కృష్ణ ప్రేమ
Menu

మునుపటి నా మాట

కెవ్వు....కేక.....

27/7/2013

0 Comments

 
Picture
లో:‘విశ్వం గారూ...విశ్వం గారూ... నేనేనండీ...నన్ను చూసి కెవ్వు మని అరుస్తారేమో అని భయ పడుతూనే ఉన్నా. అలా నోరెళ్ళబెట్టకండీ. ఆషాఢ మాసం...ఈగల కాలం.  హమ్మా..పాడు దోమ..పగలు కుడుతోంది... ఈమధ్య ఇదో భయం. దోమల టైం టేబిలు కూడా తెలుసుకోవాలి...ఏది కుడితే ఏమొస్తుందో  తెలియదు. అహ(.. మీ ఇంట్లోనే ఉన్నాయని దెప్పుతున్నానని అనుకోకండి..భలేవారే.. ఏ ఇంట చూసినా ఇదే తంతు.

అవునండీ.. వార్కరీలు, జ్ఞానేశ్వర్ పాదుకలు, తుకారం పాదుకలు, పండరీపుర యాత్ర... ఆహాహా... ఎంత క్రమ శిక్షణ .... ఎంత నిబద్ధత... ఎంత గొప్ప ఆపన్న హస్తాల ఉచిత సేవ .....మహారాష్ట్రలోఆషాఢ ప్రారంభంలో పుణే పరిసరాల్లో కనువిందు కదండీ ఈ విష్ణు దర్శన దృశ్యం!

అలాగే ఇదే ఆషాడ మాసం రెండో తిథిని ఒడిశాలో పూరీ క్షేత్రంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ..అంతే కనువిందు కదండీ. విప్లవ కవి అయినా శ్రీశ్రీ గారిలోనూ కొన్ని సంప్రదాయ పోకడలు లేక పోలేదు... వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్ ...రథ చక్రాల్ అంటూ ఓహోహో...ఆ రోజుల్లో ఆయన వినిపించిన ఆ సుదీర్ఘ  గేయం అందరికీ కంఠోపాఠం కదండీ. ..

నా ఈ డ్రెస్ ఏమిటా అని విస్తు పోకండి. వానాకాలం కదా అనీ బెర్ముడాల్లోకి దిగా. ముదురు చర్మాలు కదా కుట్టినా దోమలు చచ్చి ఊరుకుంటాయి లెండి. విషయానికొస్తే...’

వి: ‘అయ్యా ... లోకనాథం గారూ... నోరెళ్ళబెట్టకండి అంటూనే...నిజంగా నా నోరు తెరవనివ్వక ఎడతెరిపి లేని వాన లాగ నాన్ స్టాప్ గా లెక్చరు దంచారు.  మీ కవి హృదయం గ్రహించాను లెండి. చల్లకొచ్చి ముంత దాచేశారు. కెవ్వు కేక గురించి నన్నే శోధించమన్నారు గుర్తుందా?  మీరు వెళ్ళిన మర్నాటికే సిద్ధం చేశా. ఈలోగా తెలిసింది ఆ పేరుతో ఏకంగా ఒక సినిమా కూడా తీసి మొన్నీ మధ్యే విడుదల చేశారనీ. ఈ మధ్యలో మీరు అయిపూ తుయిపూ లేరాయె. కొంపదీసి తీర్థ యాత్రలంటూ చార్ ధామ్ కి వెళ్ళలేదు కదా అని అనుకున్నాను. మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆ వైపు పోలేదనే అర్థం కదా.’

లో:‘శివుడి దయ అంతానూ...ఎవరికెపుడు ఏ కేకలు ప్రాప్తమో అంతా ఆ గంగాధరుడికే ఎరుక!’

వి:‘అంటే.. భగీరథుడు- అయ్యా శివయ్యా గంగను భరించే బాధ్యత నీదేనయ్యా- అని కోరినప్పుడు శివుడు ఆయన మీద కేకలు వేసే ఉంటాడా? అప్పుడు నిజంగానే శివతాండవం చేసే ఉంటాడా?’

లో:‘అవెందుకు లెండి...విశ్వం గారూ.. వానాకాలంలో బెర్ముడా వేసుకొచ్చి మీకెదురైతే మీ రియాక్షన్ ఎలా ఉంటుందా అని, అది మీ నోటి నుంచి ‘కెవ్వు’ అనే అరపు ధ్వనిగా మారుతుందని సోదాహరణగా మనవడికి చెప్పాలనుకుంటే... వాడా టాబ్లెట్ ఒదిలి రాడాయే.  తాతా...ఈ టాబ్లెట్ చూడు...అంటే నువ్వెప్పుడు డాక్టరు దగ్గరికి వెళ్ళావ్ రా అని అమయాకంగా అడిగా.  వాడు పొర్లి పొర్లి నవ్వి దగ్గు తెచ్చుకున్నాడు. ఆ దెబ్బతో నేను టాబ్లెట్ తినవలసి వచ్చింది, కంగారులో బీపీ పెరిగి. వాడే.....ఫ్రీ సైజు బెర్ముడా తీసుకో అంటూ ఆదివారం సంతలో ఇదిగో ఈ వింత భంగిమ నిచ్చేలాంటి బెర్ముడా  కొని పెట్టించింది.’

వి: ‘ఇంతకీ లోకనాథం గారూ...కెవ్వు మనడానికి ఇదేమైనా దెయ్యమా?భూతమా? బెర్ముడా కదండీ. మీకు తెలుసా- బెర్ముడా ట్రయాంగిల్ గురించి....ఆ కూడలిలో ఏదో  ఆకర్షణ శక్తి విమానాల్ని లాక్కుంటుంది. ఇదిగో.. అలాంటి దృశ్యాలు చూస్తే ఎవ్వరైనా కెవ్వుమనాల్సిందే.  మనవడు రాలేదు కాబట్టి- ఇక్కడి నుంచి కేకేయండి. కేకు కాదండీ.. కేక. ఇక్కడి నుంచి అంటే బిగ్గరగా కేక పెడతారేమో... సెల్లు నుంచండీ.’

లో: ‘ఏం సెల్లో ...తాతా రింగ్ టోన్ మార్చనా? అంటూ సతాయిస్తున్నాడు. ఇందాక అన్నారే మీరు...కెవ్వు కేక సినిమా అనీ... అది మొన్న  జూలై 19 న రిలీజయ్యిందట. అందులోని పాట పెట్టుకో అంటాడు...దేవదాసుకి డూప్లికేట్ నేను పార్వతి పరంపర నేను అని ఏదో ఉంది లెండి. ఆ సినిమా అదీ ఎపుడోస్తే నాకేం? నా వైఫు నా వైఫు చూసి రామయ్యా వస్తావయ్యా ...సినిమాకి మీరొస్తారా రారా అని అడిగినట్టే అడిగి మనవడి సాయంతో చూసొచ్చేసింది . అదేదో తెలుగు సినిమా అనుకున్నాను. కాదుట..హిందీట. ... అదీ ఆ రోజే వచ్చిందిలెండి. నాకెందుకో ఆరోజు ఆషాఢ ఏకాదశి కదా హాయిగా మహావిష్ణువు  శేషతల్పం మీద పడుకున్నట్టు భంగిమ పెట్టి  టీవీ చూడడమే  మేలని పించింది.’

వి: ‘అంతేనా? ఆషాఢ ఏకాదశి నాడు ఉపవాసం అదీ ఉన్నా అని చెబుతారనుకున్నా’

లో: ‘అయ్యా..ఉన్నమాట చెప్పనా? మీతో సహవాసం ....ఇంకెక్కడిదీ ఉపవాసం?’

వి: ‘గురు పూర్ణిమ నాడు మీరు వస్తారేమో అని ఎదురు చూశాను..పేపర్లో పరిపూర్ణానంద స్వాములు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గురువు అని చెబుతూ కలియుగానికి గురువు ఆదిశంకరులు అని చక్కగా వివరించారు. ఇలా ఏదైనా మనసుకి నచ్చినట్టు చెప్పడాన్నే కేక అంటారేమో! ఒకటి చెప్పండి- కేకలు ఎన్ని రకాలు?’

లో: ‘ఎన్ని రకాలూ అంటే....ఆ(.... ఒకటి గావుకేక ...మరొకటి......వెంటనే గుర్తుకు రాదేమిటబ్బా?’

వి: ‘పొలికేక?’

లో: ‘ఆ( ...ఇవి తప్ప ఇతరం ఏవీ లేవనుకుంటానండీ విశ్వంగారూ’

వి: ‘లోకనాథంగారూ.....నా దగ్గరో నిఘంటువు ఉందండీ... అయితే అది విద్యార్థుల కొరకు...’

లో: ‘అంటే..మనలాంటి వయసు వాళ్లకి కాదన్నమాట ..అయితే ఇంకెందుకు చూడటం?’

వి: ‘ఇరవై ఏళ్ళ టీచింగ్ సర్వీస్ ఉన్నవాళ్ళూ ఒక్కోసారి అనుమానం వచ్చి బేసిక్స్ తిరగెయ్యరూ..? అలా అవసరం ఒస్తే తప్పక నిఘంటువులకి అంటుకు పోవాల్సిందే. అసలు కేక అంటే అర్థం పిలుపా? అరుపా?’

లో: ‘పిలుపైనా  కావొచ్చు....అరుపైనా కావొచ్చు’

వి: ‘మరీ గోడ మీద పిల్లిలా మీరు ....ఏదో ఒకటి చెప్పండీ..’

లో: ‘సరే...పిలుపు..’

వి: ‘కాదు... అరుపు .. కేక అనగా అరపు అని వి.కొ నిఘంటువు చెబుతోంది’

లో: ‘వి.కొ ఏమిటండీ.. వజ్రదంతిలా ....ఓహో...విద్యార్థుల కొరకు ...దాని హ్రస్వ రూపమా?’

వి: ‘అయితే ఈ వి.కొ. నిఘంటువులో గావుకేక అనే మాటే లేదు. ఏమో అది చూసి విద్యార్థులు నిజంగానే గావుకేక పెట్టాలనేది వారి ఉద్దేశ్యమేమో. గావుపట్టు  అంటే గట్టి పట్టు అని మాత్రం అర్థమిచ్చారు. అంటే- గావు కేక అనగానే గట్టి కేక అనే చెప్పాలి.’

లో: ‘మొన్న మొన్నటి సంఘటన గుర్తొస్తోంది... బీహారులో ఆ గ్రామంలో ఎంత దారుణం! పురుగుల మందున్న పాత్ర వాడి పెద్ద ఉపద్రవమే తీసుకొచ్చారు కదండీ. ఇరవైఏడు  మందిలాగా పిల్లలు ఆనాటి  మధ్యాహ్న భోజనం తిని పాపం చనిపోయారు. వారందరి ఆత్మఘోష ఒక గావు కేక! పారిపోయిన ఆ హెడ్ మిస్ట్రెస్ దొరకాలి గాక!’

వి: ‘దొరికింది లెండి. ఈ అమ్మగారి  పేరు మీనాదేవి. ఇంకో అమ్మడు మీనమ్మ బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం ఎక్కి ఏకంగా పైలెట్లకి హాయ్ చెప్పి అక్కడే తిష్ట వేసినందుకు వాళ్ళు సస్పెండ్ అయ్యారు..’

లో: ‘పూర్వం ఏమిట్రా మీన మేషాలు లెక్క పెడుతున్నావ్ అని అనేవారు. ఇప్పుడు తరం మారింది కనుక ‘మీన వేషాలు’ లెక్క కొస్తున్నాయ్. ఇద్దరూ మీనమ్మలే కావడం విశేషం.’ 

వి: ‘ఈ మీనమ్మ విమానం తోలిందని అనుమానమట. బహుశా అప్పుడు విమానంలో బెంగ పెట్టుకున్న బెంగళూరు  ప్రయాణీకులు పెట్టిన కేకని పొలికేక అంటారేమో. .పొలిమేర నుంచి బాగా పైకి పోతున్నారాయే!’

లో: ‘పొలికేక అంటే ...మీ దగ్గరున్న ఆ వి. కొ నిఘంటువు వారు ఏమని అర్థమిచ్చారో?’

వి: ‘పెద్ద కేక ...అని’

లో: ‘ఓహో.... గావు మీన్స్ స్ట్రాంగ్, పొలి మీన్స్  బిగ్..అన్నమాట. ఇంతకీ కెవ్వు అంటే ఏమని ఇచ్చారూ అందులో?’

వి: ‘అరచుట యందలి ధ్వనికి అనుకరణము’

లో: ‘నేనే నయం అరపు ధ్వని అని అన్నాను. రెండు ముక్కల మాటకి అన్ని ముక్కలతో ముక్కాబులా నా?’

వి: ‘పిల్లి అనగా మార్జాలము .....అని కదా నిఘంటువుల మీద ఉండే విసురు. అసలు కేక అంటే తెలుసునాండీ? నెమలి కూత!’

లో: ‘మబ్బుకీ నెమలికి కుదిరినట్టే.. ఈ వానాకాలంలో ఈ కేకలు బాగానే ఉన్నాయి. కెవ్వుకేక సినిమా తీసిన వాళ్లకి ఈ సంగతి తెలియదు. తెలిస్తే ...సినిమాలో  పాట ఒకటి  పెట్టి హిట్ కొట్టేవారేమో?’

వి: ‘హిట్టూ గిట్టూ అనకండి ...దోమల మీద చల్లే మందే అయినా ఈ మధ్య జరిగిన ఉదంతాలతో కంపరం పుట్టిస్తోంది. అదలా ఉంచితే... అసలు కేక అంటే నెమలి కూత అని ఎందుకైందంటే కేకి అంటే నెమలి కనుక..’

లో: ‘కాకి,కేకి,కోకి ...ఏమిటో ఈ క-భాష? అన్నీ గొంతు సవరించి కూసేవే..’

వి: ‘ఏమన్నారూ ..గొంతు సవరించా? కేకరించు ...అంటే తెలుసా?’

లో: ‘కేక వెయ్యడమేమో?’

వి: ‘కరెక్టే ..కాని గొంతు సరి చేసుకునేటట్లు శబ్దం చేస్తాం చూడండీ.. దాన్నే కేకరించు.. అంటారు’

లో: ‘కొంతమంది పిలవరు.. అంటే కేకెయ్యరు. కేకరిస్తారు లేదా చప్పట్లు చరుస్తారు..’

వి: ‘పిలిచే శబ్దం కన్నా ఇది మరీనూ.. సౌండ్ పొల్యూషన్ ..చప్పట్లు అన్నారు చూడండీ...కేకిసలు అంటే చప్పట్లు’

లో: ‘ఇప్పుడర్ధమైంది.. పిల్లలు బర్త్ డే నాడు కేకు కోస్తారు, కేకిసలు కొడతారు, ఆనక కేకలు పెడతారు. ఎవరైనా పాడమంటే కేకరిస్తారు. ఏమిటో... అంతటా  పిచ్చి క-భాషే.’

వి: ‘తప్పండీ.. పిచ్చిక భాష అనండీ..ఆ చిన్న ప్రాణి కేక లోనూ మాధుర్యముంది.’

లో: ‘చూడబోతే ..పిచ్చికలూ మీకు మచ్చికైనట్టున్నాయి’

వి: ‘గుర్తు చేశారు... కెవ్వుకేక గొడవలో పడి వాటికి ఇన్ని గింజలు రాల్చలేకపోయాను. పాపం ఎదురు చూస్తుంటాయి...అసలేవీ? చినుకుల్లో పాపం ఎక్కడ తలదాచుకున్నాయో?’

లో: ‘మీ భూత దయ ..కెవ్వుకేక.. ఏవో కాయితాలు తెస్తున్నారు.. పాటలేనా అవి?’

వి: ‘అదే కదా వ్యాపకం... వీటిలో కొన్నే నాకు జ్ఞాపకం. మన సినిమా పాటలు గాలిస్తే అయిదు వేళ్ళకి సరిపోయినంత కూడా కెవ్వు గానీ కేక గానీ ఉన్న పాటలు లేవని తెలిసిపోయింది. పూర్వం పాటల్లో ‘కేక’లుండేవి కావండీ. ఇద్గో ...వేటూరి సుందరరామ మూర్తి గారు ఎందరో మరిచిపోయిన చంద్రమోహన్ సినిమా సువర్ణ సుందరి లో ‘పొలికేక’ పెట్టారు. పొలిమేర దాటాను భావాలలో పొలికేక నైనాను రాగాలలో ...అని ఆయన తప్ప ఎవరనగలరు? తరువాత  సిరివెన్నెల శాస్త్రిగారొచ్చి రెండు కేకలు వేశారు. అదేనండీ.. ఆయన రెండు గీతాల్లో ‘కేక’ను ప్రయోగించారు.  ఒకటి – సిరివెన్నెల సినిమాలోని ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు  పాటలో ఉప్పొంగే గుండెల కేక ... ఈ రోజుల్లో ఇదిగానీ పిల్లలు వింటే ఈ మెయిల్ లోని ‘ఇంగ్లీష్ ఈ’  లాంటి దనుకునీ ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు ...అన్నీ నెట్ భాగోతం అని అనగలరు. ముఖ్యంగా  మీ టాబ్లెట్ మనవడితో జాగర్తండోయ్ లోకనాథం గారూ.’

లో: ‘ఈ పాట సరే...మా ఊళ్ళో ఉన్నట్టుంది’

వి: ‘మాఊళ్ళో ....అని అన్నారూ... దాంతోనూ పనుంది.  సీతారాముల వారి రెండో కేక పాట ఏమిటో చెప్పనా? ఆయన పేరు ధన్యమయ్యేలాంటి  సినిమా- అదేనండీ... శ్రీ ఆంజనేయం!  ఏ యోగమనుకోను నీతో వియోగం ....అనేది ఒక పాట పల్లవి. అందులో ‘వెర్రికేక’ అని ఒక చోట అంటారీయన.  పాట చిత్రీకరణలో అబ్బా...రాయి కేసి తల బాదుకోవడం ఉందండీ... జుగుప్సగా అనిపించింది.  అందుకే మీరూ పాట వినండి చాలు. ఇంకో సంగతి చెప్పాలి- యూ ట్యూబులో ఉన్న ఈ పాటలో ‘వెర్రికేక’ అనే మాట ఉన్న చరణం లేనే లేదు. ఆడియోలోనే  ఉంది. కాబట్టి – ఏ యోగమనుకోను  ఈ ‘ఆడియో’గం .....అనుకోవాలి.  ఒకనాటి హాసం లో మ్యూజికాలమిస్టు రాజా వారు ఈ సినిమాని ఎంత చక్కగా ఓహో ఆహా అని పొగిడారో చూడాలనిపిస్తే ‘తిరుగు లేని మాట’ లవి ఇదిగో  చదవండి.’

లో: ‘కేకలు ఇంకా ఉండే ఉంటాయండీ... ఇంతేనా? మావి మరచిపోయారా విశ్వం గారూ అని తతిమ్మా కవులు దండెత్తివస్తే....’

వి: ‘కెవ్వు మనాల్సిందే. ఇక ‘కెవ్వు’ సంగతి కొస్తే ఎప్పుడో మన కొసరాజు గారు రాసిన ఒకే ఒక్క పాటే కనిపిస్తోంది. మాఊళ్ళో ఒక పడుచుంది – దయ్యమంటే భయమన్నది...ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందమ్మో’

లో: ‘ఏదేదీ..  అయితే మీ చేతుల్లో నాలుగు పాటలూ అక్షర సాక్షిగా ఉన్నాయన్నమాట!’

వి: ‘కనులు చదివినా పాటే- అనుకుంటే ఆ నాలుగు పాటలే చూపిస్తాను. కనులు మూసినా పాటే- అనుకుంటే నాలుగింటికి  మరో కొత్త పాట...ఏదీ... కెవ్వు + కేక = కెవ్వుకేక పాట కూడా చేర్చి వినిపించగలను.’

లో:‘ఆహాహా... ఘంటసాల,పిఠాపురం వారి కాంబినేషన్ లో ఆ ట్విస్ట్  పాట...ఆ కాలం నాటి కెవ్వుకేక అండీ.   అవేకళ్ళు సినిమా ..బాగా గుర్తుంది. ఈ కాలం నాటి కెవ్వుకేక పాట చిత్రంగా ఉందే. అది ట్విస్టో బెస్టో తెలియడం లేదు.’

వి: ‘అదా? సినిమా పేరు తెలిస్తే కెవ్వు మంటారు. గబ్బర్ సింగ్ అండీ. గబ్బర్ సింగా  మజాకా? పాట నచ్చలేదు అన్నారంటే ‘కిత్నే ఆద్మీ థె ?’ అని  పేల్చేయ్యగలడు. నచ్చిందని ఒప్పేసుకుందురూ.  మీకు తెలుసా?... ఈ కెవ్వుకేక పాటలో  కోతలు పడ్డాయి. కొన్ని చరణాలు మరీ ఎబ్బెట్టుగా ఉంటాయి. ’

లో: ‘ఇవాళ్టి పాటలన్నీ ఎబ్బెట్టుగానే ఉంటాయి కాని ఏదైనా బొబ్బట్టు లాగ  ఉంటుందిటండీ?’

వి: ‘ఇదిగో ...ఏమ్వోయ్....మన లోకనాథం గారికి ఆకలి వేస్తోందట. అయ్యా...బొబ్బట్టు  లేదు...ఓన్లీ దిబ్బరొట్టె.... ఆరగించాల్సిందే. ఈలోగా మన కబుర్లేలాగూ ఉంటాయి.... మీకు తెలుసో లేదో 60వ దక్షిణాది  ఫిలిం ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం మొన్ననే జరిగింది హైదరాబాదు హయ్ టెక్కులో. గబ్బర్ సింగ్ హీరో పవన్ బెస్ట్ ఏక్టరు. ఆ సినిమాకి మ్యూజిక్కిచ్చినాయన ఉన్నాడే... ఎవరదీ.. ఆ( ..దేవీశ్రీప్రసాదు..ఆయనేమో ఉత్తమ సంగీత దర్శకుడు.. ఇంక ఆషాడ మాసం ఈగలు అంటూ కేకలేశారే ...ఆ ఈగ సినిమాకి అయిదు అవార్డులు వచ్చాయి. ఉత్తమ కథ, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – ఇన్నీ ఆ సినిమానే సొంతం చేసుకుంది.’

లో: ‘అరరే- మీరు నెట్ లో ఇవన్నీ చూసి తెలుసుకుంటారాయే ... మాదంతా టీవీ లోకం ... ఏదో ఒక చానెల్ లో ఏదో ఒక ఆదివారం తప్పకుండా  వస్తుందిగా... అప్పుడు చూస్తా లెండి. ఇంతకీ.. కెవ్వుకేక పాట ఈ దేవీశ్రీ మహానుభావుడి మస్తిష్క ప్రకంపనమా?’

వి: ‘అబ్బా...అంతంత  కామ్ప్లికేటడ్  మాటలు ఎందుకండీ... అర్ధం కాక కెవ్వు మంటారు. తెలియని వాళ్ళు ఏమిటా కేకలు అని అంటారు. బుర్ర తినేశారు మీరు.’

లో: ‘విశ్వం గారూ.... నాకసలే కంగారు....ఆ పాట సరే... అందులో మగ వాయిస్ ఎవరిదండీ?’

వి: ‘ఖుషీ మురళి అని అంటారు..పాపం ఈ భూమ్మీద అట్టే కాలం ఉండే అదృష్టం పొందలేదు.’

లో: ‘అరరే...ఓహో...ఇతనేనా?  కాకినాడ దగ్గరలో కచేరీకి బయల్దేరి .....ట్రైన్ దిగుతూనే హఠాత్తుగా గుండె పోటొచ్చి ....ప్చ్ ...వయసులో ఇంకా చిన్నవాడే పాపం’

వి: ‘అవునండీ..లోకనాథం గారూ...చిత్రం ఏమిటంటే....మన పూర్వ గాయకుడు ఎ ఎం రాజా గారు కూడా ఇలాగే కచేరీకి ట్రూప్ తో బయల్దేరి ....అప్పుడే కదుల్తున్న ట్రైన్ ని హడావుడిగా ఎక్కబోతూ అక్కడే జారిపోయి చనిపోయారు. పక్క కోచ్ లో భార్య ప్రముఖ గాయని జిక్కి ఉన్నారు. ఎంత విషాదకరం! ఇక్కడ ఈ మురళి తన కుమార్తె తో బయలుదేరారు. రాజా గారు ఎందుకు గుర్తొచ్చారంటే...ఆయన పాడిన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అన్నది ..ఏదీ ..మిస్సమ్మ సినిమా పాటని కొత్త నేపధ్యంతో ఈ మురళి పాడారు, ఖుషీ సినిమాలో. అప్పటి నుంచి ఆయన్ని ఖుషీ మురళి అని అనేవారు.’

లో: ‘అంటే—కొత్త గొంతులో పాత పాట అన్నమాట. ఏదీ వీలయితే వీరిద్దరి గొంతుకలూ ఒకేసారి వినాలనిపిస్తోంది... వినిపించరూ విశ్వం గారూ...’

వి: ‘తప్పకుండా. కొన్నిటికి అంతే, విధి వక్రిస్తుంది. కొందర్ని అంతే, విధి వెక్కిరిస్తుంది’

లో: ‘విధిది వింతాట. విధి చేయు వింతలన్నీ మతిలేని రాతలే- అని ఆత్రేయ గారు చెప్పకనే చెప్పారు.’

వి: ‘ఆ(....గుర్తు చేశారు లోకనాథం గారూ... విధి చేయు వింతలన్నీ ..పాట పాడిన గొప్ప గాయని పేరు తెలుసా మీకు?’

లో: ‘భలే వారే.. ఆవిడ గళం మహాద్భుతం. ఆవిడ పేరు వాణీ జయరాం. మెత్తని వాయిస్ పి.బి.శ్రీనివాస్ గారు ఆఖరి సారిగా వాణియమ్మ సన్మాన సభలో కనిపించారు. బహుభాషా కోవిదుడు కదా ఆయన...  ఆమె గాత్రం గురించి ఎంతో చక్కగా అభివర్ణిస్తూ తమిళంలో రాసి చదివి వినిపించారు.’

వి: ‘అబ్బో ....అయితే మీకు తెలియంది చెప్పనా? .... ఈమెకి ఇప్పుడే  ఫిలిం ఫేర్ వాళ్ళు జీవన సాఫల్య పురస్కారం అందించారు....అన్న సంగతి..’

లో: ‘ఔనా... గ్రేట్... ఆవిడని గ్రీట్ చెయ్యాలి.  ఓహో... చెల్లెమ్మ దిబ్బ రొట్టె తీసుకొస్తోంది. ముందు రొట్టె తిని తరువాత ఆవిడకి ఫోన్ చేద్దాం. నన్నన్నారే.. మీరు మాత్రం జీవన సాఫల్య పురస్కారం అంటూ తెలుగు పదాలు కామ్ప్లికేట్ చెయ్యలేదూ? ’

(విశ్వం గారు వాళ్ళావిడ వైపు తిరిగి) ‘ఏమ్వోయ్...ఇవాళ దిబ్బరొట్టె ఏమిటీ ఇలా వచ్చిందీ?’

(విశ్వం గారి భార్య) ‘ఎప్పటి వలె కాదురా ..నా స్వామీ ఎప్పటి వలె కాదురా’

(లోకనాథం భళ్ళున నవ్వి) ‘చెల్లెమ్మా...భలే పాడావమ్మా...ఒహోహో...ఏమి సమయ స్పూర్తీ ....(విశ్వం గారి వైపు తిరిగి) చూశారా...వాణీ జయరాం  అని మనం అనుకోవడమేమిటీ... చెల్లెమ్మ ఆవిడ పాటనే అందుకోవడమేమిటీ...భలే భలే’

వి: ‘లోకనాథం గారూ...మా ఆవిడ... దిబ్బ రొట్టె ఎప్పటిలా రాలేదని ఇలా పాటతో సమర్ధించుకుంది. ఇంతకీ... ఈ పాట ప్రత్యేకత ఏమిటో తెలుసునా?’

లో: ‘నన్నే పరీక్షిస్తారా? చెబుతా..చెబుతా... అభిమానవంతులు అనే సినిమా అండీ... ఇందులో ఎస్పీ కోదండ పాణి గారు ఒక కొత్త బొంబాయి గాయనిని పరిచయం చేశారు. ఆమె పాడిన తొలి తెలుగు పాట ఈ ఎప్పటి వలే కాదురా. ఆమె పేరే వాణీ జయరాం. ఎన్ని భాషల్లో పాడినా ఆ భాషా పదాలని అర్థం చేసుకుని మరీ పాడేది ఆమె!’

వి: ‘కెవ్వుకేక...మీ వివరణ! అయితే ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఈ పాట సన్నివేశంతో సినిమాకి ఏమీ సంబంధం లేదు. ఒక వేళ ఆ సినిమా నిర్మాతలు ఈ పాట వద్దు అని అనుకోనుంటే ఒక మంచి పాట మిస్ అయ్యేవాళ్ళం. అన్నిటికన్నా..ఒక గొప్ప గాయని ప్రతిభ గురించి మనకి మరి కాస్త ఆలస్యంగా తెలిసేది.’

లో: ‘కొత్త గాయని అనో ఏమో అప్పట్లో ఆవిడకి బహుమతే ఇవ్వలేదు. తరువాత అదే కోదండపాణి గారు ఈమె చేత నవ్వూ నవ్వించూ...నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు ...అనే పాట పాడిస్తే ఆ పాటకి అవార్డ్ వచ్చింది.  సరే..ఇది అలా ఉంచితే ......ఫిలిం ఫేర్ వాళ్ళు పురుషులకో సినీ ఋషులకో జీవన సాఫల్య పురస్కారం ఇస్తారే....ఈసారి ఎవ్వరికీ ఇవ్వలేదా ఏమిటీ?’

వి: ‘ఆగండి బాబూ ఆగండి....తొందర పెట్టే టెలిగ్రాంలా ఏమిటా తొందర?’

లో: ‘టెలిగ్రాం? ఇంకెక్కడిదండీ ఆ లోకం? ఆర్కియాలజీ వాళ్ళకీ, మ్యూజియం వాళ్లకి ఇప్పుడది ముద్దు బిడ్డ. టెలిగ్రాం సర్వీసులు మూసేశారు.  ఉందికదా సెల్లు.....టెలిగ్రాం ఇకపై చెల్లు అని అంటోంది ప్రభుత్వం.’

వి: ‘లోకనాథం గారూ... గుర్తొచ్చింది పాత జోకు..చక్రపాణి గారిది...వింటారా?’

లో: ‘జోకొస్తే వేసేయాలి...వెయ్యనా అని అడక్కూడదు  విశ్వం గారూ’

వి: ‘సరే.వినండి. చక్రపాణి గారిని ఒకాయన కలిసి ‘సార్ ....మీ సినిమాలో మెసేజ్ ఏమిస్తున్నారూ?’ అని అడిగాట్ట. దానికి ఆయన నవ్వుకునీ ‘మెసేజా? మెసేజ్ ఇవ్వడానికి సినిమానే తీయాలా? టెలిగ్రాం ఇస్తే పోలా?’అన్నారట.’

లో: ‘కలకాలం గుర్తుండి పోయే జోక్కొటేషన్ ఇది. రేపు లెటర్స్ ఉండవూ..పోస్టాఫీసులు ఉంటాయో లేదో....పోస్ట్ అని గుమ్మంలో కేక వినిపిస్తుందో లేదో?’

వి: ‘పోస్ట్ ...అనగానే ఉత్తరాలలో కబుర్లు కావాలి ఇంటిల్లిపాదికి ...ఒక దర్శక కవి చిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి..నాకు నువ్వు రాశావా  అని పాట రాశారు. ఏదైనా పత్రిక ఎడిటర్ వారిని అయ్యా నా ఉత్తరం ఏమైందీ? అని అడిగితే వారు పాడే పేరడీ ...చెత్త రాలు బుట్టలో ఉత్తరాలు దొరికాయి...మాకు మీరు రాశారా? – అవునంటారా’

 లో: ‘ఉత్తరాలు అందుకుంటే టెన్షన్ ఉండేది కాదు కానీ ఆ రోజుల్లో టెలిగ్రాం అనగానే గుండె దడ ఉండేది...సరిగ్గా అదే టయిం కి ఎవైడైనా హాచ్చి అని తుమ్మితే ఆ దడ రెట్టింపై  దడదడ లాడించేది. ఏమిటో అప్పట్లో అదంతా ఒక సెన్సిటివ్ లోకం... అయినా ఎటువంటి దడ అనేది లేకుండా ఉండాలంటే గుండె నిండా బాపు గారి బొమ్మలు నింపేయాలండీ...’

వి: ‘కబుర్ల మధ్య బూర్ల లాగ తియ్యటి మాట చెప్పారు లోకనాథం గారూ...ఇందాక ఫిలిం ఫేర్ అవార్డ్స్ అనుకుంటూ ఇంత దూరం వచ్చి ఇప్పుడు బాపు గారి దగ్గర ఆగాం. ఈసారి ఫిలిం ఫేర్ వాళ్ళు మన బాపు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు సుమండీ.  గ్రీట్ ద గ్రేట్ ఆర్టిస్ట్ .... ఆయన ఎంతటి ఉదార స్వభావుడంటే మాకు తెలిసినాయన ఒకాయన కవితా సంపుటి రాసి బాపు గారి బొమ్మ ఒక్కటంటే ఒక్కటి వేయించుకోవాలని తహతహలాడారు. అయితే.. మహానుభావుడు బాపు గారికేమీ ఇచ్చుకోలేని అవస్థ, తాహతుకు మించిన కోరిక. బాపు గారు మనసారా ఆశీర్వదించి, ‘మూడు బొమ్మలు వేసి ఇస్తున్నాను. నచ్చినది వేసుకోండి’ అని రాశారు. బాపు గారి బొమ్మలంటే  నచ్చడమే తప్ప  నచ్చక పోవడమా? ఈయన బాపు గారిచ్చిన బొమ్మలు మూడూ తన సంపుటిలో చూపించుకున్నారు.’

లో: ‘బాపు గారి రేఖా శైలికి ఏది తలవంచె?  మరేదో కాదు ఆ చిత్ర విచిత్రకారుడి కుంచె! చూపించండి మరి..మీ ఎల్పీ రికార్డు కవర్ల మీదున్న బాపు బొమ్మలు..’  (పొట్ట చెక్కలు -బాపు గీత)

వి: ‘లోక నాథం గారూ... ఒకనాడు మన ఎస్వీ ఆర్ నర్తనశాల ద్వారా , తరువాత మన బాపు తన సీతాకల్యాణం ద్వారా విదేశీ కైతట్టు అందుకున్నారు. అదీ కెవ్వుకేక అంటే. అలాగే రాజ్ కపూర్ ‘ఆవారా హూ(‘ పాటతో రష్యను ప్రజను మెస్మరైజ్ చేశారు. అదీ కెవ్వుకేక అంటే.  యూకేలో బ్రిటిష్ ఏషియన్ వీక్లీ  న్యూస్ పేపర్ అయిన ఈస్ట్రన్ ఐ భారతీయ  సినీ సర్వే మీద ఇటీవల ఒక విహంగ వీక్షణం జరిపింది. ఏతావాతా కనిపించింది ఏమిటంటే భారతీయ హిందీ చలనచిత్రాల్లో అతి గొప్ప చిత్రం ఏది అని అడిగినదానికి అధిక శాతం ఓట్లు ‘మొఘల్-ఏ-అజం’ కే పడటం. రెండోది షోలే.  ఇంకో విశేషం- నర్గీస్ నటించిన మదర్ ఇండియా, ఆవారా,అందాజ్  చిత్రాలు కూడా  మన్నన పొందాయి. అన్నిటికీ కెవ్వుకేక అందామా?’

లో: ‘షోలే సినిమా ఎప్పుడూ కెవ్వుకేకే కాబట్టి ఆ గబ్బర్సింగ్ పేరిట తెలుగులో సినిమా రావడం, అందులో కెవ్వుకేక పాట రావడం జరిగాయి. ఇంతకీ ఇవాళ నాకు మాంచి వీడియోలు చూపిస్తున్నారా లేదా? అయినా అదేమిటీ అక్కడ లాంగ్ ప్లే రికార్డ్  ఏదో మెరుస్తోంది ....’

వి: ‘ఇప్పుడు ఆ రికార్డ్ తో పనుంది కాబట్టి ...దుమ్ము దులిపి ....దాన్ని బయటికి తీశాను. అందులో ఉన్నవన్నీ హిందీ పాటలే. రీగల్ కంపెనీ వాళ్ళు వేసిన రికార్డ్ అది. అందులో మొదటి సైడ్ లో ‘ట్విస్ట్’ డాన్స్ మీద ఆధారపడ్డ పాటలున్నాయి. ఇందాక మీరు మా ఊళ్ళో పడుచుంది ..పాటలో ట్విస్ట్ ఉందని చెప్పారే ... ఆ పాట కొద్దో గొప్పో ఆవో టిస్ట్ కరే  అనే హిందీ పాటకి నకలు. భూత్ బంగ్లా అనే సినిమాలోనిది. ఆర్డీ బర్మన్ మ్యూజిక్. రెండో వైపు రాక్ ఎన్ రోల్, చ చ చ, ఫాక్స్ ట్రాట్ డాన్స్ ల మీద ఆధార పడ్డ పాటలున్నాయి.’

లో: ‘వారేవా.. ఇలాంటి రికార్డ్ మనకి తెలుగులో వచ్చిందా?’

వి: ‘లేదు కానీండీ... సినీ జానపద గీతాలతో ఎల్పీ రికార్డ్ వచ్చింది. అందులో అధిక శాతం ..జానపద బ్రహ్మ కొసరాజు గారి గీతాలే.’

లో: ‘చ చ చ ....అనే డాన్స్ ఉన్న పాట లేవిటండీ?’

వి: ‘ఈ ఎల్పీ రికార్డ్ లో ఇచ్చిన పాటలన్నీ చూసేందుకు యూ ట్యూబు సాయపడుతోంది. జంగ్లీ సినిమా ఉందా...అందులో జ జ జ మేరే బచ్ పన్...పాటకి  సైరాబాను చ చ చ డాన్స్ చేసింది.’

లో: ‘చ చ చ ...అని మూడక్షారాలు ఆ డాన్స్ పేరులో ఉన్నాయని కవి గారు జ జ జ ..అనే మూడక్షరాలతో పాట మొదలెట్టడం తమాషాగానే ఉంది. నన్నడిగితే... మీరు ఇప్పటికిప్పుడే కెవ్వు కేక అనిపించే ట్విస్ట్ పాటా, చ చ చ పాటా చూపిద్దురూ.’   

వి: ‘చ చ చ కి ఉదాహరణ గా తేరే ఘర్ కె సామ్నే ఇక్ ఘర్ బనావూంగా పాట కూడా చూడాల్సిందే. గాజు గ్లాసులో కనిపిస్తూ నూతన్ పాడుతుంది.  కెవ్వుకేక ఈ పాట.  వహీదా రెహమాన్  తొలిసారిగా తెలుగు చిత్రం రోజులు మారాయి లో డాన్స్ సన్నివేశంలో కనిపించింది కదా. ఆ జానపదం కూడా చూద్దాం.అదీ కెవ్వుకేక!’

లో: ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నో. కెవ్వుకేక-1  అండీ ఆ పాట. ‘

వి: ‘అదేమిటండోయ్ లోకనాథం గారూ.. మీకూ సీక్వెల్స్  భాష పట్టుపడిందే?  1- అంటున్నారు.  2- కూడా ఉందా?’

లో: ‘అలా రండి ఈ లోకనాథం  ప్రతిభాలోకానికి. కెవ్వుకేక -2 ఎందుకంటే... మాస్టర్ వేణు గారు స్వరపరచిన ఈ పాట విని , ఆ పల్లవి తెగ నచ్చేసి సచిన్ దేవ్ బర్మన్ గారు హిందీలో వినిపించారు కదా...అందుకనీ.’

వి: ‘దేఖ్ నే మే భోలా హై... బాబూ చిన్నన్నా.....ఏమిటో అనుకున్నా ..మీరు మాత్రం భోళా కాదండోయ్. కదిపితే బోలెడు సరుకుంది మీ దగ్గరానూ’

లో: ‘అబ్బే....దిబ్బ రొట్టె తింటే దెబ్బకి మనసు ఉబ్బి తబ్బిబ్బయి ఇలా వెబ్బు అవసరం లేని విషయాలన్నీ తన్నుకొస్తున్నాయి. అంతే’

(విశ్వం గారు భార్యని కేకేసి) ‘వోయ్ ...ఇక మీదట లోకంనాథం గారికి దిబ్బ రొట్టె వద్దు..సున్నుండ ఇద్దాం’

లో: ‘అంటే.. సున్నండ తిని మెదడంతా సున్నా అయిపోవాలనా? అదేం కుదరదు. ఆత్మీయంగా, అభిమానంతో  వండి పెట్టె ఏ వంటకమైనా అతిధికి కెవ్వుకేక అండీ విశ్వం గారూ..’

వి: ‘లోకనాథం గారూ.. పొగిడేసి మా చేత రాక్ ఎన్ రోల్ ఆడించేస్తున్నారు.’

లో: ‘అయ్యయ్యో ..దాని సంగతే మరిచిపోయాను, అవునూ హిందీ పాట ఏదండీ ఈ డాన్స్ కి?’

వి: ‘ఇన మిన డికా..’

లో: ‘ఓహోహో.. ఆ పాటా? ఇన అంటే ఇనుము, మిన అంటే మినప్పప్పు అనుకోవాలేమో.’

వి: ‘నయమే..డికా అంటే డికాక్షన్ అని అనలేదు మీరు. దిబ్బరొట్టె తరువాత కాఫీ ఉండనే ఉంది.’

లో: ‘అదేదో టీవీలో కిశోర్ దాస్ నోరూరే ఐటం తిని ఆహా...అన్నట్టు ఆహా.. ఏమి నా భాగ్యం ...అయితే మూడు  వెస్టర్న్ డాన్సుల నాలుగు హిందీ పాటలు చూడగలుగుతాను అన్నమాట.’

వి: ‘హిందీ చిత్రాల్లో  దక్షిణ భారత నాట్యం కూడా చూడాలని ఉందా మీకు?’

లో: ‘ఉండండుండండి. తెలుగు మాటలు హిందీ పాటల్లో విన్నాం. హిందీ సినిమాలో దక్షిణ నాట్యమా? గుర్తుకు రావడం లేదు’

వి: ‘సున్నుండ ఇవ్వలేదండోయ్. మా తప్పు కాదు. చెబుతా- రాజ్ కపూర్ హీరోగా ఎవిఎం వారు చోరీచోరీ సినిమా తీశారా... అందులో ఎమ్మెల్ వసంతకుమారి గారి ....’

లో: ‘ఆ( ఆ( ఆ( ...గుర్తొచ్చింది... తిల్లానా పాట కదండీ... మరి ఇంకో హిందీ పాట?’

వి: ‘దిబ్బ రొట్టి కి జై. అదీ రాజ్ కపూర్ ఇష్టంగా తన సొంత సినిమాలో పెట్టుకున్న పాట....మేరా నాం జోకర్ లో. పద్మిని నాట్యం, రాజ్ కపూర్ దక్షిణ వేషం.’

లో: ‘బావుందండీ వరస...’

వి: ‘ఆ వరసలో ఏడు పాటలు కుదిరాయి. అన్నీ కెవ్వుకేకలే. ఎలాగైనా అడుగుతారు కాబట్టి ...వాణీ జయరాం గారు పాడిన తొలి తెలుగు గీతానికి  శాస్త్రీయ నాట్యం  జోడిస్తే ఈసారి చూసే ఎనిమిది పాటలు  ఎప్పటి వలె కాదురా నా స్వామీ అని అనిపిస్తాయా లేదా?’

లో: ‘నిజమే...ఇవాళ కెవ్వుకేక ఎప్పటి వలె కాదురా అనిపించింది. వస్తానండి మరి..ఉంటానమ్మా చెల్లెమ్మా’

(ఎప్పటి వలె లోకనాథం,విశ్వం పాత్రలు కల్పితాలే)

-డా. తాతిరాజు వేణుగోపాల్,  27 జూలై 2013 (శనివారం)

0 Comments



Leave a Reply.

    RSS Feed

    Quick Links

    పాటల కొలువు
    • కనులు చూసినా పాటే (Video)
    • కనులు మూసినా పాటే (Audio)
    • కనులు చదివినా పాటే('Read'io)

    అచ్చం అవే 'అచ్చు'లు 
    • తిరుగులేని మాట
    • పాట = తిరుగు టపా

    చిరునవ్వులోని హాయి 
    • బాపురే రమణీయం
    • అచ్చోసిన సొంత కితకితలు
    • అచ్చుకాని సొంత పకపకలు
    • చిత్ర 're' చిత్ర హాస్యం (Video)

    ఆహా ... ఆహహా
    • ప్రతి రాతా ప్రసిద్ధమే
    • ప్రతి ముఖమూ ప్రముఖమే

    Archives

    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013
    March 2013
    February 2013
    January 2013
    December 2012
    November 2012
    October 2012
    September 2012
    August 2012
    July 2012
    June 2012
    May 2012
    April 2012
    March 2012
    February 2012
    January 2012
    December 2011
    November 2011
    October 2011
    September 2011
    August 2011
    July 2011
    June 2011
    May 2011
    April 2011
    March 2011
    February 2011

    Categories

    All
    100 Years Of Film
    11/12/13 Special
    Aadapilla - Aarudra
    Aarudra
    Aatre Aatreya
    Aatreya
    Aatreya Pingali
    Achala Sachdev
    Adi Shankaracharya
    Aluka
    Amitabh
    Andaniki Andam
    Annayya Smruti
    Anr
    Ashwaththama
    Avasarala
    Bapu
    Best Scenes
    Bhanumathi
    Bhisma
    Bhupen Hazarika
    B. Rajanikanta Rao
    C. Narayana Reddy
    Crorepati Aarudra
    C.S.R. Anjaneyulu
    C.V. Raman
    Dasarathi
    Dashavataralu
    Daytime Moonlight
    Dev Anand
    Devulapalli Krishnasastri
    Donga Dochukonuta
    Dusshera
    Earth Book
    Eela
    Festivals
    Film Titles
    Friendship Day
    Gandhi
    Ganesh Chaturthi
    Ghantasala
    Gurajaada - G.K. Venkatesh
    Hanuman Jayanti
    Hindola Uyyala
    Hoyalu
    Hummings
    Independence Day
    Ishtakashtaalu
    Jagjit Singh
    Jalakaalaatalu
    Janmashtami
    Japan Tsunami
    Kedarnath
    Kevvu Keka
    Kodandapani
    Kosaraju
    Krishna Sastry
    K. Vishwanath
    K.V. Mahadevan
    Lakshmi Devi
    Lata Mangeshkar
    Malladi
    Man
    Manna Dey
    Mattu Mandu
    Mehedi Hassan
    M.F. Husain
    Moonlight
    Mullapodi
    Nagayya
    Nataraja Rama Krishna
    November 1st
    N. Rama Mohana Rao
    N.R. Chandoor
    N.T.R.
    Nukala
    Nutan Prasad
    Palagummi
    Pataudi
    P.B. Srinivas
    Pran
    P. Suseela
    Raagam Anuragam
    Rajasulochana
    Ramana
    Rare Singers
    Rare Writers
    R. Balasaraswati Devi
    Reyi Hayi
    Saakee
    Salim - Jaladi
    Samudrala
    Samudrala Junior
    Sankranti
    Sarasvati
    Sare Le Ade Le
    Sathya Sai Baba
    Savitri
    Shivaji Maharaj
    Shri Krishna
    Shrinivas Khale
    S. Janaki
    S.P. Balu - Raja
    S. Rajeswara Rao
    Sri Ramanavami
    Sri Sri
    Suman Etv
    Susarla
    S.V. Rangarao
    Taapi Dharma Rao
    Tanivi
    Telugu
    Telugu Idhi
    Telugu Lipi Bhasha
    Train Travel
    Ugadi
    Ugadi 2013
    Vaali
    Vani Jairam
    Veyi Kanulu
    V. Madhusudana Rao

Powered by Create your own unique website with customizable templates.
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post
  • మునుపటి నా మాట
  • కనులు పాట పాడునని...
    • కనులు చూసినా పాటే... (Video)
    • కనులు మూసినా పాటే... (Audio)
    • కనులు చదివినా పాటే... (Readio)
  • అచ్చం అవే 'అచ్చు'లు
    • పాట = తిరుగు 'టపా'
    • తిరుగులేని మాట
    • తీరైన మాట
  • పొట్ట చెక్కలు
    • బాపురే రమణీయం >
      • బాపు గీత
      • రమణ రాత
    • గోప్యం....మాయ కానీయం >
      • అచ్చోసిన సొంత కితకితలు
      • అచ్చుకాని సొంత పక పకలు
  • బొమ్మ-లాంతరు
    • ఆల్ 'బొమ్మ'లే....
    • తెలిసినదే ... మళ్ళీ
  • Net Post