అక్షరాలకి  మరి కొన్ని అక్షారాలతో మిత్రలాభం ఉంటుంది. ఉదాహరణకి- త-ద, ప-బ-వ, చ-జ-స, క-గ, ర-ల, న-ణ. ఉత్పలమాలలో పదవ అక్షరం, చంపకమాల,మత్తకోకిల  వృత్తాల్లో పదకొండవ అక్షరం,  శార్దూల వృత్తంలో పదమూడవ అక్షరం యతిస్థానం అని నియమం ఉంది. కరుణశ్రీ వారి ఈ పద్యం  పూల మీద పద్యం కాబట్టి ఉత్పలమాల వృత్తంతో ప్రారంభించారు ఆ కవీశ్వరులు.  ఇక్కడి పద్యంలో లావుపాటి అక్షారాలు ఆ యతిమైత్రిని చూపిస్తున్నాయి.

ఈ వృత్త పద్యాల్లో ప్రతి పాదంలో వచ్చే రెండవ అక్షరం ప్రాస. ఇక్కడ పువ్వుల పద్యంలో నకారం అలా వచ్చినదే. నన అన్నా పువ్వే. బహుశా అందుకే పూల మీద పద్యాల్ని నకార ప్రాసతో ప్రారంభించారు కరుణశ్రీ కవి.

 ప్రాసలు ఆరు రకాలు.

పద్యాలు సరే, వృత్తాలు సరే – ఒక నియమం అంటూ ఉంది. ఆరు రకాల ప్రాసలతో పద్యాల్ని అవలీలగా రాసి పారేశారు వెనకటి తరం వారు. మళ్ళీ అటువంటి పద్యాలు రాయలేకనో ఏమో జనం మెచ్చరనే సాకుతో ఏకంగా ఒక కొత్త పౌరాణిక చిత్రంలో పద్యాలే లేకుండా చేశారు.

పాట అన్నది జానపదమూ కావొచ్చు,  లలిత గీతమూ కావొచ్చు, సినిమా పాట కావొచ్చు

పాటకి పల్లవి ప్రాణం. పాట అంతటికీ కాకపోయినా పాటకి ప్రాణం పోసేది  ప్రాస.

అటువంటివి ఆరు రకాల  ప్రాసలు పాటల్లోనూ వేయొచ్చు.  వృత్త పద్యంలో ఉన్న నాలుగు పాదాలు కలబోసి అనువైన రాగంలో స్వర పరిచి పాడతారు కనుక యతిస్థానం, ప్రాస వంటివి చూసినప్పుడు గోచరించి నట్టుగా పాడేటప్పుడు అగపించవు.

పుష్పవిలాపం లో ఉదాహరించిన తొలిపద్యం పాడినప్పుడు ‘గోరానెడు నంతలోన’ అని కలిపి పాడడం గమనించే ఉంటారు. పాటలో పల్లవి,అనుపల్లవి, చరణాలు అనే క్రమం ఉంటుంది. అందులో పాట మొత్తంగా అన్ని రకాల ప్రాసలు వేయడం సాధ్యమే.

సాధారణంగా తెలుగు పాట చరణంలో  నాలుగు పంక్తులే ఉంటాయి. హిందీలో అయిదారు  పంక్తులు ఉండడం సహజం. శంకర్ జైకిషన్ స్వర పరచిన తెలుగు పాట ‘కంటి చూపు చెపుతోంది’ పాటలో గమనించి నట్టయితే  ‘ఆడపిల్లా పూలతీగే ఒక్కలాగే చక్కనైనవి’ అని ఒక పంక్తి, ‘ఆడపిల్లా పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి’ అని వెంట వెంటనే అవే మాటలు పునరుక్తం చేస్తూ మరో పంక్తి కనిపిస్తాయి.  ప్రాసలకి పెట్టిన పేరైన ఆరుద్ర గారు ఈ చరణంలో  ఎక్కడా ప్రాస వేయలేదు.  ఇచ్చిన ట్యూన్ కి పాట రాస్తే కవి ఎంతగా స్వేఛ్చ కోల్పోతాడో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు.

ఇంతకీ ఆ ఆరు రకాల ప్రాసలేమిటో అని ఎదురు చూసేకన్నా అయిదు  రకాల ప్రాసలు  సినిమా  పాటల్లో ప్రయోగించిన  వారిలో ప్రముఖుడు పింగళి నాగేంద్రులు అని గుర్తించి  ఆయన నిర్వహించిన  ‘ప్రాస క్రీడలు’ ఉదాహరించుకుంటే చాలు.

సుకర ప్రాసము :  రావోయి చందమామా /మా వింత గాథ వినుమా; ఐనదేమో ఐనది ప్రియ/గానమేదే ప్రేయసీ

ద్విప్రాసము: సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్;  దండి రాక్షసుల దండన శాయ కోదండ ధరుడవు;

అనుప్రాసము: తన మతమేదో తనది మన మతమసలే పడదోయ్/ మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్ / సతి పతి పోరే బలమై  సతమత మాయెను బ్రతుకే; మేలే అయినా మాలిమైనా జాలము నీదేలే;

దుష్కర ప్రాసము: రక్షలు రక్షలు పాద రక్షలు నాట్య శిక్షలో బాలశిక్షలు;

అంత్య ప్రాసము: ఆశా ఏకాశా నీ నీడను మేడలు కట్టేశా ; రాజా మంత్రా ఎవరూ ఎక్కడా? తా తరికిట తా తరికిట తలాంగు  తరికిట  తకథా; ఓ మరదలా నా మదిలో పొంగి పొరలే ప్రేమ వరదలా;

ఇవన్నీ తతిమ్మా కవుల్లోనూ కనిపించ వచ్చు. కాని చిన్న మాటలతో చిరాకు పెట్టని భావాలతో అతి సులువుగా నోట కరిగేలా పాట కూర్చడం పింగళి వారికి  ‘చేత వెన్న ముద్ద’ (కరతలమలాకం అనడం  పాత మాట కదండీ).

నీ దయ గౌతమి గంగ రామయ నీ దాసులు మునుగంగ, శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన,...వంటి పంక్తులూ, ప్రాసలు చదివితే అవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలని తెలిసిపోతుంది.  వీరు తప్ప మరొకరు అనలేరు అన్నట్టుండే ప్రాసంగం : ఎరిగినదొకరే ఒకరు – తెర వెనుక దాగి దొరకరు! తెలుగుతల్లి గురించి చెబుతూ మంచి ముత్యాల పేట, మధురామృతాల తేట, చక్కర మాటల మూట, చిక్కని తేనెల ఊట, తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ....అని అడుగడుగున ప్రాసల సవ్వడి వినిపించారు.

మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పాటల్లో తెలుగుతనం ఎక్కువ, ప్రాసలు తక్కువ.  వెతికితే దొరికేవి -  చిననాటి మనపాట మిగిలేనులే కలకాలమీ  గాథ రగిలేనులే, రేరాజు పలుక రేరాణి కులుక, నీ బాస నేనై నా ఆశ నీవై, చిలకనురా మరు మొలకనురా, నిలువ నీయదోయి  ఈ లేలేత వెన్నెల రేయి, చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింత.....వంటివి.

ఈయన ఆప్యాయంగా ‘అన్నగారూ’ అని పిలిస్తే ‘చెప్పండి అన్నగారూ’ అని బదులిచ్చే సముద్రాల వారు మాత్రం ప్రాస హృదయులే. ‘నీ దరినున్నతొలగు భయాలు – నీ దయ యున్న కలుగు జయాలు’,  ‘అంతట నీవే ఉండెదవు   శాంతివై  కాంతివై నిండెదవు’- మచ్చుకి కొన్ని, మెచ్చుకోలుకి ఎన్నో- ఉరుకుల పరుగుల దొరా – నీ మగసిరికిది తగదురా...వంటివి.

జానపద బ్రహ్మ కొసరాజు ‘అందరినీ దరిజేర్చు మా రాజువే అద్దరిని ( ఆ + దరి , త్రిక సంధి) చేర్చమని అడుగుతుండావే  అని గుహుడి చేత రాములవారిని (గోదావరి నది దాటించేటప్పుడు) ఆట పట్టిస్తే మనసు కవి ఆత్రేయ మరో నదీ ప్రస్తావన  చేస్తూ ‘నేనీ దరినీ నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అని చమత్కరించారు.

మహాకవి శ్రీశ్రీ లాంటివారు మాత్రమే నిత్యసత్యాలు దాపరికం లేకుండా చెప్పగలిగేది కాబట్టే ‘కాలే ఆకలి కార్చిచ్చు- దాన్ని కల్లు నీళ్ళతో సల్లార్చు’ వంటి పంక్తులు పుట్టాయి. ‘కల్లు మానండోయ్ బాబూ..ఇల్లు ఒళ్ళు గుల్ల చేసే’ అనే నినాదం నినాదంగానే మిగిలిపోయింది. ‘బాధలన్నీ బాటిల్స్ లో నేడే దించేసేయ్’ అని ఆత్రేయ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. శ్రీశ్రీ వారికి జెండా చేతికిస్తే ‘ఆకాశ వీధుల ఎదురే లేకుండా –ఎగురునులే మన జెండా’ అని ప్రాస గగన విహారం చేసి వస్తుంది.

పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, ఇరుగింటి చినదానికి తగని మక్కువ, ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ? – ఇలాంటి పాట వింటే  ఇది ఆరుద్ర కవి ముద్ర అని మనం కూడా ప్రాసానుకూలంగా మాట్లాడుతాం. సెలయేటి గలగల చిరుగాలి కిలకిల ...ఇలా పదాలు ఆమ్రేడిస్తున్నా ఆ పదాల ఆమ్ర రసం తీపిని రెట్టించి దట్టించి మరీ కలిగించేవారు ఆరుద్ర గారు. ‘ఆకాశం దించాలా? నెలవంక త్రుంచాలా? సిగలో ఉంచాలా?’ –చాలా? ఆరుద్ర ముద్రకి ఇంకా ఉదాహరించాలా?

పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటీ? యమపాశం అని జాలిగా ప్రాసించేది వీరే. పైలా పైలా పచ్చీసు లైలా అంటూ మజ్నూసు వెంట తిరుగుతూ వెక్కిరించితే చేస్తారండీ మాలీసు అని జాలీగా ప్రాసించేది వీరే.

ప్రాసకోసం పాటనే మోసం చేయడం ఆరుద్ర వంటి వారికి గిట్టదు. నీలో నాలో ఒకటే రక్తం – నీదీ నాదీ ఒకటే ప్రాణం అనే పాటలో నువ్వూ నేనూ అన్నా చెల్లి – ఒక్క దేవుడే మనకు తల్లీ తండ్రీ’ అని అన్నారు కాని చెల్లికి ప్రాసగా తల్లిని వేసి తండ్రీ తల్లి అని భావాన్ని చెడగొట్టలేదు.

సి.నా.రె. వారి ప్రాసలు అరటి పండు ఒలిచి పెట్టినట్టు అతి సులువుగా ఉంటాయి. ఏనాటిదో మన బంధం...ఎన్ని యుగాలైనా అది ఇగిరిపోని గంధం, జగమే రామ మయం- మనసే అగణిత తారక నామ మయం,  మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా? మా కథయే విన్నారా?, ఆ కనులు ఇంద్ర నీలాల గనులు ---పాటల మాటల మూటలు పేర్చుకుంటూ పొతే ఎవరెస్ట్ శిఖరమే ఔతుంది.

దీపం అనే మాటకి ఎన్ని ప్రాసలు వేయొచ్చో అన్నీ వేసి చూపించారు కవి దాశరథి గారు. వెలిగించవే చిన్ని వలపు దీపం అనే లలిత గీతంలో దీపంకి ప్రాసగా కోపం, తాపం,లోపం అనేవి ప్రత్యక్షమయ్యాయి. ఓ చెలీ కోపమా అంతలోనే తాపమా – అని సముద్రాల వారు హిందీ ట్యూన్ కి తగిన తెలుగు ప్రాసలతో చక్కని పాట రాశారు. మరికొంతమంది వీటికి శాపం కూడా చేర్చారు.  

ప్రాస మైత్రి:

యతి మైత్రి లాగ ప్రాస మైత్రి ఉంటుందని ఎక్కడా ఎవ్వరూ చెప్పిన దాఖలాలు లేవు కదూ. చెబుతా – సినిమా పాటలు విని విని చెవులు పెద్దవై పోయిన పెద్దవారికి బాగానే గుర్తుంటాయి, ఇప్పుడిక్కడ చెప్పే మైత్రీ పదాలు. మనసు-తెలుసు, చెలిమి-కలిమి, అందం-బంధం, అందాలు-చందాలు, అందం-మకరందం, నిండు-పండు, ఆగు-సాగు, రాజా-రోజా, నవ్వు-పువ్వు, బంగారం- సింగారం, సన్నిధి-పెన్నిధి, దోచు-దాచు, ఇష్టం-కష్టం  !   

మనసు-తెలుసు:

నాది చుప్పనాతి మనసు అది నీకు తెలుసు – అన్నారు ఆత్రేయ.  ఆయనే  అన్నది-  ఈ అందానికి బంధం వేశానొకనాడు, ఆ బంధమే నాకందమైనది ఈనాడు, అని. అంతకు ముందు ఈయనే ‘అందం ఉరికింది, వయసుతో పందెం వేసింది, మనసులో బందీ అయింది, ఇదేమి బంధం అంటూంది- అని చమత్కరించింది.  యాసతోనూ అందంగా ప్రాసల్ని బంధించడం ఈయనకే చెల్లింది. ముక్కు మీద కోపం నీ ముకానికే అందం- నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బందం....ఈ పాటతో దరిమిలా గాయని జమునారాణి గాత్రం, నటి జమున నటనా రాణించాయి.

అందాలు-చందాలు:

అందచందాల ఓ తారకా –అని రాయడం వేరు, అందాలు ఒక పంక్తిలో, చందాలు మరో పంక్తిలో రాయడం విశేషం. పింగళి వారి చేతిలో పడగానే ...గోకుల కృష్ణుని  అందాలు, ముసిముసి నవ్వుల చందాలు ---మన కళ్ళెదుట మెరిసాయి.

అందం-మకరందం :

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం – సముద్రాల జూనియర్ (బ్రతుకు తెరువు)

ఎటు చూసినా అందమే- చిందును మకరందమే- ఆరుద్ర  (దేవాంతకుడు)

అందానికి అందం నేనే – జీవన మకరందం నేనే  - మల్లాది (చివరకు మిగిలేది)

చెలిమి-కలిమి:

ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి (జగమే మారినది మధురముగా ఈవేళ - దేశద్రోహులు) అని ఆరుద్ర గారు రొటీన్ ప్రాస వేస్తె  ఈయన గురువుగారు మల్లాది వారు చిననాటి చెలిమీ – ఆనాటి చెలినీ (నన్నేలు మోహనుడేడమ్మా –దొంగల్లోదొర) అని రొటీన్ కి భిన్నంగా ప్రాస వేసే తన రూట్ వేరు అని చూపించారు.

బంగారం-సింగారం:

అడుగడుగున బంగారం ఆకుపచ్చని సింగారం – అనేది కృష్ణశాస్త్రి వారి ఖజానా అయితే     సీతాలు సింగారం మా లచ్చి బంగారం –అనేది వేటూరి వారి సంపద అయింది.  వేటూరి వారు అంతటితో ఆగక ‘నీ ఇల్లు బంగారం కానూ నా ఒళ్ళు సింగారం కానూ’ అని ఎంతో మెతగ్గా సామెతకి ఒక పొడిగింపిచ్చి కొత్తరకం పాటల ఇనప్పెట్టె మోసుకొచ్చారు.

సన్నిధి-పెన్నిధి:

నీ సన్నిధే నా పెన్నిధి, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, ఒక పిలుపుతో పిలిచితే పలుకుతావట ..నీ సన్నిధే  నా పెన్నిధి---- ఇవి ఒకనాటివి. ఇప్పుడీ పదాలు అటకెక్కాయి. 

ఆగు-సాగు:

దూర దూర తీరాలకు సాగుదాం /సాగి దోరవలపు సీమలో ఆగుదాం (అదిగో నవ లోకం – వీరాభిమన్యు)- అని ఆరుద్ర చక్కగా ప్రాసిస్తే అంతే చక్కగా సాగుదాం అని గమకం వేయించి, ఆగుదాం అనే  మాటని  అన్న పళాన ఆపించిన గడుసు వారు స్వరకర్తలు మహదేవన్,పుహళేంది. వీరు స్వరమిస్తే తగినట్టే వారు రాశారో, వారు రాశాకనే వీరు స్వర పరిచారో ఆ త్రిమూర్తులకే తెలియాలి,

రాజా-రోజా:

‘నీవు నాకు రాజా మరి నేను నీకు రోజా’ (రాజకోట రహస్యం), ‘టైము రోజాలే మనం రాజాలే’ (నీతీ నిజాయితీ) లాంటి పాటలు రాసినప్పుడే పింగళి వారు ఇంక తనలాంటి వారికి టైం బావులేదని గ్రహించి ఉంటారు.

నవ్వు-పువ్వు:

చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపువ్వు – ఇది మూసలో పోసిన ప్రాస ఉన్న పాట. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వు అన్న ఆత్రేయ గారే నవ్వులు రువ్వే పువ్వమ్మా –నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా అంటూ మరో ఆకు ఎక్కువ చదివారు.

దోచు-దాచు:

దోచు- దాచు అని  మరీ ఏకవచనంలో కొట్టినట్టు అనకపోయినా దోచుకో, దాచుకో అనే అనుమతి ఇచ్చే టైపు లో ప్రాసలు వేసారు ఒకనాటి సినీ కవులు. రాను రానూ వీటితో పెడర్ధాలు ఎక్కువై పోయి నందుకో, వెగటు పుట్టినందుకో ఎందుకో గాని ప్రస్తుతానికి వీటి ఉపయోగం తగ్గిందనే చెప్పొచ్చు.

ఇష్టం-కష్టం:

కొంచం ఇష్టం కొంచం కష్టం – అనే సినీ టైటిల్ వరకు లాక్కు పోయిన ప్రాస మైత్రి ఇది. 'పైసా అంటే నాకూ ఇష్టం పైసా లేనిదే మనుగడ కష్టం' – ప్రాస మైత్రిని సవ్యంగా ఉపయోగించిన ఈ పంక్తి నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే (భలే రంగడు)  పాటలోనిది.    

వేటూరి వారు కొత్త ప్రాస మైత్రి కనుగొన్నారు, అందులో ప్రముఖమైనది : మారాణి – పారాణి.

తెలుగు-వెలుగు అనేది పాతబడిన ప్రాస మైత్రి అయితే ఈయన తెలుగు-జిలుగు అనే కొత్త మైత్రి సంపాయించి పెట్టారు.

'మల్లెపూల మారాణికి  బంతిపూల పారాణి' , 'మల్లె పువ్వా కాదు మరుల మారాణి  బంతిపువ్వా పసుపు తాను పారాణి',  'ఆ రాణి పారాణి జిలుగులో  నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో'- అనేవి వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన ‘ప్రాస’ క్యూషన్లు.  ఆయన వాదనలో అర్ధముంది. మారాణి కి మాగాణి అవసరమని గుర్తించిన ఈయన ‘నా కన్నా ఎవరయ్యా మారాణులు –మనకున్న బంధాలే మాగాణులు’ అని తేల్చి చెప్పారు.

రేయి-హాయి:

ఇవన్నీ ఒక ఎత్తయితే పెద్ద సంఖ్యలో ఆమోదించిన ప్రాస మైత్రి – రేయి, హాయి మరో ఎత్తు.  ఎవరెస్టు!

రేయి రెస్టు నివ్వ వచ్చు కాని ‘హాయి’కి రెస్టుండదు. ‘హాయి’ ఒక విశేషణం. అదో అనిర్వచనీయమైన అనుభూతి. అలా అని ఏ నిఘంటువూ చెప్పదు. పైగా ‘సౌఖ్యము’ అంటుంది. అదే నిజమైతే హాయికి రెస్టు లేనట్టే. అదెలా? నిద్ర సుఖమెరుగదు అంటారు కదా, హాయి అంటే  సుఖం కదా, నిద్ర అంటే రెస్టే కదా- అద్గదీ! అలా అయితే హాయిగా రెస్ట్ తీసుకో, హాయిగా నిద్ర పోయా అని అంటుంటారే-అదీ నిజమే కదా. ఏమిటీ ద్వంద్వం?

పింగళి నాగేంద్రరావు గారు విజయా వారి చిత్రాల్లో ఏదో ఒక పాటలో   ‘హాయి’ అనేది  ఊతపదం లాగ  వేయకుండా ఉండలేకపోయారు. అవీ వినడానికి అంతే  హాయిగా  ఉండేవి. ఆ పదమే పాటకి ఊత అని తరువాత మనకి తెలిసింది. ఒక్క మిస్సమ్మ చిత్రంలోనే ఆయన ‘హాయి’ పదాన్ని ఎలా మిస్ చేశారో అర్థం కాదు.   

ఆయన ఆజన్మ బ్రహ్మచారి.  అయినా ‘పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్ మీరెల్లరు ‘హాయిగ’ ఉండాలోయ్ (పెళ్ళిచేసి చూడు, 1952) – అని ఆశీర్వదించిన నిస్వార్థ జీవి ఆయన. 'హాయిగా ఆలూ మగలై కాలం గడపాలి' – అని మాంగల్య బలం (1958) తెలిసిన మహాకవి శ్రీశ్రీ చేత తిరిగి అదే టానిక్ ఇప్పించ  గలిగిన నాగేంద్ర జాలికుడు ఆయన.

విజయా వారికి పింగళి వారిచ్చిన  హాయి:

విజయా వారి చిత్రాలకి సంగీత దర్శకులు మారవచ్చు కాని ఆస్థాన రచయిత పింగళి వారే. అలకతో  రాజేశ్వరరావు గారు అరక్షణంలో తప్పుకుంటే గంటలో ఘంటసాల వారిని రప్పించి హాయిగా పాటల తంతు పూర్తి చేయించడం  చక్రపాణి గారికి మాత్రమే సాధ్యం.  ఆ చక్రపాణి గారికి తగ్గట్టే చక్కెర, పానీ కలిపిన నేచురోపతి పానకం తన పాట రూపంలో అందజేయడం పింగళి వారికే గాని అన్యులకి దుస్సాధ్యం.  హాయిగా ఆయన చిట్టా తెరిస్తే -

తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి, వసంత నాట్యమే హాయ్ హాయ్ (పాతాళ భైరవి) - పొల్లు చేర్చి మరీ హాయికి కొత్త రూపమిచ్చారు అని,

హాయిగా మనకింక స్వేచ్ఛగా (పాతాళ  భైరవి)- ‘గా’ అనే అందమైన  ఉత్తరాంధ్ర  విరుపులతో హాయిగా రాయగలిగే స్వేచాజీవి వారేగా  అని,

 తీయని రాగమెదో మది హాయిగ పాడెనే (జగదేక వీరుని కథ) – జలకాలప్పుడు ఏమి హాయిలే అంటూ రాగ లహరిలో తేలిపోయేలా  ఊహించడం ఆయనకే చెల్లు అని,

నయగారము లొలికించీ ప్రియరాగము పలికించీ  హాయి నొసగు ప్రియలేలే (జగదేకవీరుని కథ) – అని ప్రతాపు తన భావ ప్రతాపం చూపించాడు అంటే అది పింగళి వారి పాట సత్తాయే  అని,

మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో ...(మాయాబజార్) జగమే తూగెనుగా, పింగళి వారి హాయి ముద్ర పడగా అని,

చేయి చేయి కలుపరావే హాయి హాయిగా (అప్పు చేసి పప్పు కూడు) – చక్కని భాష్యం, భిన్నత్వం నుంచి ఏకత్వం హాయిగొలిపే సూత్రం అని,

‘విజయ’ పతాకం చేపట్టి ఎలుగెత్తి మరీ చాటుతాం. తెలుగు పాటంటే ఛీఛీ అనేవాళ్ళని చాటుకు పిలిచి నాలుగు దులిపి ఇలాంటి పాటలు వినలేదా సీ సీ   అని మరీ క్లాసు పీకుతాం.

విజయా వారి సినిమాలు హై లెవెల్ లో హిట్ అయ్యేవి అనేకన్నా ‘హాయి’ లెవెల్ లో హిట్ అయ్యాయి అని అనడం సబబు.

విజయేతర చిత్రాలకి పింగళి వారిచ్చిన ‘హాయి’:

విరహములోనే హాయి ఏలనో, నీ సొగసూ నీ వగలూ హాయిహాయిగా వెలసేనే, వెన్నెలలోనే హాయి ఏలనో (వెన్నెల లోనే వేడి ఏలనో- పెళ్లినాటి ప్రమాణాలు)

మలయానిలముల లాలన వలెనే వలపులు హాయిగ కురిసి (చల్లగ చూడాలి -  పెళ్లినాటి ప్రమాణాలు)

పింగళి వారు ప్రత్యేకంగా ‘రేయి’ అనేది ఏక పదంగా ప్రయోగించిన  పాటలే లేవు.

ఒకే ఒక్క పాటలో ‘రేయి-హాయి’ ప్రాస మైత్రిని మాత్రం ప్రోత్సాహించారు. ‘ఎంత హాయి ఈ రేయి , ఎంత మధురమీ హాయి’! అని పదాలు అటూ ఇటూ చేసి ఆయన గారడీ చేస్తే  పాట మళ్ళీ విన్న పట్ట పగలు కూడా వెన్నెల రేయిలా చలి పుట్టించింది.

ఇప్పుడంటే ‘తొలి రేయి’ సన్నివేశానికి సెన్సారువాళ్ళు బొత్తిగా అంగీకరించరు. ఆ రోజుల్లో ప్రతి పదో సినిమాలో పెళ్లి, తరువాత తొలి రేయి అనే సంప్రదాయం చూపించ వలసి వస్తే హద్దులు పాటించేవారు. కనుక అవి సంసార పక్షంగానూ, సెన్సార పక్షంగానూ ఉండి మొండి కత్తెరకి బలి కాక వెండితెర మీద వెలిగేవి.  దూరంగా వెన్నెల చంద్రుడు, గదిలో అగరు వత్తులు, అమ్మడు చేతిలో (తాంబూలం) చిలకలు, మల్లె పందిరి మంచం ---అమ్మడు మొహాన కాసిన్ని సిగ్గులు, అబ్బాయి గారివి కొంటె చూపులు! చక్కటి పదాలతో (విడి విడి పెదాలతో) పాట. అయ్యయ్యో ఇంత వెనకబాటుతనమా అని ఇప్పటి యువతరం నొచ్చుకునేలా, అప్పటి యువ తరం మెచ్చుకునేలా ఆ ‘తొలిరేయి’ సన్నివేశం ఉండేది.

ఈ రేయి తీయనిది ....ఈ హాయి మాయనిది; హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి, ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి, తెల్లవారనీకు ఈ రేయినీ తీరిపోనీకు ఈ తీయనీ హాయినీ – వంటి యుగళ గీతాలు ఆ కోవకి చెందినవే,

శారద, జీవితం వంటి సినిమాలే  బహుశా తొలిరేయి సన్నివేశాలకి ఆఖరి సినిమాలు.

సాగరసంగమం డ్యూయెట్టే బహుశా ‘రేయి’ పదానికి చరమ గీతం పాడించి ఊరుకుంది

పాత పాటల్లో అలాగని రేయి-హాయి ప్రాస మైత్రి  వీటికే పరిమితం చేయలేదు.

నెల నడిమి వెన్నెల హాయి అలవడదు అమాస రేయి (జిక్కి గారి పాట)

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే- ఇది మైమరపించే హాయి, ఇక రానే రాదీ రేయి (మర్మయోగి - ఆరుద్ర),

మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడెనేలనో (తోబుట్టువులు – అనిసెట్టి)

మధుర మధురమీ చల్లని రేయి – మరువ తగనిది ఈ హాయి  (విప్రనారాయణ – సముద్రాల)

నేడే హాయి హాయి ఆనందం చిందే రేయి (సతీ సుకన్య –సముద్రాల)

పున్నమి రేయి-పాల వెన్నెలలో హాయి (జీవన డోలీ – రక్ష రేఖ – సముద్రాల?)

ఈనాటి రేయి జాబిల్లి హాయి (కుంకుమ రేఖ - ??)

ఎంత హాయి ఈ రేయి నిండెనో (మల్లీశ్వరి – దేవులపల్లి)

ఆమని రేయి మాయని హాయి (తారా రేరాజు సరగ మాడ –శ్రీ గౌరీ మహాత్మ్యం- మల్లాది)

ఈ రేయి నీవై నీ హాయి నేనై (ఓహో రాణి – దొంగల్లో దొర – మల్లాది)

వెలిగే రేయి వెన్నెల హాయి మనదని తేలెనులే (ఓహో వరాల రాణీ – ఇంటిగుట్టు – మల్లాది)

ఏమనెనోయి  ఆమని రేయి –ఎవ్వరికోయి తీయని హాయి (దొంగలున్నారు జాగ్రత్త – ఆత్రేయ – సంగీత దర్శకుడిగా మహదేవన్ గారి తొలి తెలుగు చిత్రం) - ఇవన్నీ చాలవూ నిరూపణకి?

పిడుగు పాటు:

నాన్ సెన్స్ – రేయి ఏమిటీ తప్పు తప్పు పాత మాట.. నైట్ అనాలి, తొలిరేయి ఏమిటీ తప్పు తప్పు... ఫస్ట్ నైట్ అనాలి, ఏమిటో అంతా అనాగరికం! అని గర్విష్ (వాడికా పేరు ఎలా వచ్చిందో వాడికే తెలియదు) పాతాళభైరవి లో రాజు మరిది లాగ రంకెలు వేస్తుండడంతో అసలుకే ఎసరు అయ్యింది.   ఐటం సాంగుల పుణ్యమా అని వేరే ఎడ్యుకేషన్ అవసరం లేకుండా పోయింది.  ఐటం అనడం కూడా పాత మాటట. ఐ‘టమ్మీ’ సాంగులట, ఓ గ్రంధ ‘సాంగుడు’ చెప్పాడు.

ప్రాస మెరుపు:

 1: హిందీలో ‘జిందగీ’ అనే పదానికి సదా  ప్రాస మైత్రి రూపంలో వచ్చే పదం ‘బందగీ’!

యే మేరా ప్రేమ పత్ర్ర్ పడ్ కర్ ...అనే పాటలో తుమ్ మేరె జిందగీ హో ...తుం మేరె బందగీ హో  అని ప్రకటించింది సంగం సినిమా ప్రేమ లేఖ.  ఇదే పాట తెలుగులో ప్రాస మైత్రి పరంగా కాక ప్రాసానుబంధంగా వచ్చింది (ఇదే నా మొదటి ప్రేమలేఖ -  రాశాను బదులు చెప్పలేక – తెలుపుటకు భాష చేతకాక).

 ప్యార్ జిందగీ హై ..ప్యార్ బందగీ హై – అన్నారు ముకద్దర్ కా సికందర్ ప్రేమికులు.

జిందగీ ని ‘గందగీ’ తో జత చెయ్యొచ్చుగా? అని కొంటెగా అడిగితే ఎవరైనా...ఏమో చెప్పలేం ఆ రోజులు అట్టే దూరంలో లేవు.  హిందీ పాటకి  అంత చెత్త నెత్తినెక్కించుకుని  మోయాల్సిన అవసరం ఇంకా రాలేదు.

హిందీలో మరో ప్రాసమైత్రి – సప్నా,అప్నా. అలాంటిదే – ఛోడ్, తోడ్!  మరొకటి- దేఖా, రేఖా! కొన్ని పదుల సంఖ్యలో  పాటలు  వచ్చి ఉంటాయి ఈ జంట ప్రాస పదాలతో.

2. ఇవాళే కాదు తరతరాలుగా ‘అడ్వర్ టైజ్ మెంట్స్’ లో ప్రాసలే రాజ్యమేలాయి, యేలుతున్నాయి.

ఒకప్పుడు వచ్చేది ‘మామూలు కాఫీలపై విప్లవం జరపండి – రికరీ స్పెషల్ ఇన్స్టంట్ నే వాడండి’ అని. ఆ తరువాత ఆ రికరీ తిరిగి రికవర్ కాలేనంత దెబ్బ తిందా? ఏమో? అయిపూ తుయిపూ లేకుండా పోయింది.

అంటోంది సినీ నటి మాలిని... ప్రతి ఒక్కరు తమ వొంటిని ముక్సు సబ్బుతోనే తోమాలని..

మీకు జలుబూ పడిశమా?  అయితే ఎందుకు శ్రమ – బామేక్సు వారి కోల్డారి వాడండి ...జలుబు వైరస్ కి గాయం ..మీ జలుబు మటుమాయం.

ఫలహారపు కావిళ్ళా? తొలిరేయి పానుపా ? అమ్మాయికి వేవిళ్ళా? తొలి కానుపా? -  అన్నిటికి ఉంటుంది  మా సహకారం, మీ వెన్నంటే ఉంటుంది ‘నమస్కారం’ ( సంస్థ పేరన్నమాట)!

ఇలా ఉండవచ్చు ముందు ముందు అడ్వర్టైజ్ ‘మెంతులు’, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి గ్యాస్ పోగెట్టే తంతులు.

3. ‘మీరు పెట్టిన బొబ్బట్లు బావున్నాయి కాని కొట్టిన చప్పట్లు బావు లేవు’ అని నేనొక సారి అతి ప్రాసాయుధాన్ని  విసిరాను సంగీత విభావరిలో కంపీ'రింగు మాస్టారు'లా. ‘అట్లనా?’ అని ఎవడో బదులిచ్చి అరిచినట్టు జ్ఞాపకం.

‘మీకు దోసలా?అట్లా? వాళ్ళంతా అట్లు తెమ్మన్నారు’ అని ఒకాయన శ్రీశ్రీ గారిని అడిగితే శ్రీశ్రీ గారి ఛలోక్తి –‘అట్లే కానిండు’.

‘కరుణశ్రీ,ఉదయశ్రీ, విజయశ్రీ  అని ఇన్ని ఉన్నాయి కదా మరి మీరు కూడా శ్రీశ్రీ బదులు వేరే పేరు పెట్టుకుంటే అది  ఏం పేరు ఔతుంది? అని శ్రీశ్రీ  గారిని అడిగితే ఆయన తప్పకుండా ఇచ్చే సమాధానం: ‘ఉభయశ్రీ’!

ఆ రకంగా శ్రీశ్రీ గారికి ప్రాస వేయాలంటే శ్రీలే పొంగుతాయి. శ్రీశ్రీగారే తొలి తెలుగు డబ్బింగ్ రచయిత. ఆ తరువాత అంత బాగా డబ్బింగ్ చేయగలిగింది రాజశ్రీ.  నన్నడిగితే వీరి మీద ఇలా ఓ పల్లవి రాస్తాను- ‘డబ్బింగ్ కి పితామహులు కాదా మహాకవి శ్రీశ్రీ, ఆ కళ అబ్బింది నీకేకదా  మహానుభావా రాజశ్రీ’. 

అంతెందుకూ ....గ్లోబ్ ముందు మీరున్నా మీ ముందు గ్లోబ్ ఉన్నా ‘ప్రాస-క్యూషన్’ సముద్రాలు దాటిపోవడం మీరు గమనిస్తారు. ఎలా అంటే- ఇండియన్ ఓషన్ సంతోషంతో ఉప్పొంగిపోయి ‘ఎట్లా ఉన్నావ్ అట్లాంటికూ’ అని ప్రేమగా దగ్గరికొస్తే  ఆ అట్లాంటిక్ సాగరం ‘బాగానే ఉన్నా కానీ మరీ అట్లా అంటకు’ అంటుంది. అట్లాసు నవ్వేస్తుంది.

4. కొన్నేళ్ళ క్రితం ఇద్దరావిళ్ళ సినిమా ఒకటి వచ్చింది. ‘నా జీవితంలో పగలు రాధ, చీకటి రాధ’ అంటాడు హీరో రెండుతో. ఫ్లాష్ బాక్ మొదలౌతుంది వన్ తో. అక్కడ హీరో మరో ముక్క అనొచ్చు- ఎలా అంటే ‘ఇప్పుడా రాధ లేదనే నా బాధ!’ అని. అలాంటి డైలాగ్ కొడితే రెండు ఫ్లాష్ బాక్ వినదని డైరెక్టర్ ఎరిగిన వాడు కనుక అడిషనల్ డైలాగ్ వద్దనుకున్నాడేమో?

వెంకటేశ్వర మహాత్మ్యం  సినిమాలో శ్రీనివాసుడైన ఎన్టీఆర్ పద్మావతీ ఉద్యానవనం లోకి వచ్చినప్పుడు ‘అయ్యో ప్రమాదం’  అని ఆమె అంటుంది. అక్కడ ఆత్రేయ వారి ప్రాసక్రీడని ఇలా ఉసిగొల్పారు- ‘ప్రమాదం కాదు...ప్రమోదం’!

5.  తెలుగు కవి ‘తారలెంత చక్కగా అమరాయో నింగిలో – ఈ వెండి దారాల మధ్య మల్లెలూ అంతే ముంగిలిలో’ అనిగానీ ఎడాపెడా ఓ పాట గిలికితే , దాన్ని కాస్త ఏ హిందీ గాయకుడో పాడితే అది కాస్త ‘తారాలేంత చక్కాగా అమ్రాయో నీంగిలో- ఈ వేండిదారాల మాధ్య మాల్లెలూ ఆంతే ముంగీలీలో’ అనే ధోరణిలో వినిపించి ప్రతి రేయి హాయిగా తెగ కితకితలు పెట్టి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది.  తారాలు,దారాలు –భలే ప్రాస మైత్రి కదూ అని తెలియనివాళ్ళు తమకే అంతా తెల్సినట్టు తెగ మురిసిపోతారు.

కొత్త తెలుగుపాటలో ప్రాసలు గుప్పిస్తూ  ‘గడప దాటితే  మా ఇంటాయన హిట్లరు, పిదప ఆయనే వంటాయన,బట్లరు’-అని రాస్తే ఎంత హిట్టో (పాట వినిపిస్తే చాలు దోమలు ఫట్). 

‘లవ్ చేస్తా లవ్ చేస్తా – ఒప్పుకుంటే కిచెన్లో పులావ్ చేస్తా – చేసి నిన్ను లావ్ (లావు) చేస్తా ...ఏయ్ ఆ( ఊ( ..’అనే మూలుగులతో పాట వచ్చినా, ‘ఈ గదిలో ఈగనై బ్రెడ్ మీద వాలుతా, అదో మరి ఆ గదిలో దోమనై బ్లడ్ బాగ లాగుతా’ లాంటి పాటల సంఖ్య హెచ్చినా  ‘ఎంజాయ్’ చేసిది నవ యువత కాదు ‘మా లాస్ట్ నవ యవ్వనం వెన్నెల వేస్టయిన వనం’ అని ప్రాసరికపు బాధతో అలమటించే పాత తరమే. అందుకే అడ్డదిడ్డమైన పాటలు ‘హాయిగా’ చెలామణి అయిపోగలుగు తున్నాయి, ఎందుకంటే కాస్తో కూస్తో తెలుగు తెలిసినది పాత తరమే కాబట్టి.

-డా. తాతిరాజు వేణుగోపాల్,  12 మే 2013
3 Comments
sunday desk
20/6/2013 05:41:13 am

sirm mee peradeelu Andhra Jyothi sunday book lo reprint chesukodaniki anumathi ivvandi.
- sunday incharge A J

Reply
Tatiraju Venugopal
20/6/2013 08:21:21 am

daandemundandandee....vesukondi...'peru' nilabettandi chaalu..

Reply
నాగభూషణం పరికె
7/7/2020 11:52:11 pm

నమస్కారం గురువు గారు..తెలుగు సాహిత్యం మీద అవగాహన లేనటువంటి నాబోటి వారకిది దివ్యమైన ఔషధం మీ ఈ చక్కని రచన ద్వారా సాహిత్యం మీద పట్టు సాధించటమే కాకా పాటలు పద్యాలు వ్రయవచ్చును. మీకు ధన్యవాదాలు వేల వేల వందనాలు.

Reply



Leave a Reply.

    RSS Feed

    Quick Links

    పాటల కొలువు
    • కనులు చూసినా పాటే (Video)
    • కనులు మూసినా పాటే (Audio)
    • కనులు చదివినా పాటే('Read'io)

    అచ్చం అవే 'అచ్చు'లు 
    • తిరుగులేని మాట
    • పాట = తిరుగు టపా

    చిరునవ్వులోని హాయి 
    • బాపురే రమణీయం
    • అచ్చోసిన సొంత కితకితలు
    • అచ్చుకాని సొంత పకపకలు
    • చిత్ర 're' చిత్ర హాస్యం (Video)

    ఆహా ... ఆహహా
    • ప్రతి రాతా ప్రసిద్ధమే
    • ప్రతి ముఖమూ ప్రముఖమే

    Archives

    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013
    March 2013
    February 2013
    January 2013
    December 2012
    November 2012
    October 2012
    September 2012
    August 2012
    July 2012
    June 2012
    May 2012
    April 2012
    March 2012
    February 2012
    January 2012
    December 2011
    November 2011
    October 2011
    September 2011
    August 2011
    July 2011
    June 2011
    May 2011
    April 2011
    March 2011
    February 2011

    Categories

    All
    100 Years Of Film
    11/12/13 Special
    Aadapilla - Aarudra
    Aarudra
    Aatre Aatreya
    Aatreya
    Aatreya Pingali
    Achala Sachdev
    Adi Shankaracharya
    Aluka
    Amitabh
    Andaniki Andam
    Annayya Smruti
    Anr
    Ashwaththama
    Avasarala
    Bapu
    Best Scenes
    Bhanumathi
    Bhisma
    Bhupen Hazarika
    B. Rajanikanta Rao
    C. Narayana Reddy
    Crorepati Aarudra
    C.S.R. Anjaneyulu
    C.V. Raman
    Dasarathi
    Dashavataralu
    Daytime Moonlight
    Dev Anand
    Devulapalli Krishnasastri
    Donga Dochukonuta
    Dusshera
    Earth Book
    Eela
    Festivals
    Film Titles
    Friendship Day
    Gandhi
    Ganesh Chaturthi
    Ghantasala
    Gurajaada - G.K. Venkatesh
    Hanuman Jayanti
    Hindola Uyyala
    Hoyalu
    Hummings
    Independence Day
    Ishtakashtaalu
    Jagjit Singh
    Jalakaalaatalu
    Janmashtami
    Japan Tsunami
    Kedarnath
    Kevvu Keka
    Kodandapani
    Kosaraju
    Krishna Sastry
    K. Vishwanath
    K.V. Mahadevan
    Lakshmi Devi
    Lata Mangeshkar
    Malladi
    Man
    Manna Dey
    Mattu Mandu
    Mehedi Hassan
    M.F. Husain
    Moonlight
    Mullapodi
    Nagayya
    Nataraja Rama Krishna
    November 1st
    N. Rama Mohana Rao
    N.R. Chandoor
    N.T.R.
    Nukala
    Nutan Prasad
    Palagummi
    Pataudi
    P.B. Srinivas
    Pran
    P. Suseela
    Raagam Anuragam
    Rajasulochana
    Ramana
    Rare Singers
    Rare Writers
    R. Balasaraswati Devi
    Reyi Hayi
    Saakee
    Salim - Jaladi
    Samudrala
    Samudrala Junior
    Sankranti
    Sarasvati
    Sare Le Ade Le
    Sathya Sai Baba
    Savitri
    Shivaji Maharaj
    Shri Krishna
    Shrinivas Khale
    S. Janaki
    S.P. Balu - Raja
    S. Rajeswara Rao
    Sri Ramanavami
    Sri Sri
    Suman Etv
    Susarla
    S.V. Rangarao
    Taapi Dharma Rao
    Tanivi
    Telugu
    Telugu Idhi
    Telugu Lipi Bhasha
    Train Travel
    Ugadi
    Ugadi 2013
    Vaali
    Vani Jairam
    Veyi Kanulu
    V. Madhusudana Rao

Powered by Create your own unique website with customizable templates.
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post