మునుపటి నా మాట
‘నమో కృష్ణ నమో కృష్ణ’ ‘చిరంజీవ చిరంజీవ’ ‘కృష్ణ పరమాత్మా, జగద్గురూ వందనాలు. ఈ గోకులాష్టమి సందర్భంగా నీకు అభినందనలు’ ‘అంతా బాగానే ఉందా భారతంలో?’ ‘ఏం బాగు కృష్ణా? అంతటా ఓగే. అయినా ఎప్పటిలా పిల్లలంతా ఆనందంగా కింద పడతారు, ఎవడో ఒక్కడు ఉట్టి కొడతాడు.. బహుమానం చేపడతాడు (కనులు చూసినా పాటే- లో ఇటీవల నిన్ను చేరిన మా షమ్మీ చిన్న పిల్లాడిలా చేసిన అల్లరి చూద్దువుగానీ). మళ్ళీ అంతా కలిసి పంచుకునీ మరో ఏడాది కోసం కలలు కంటారు.’ ‘అంతే మరి పిల్లల్లాగే పెద్దలూ రాగ ద్వేషాలూ, కుల మతాలూ, భాషా భేదాలూ లాంటివాటికి దూరంగా ఉండి అంతా కలిసి కట్టుగా ఎదిగితే ‘ప్రేమ’ అనే పెరుగు ‘మమత’ అనే ఉట్టి నుంచి దొరుకుతుంది.’ ‘పిల్లలకైతే సరే- నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా. కానీ పెద్దలే-‘ ‘వారికీ గీతోపదేశం చేసాగా’ ‘కానీ గీత దాటుతున్నారే. అందుకే భక్త కవి పురందర దాసు ‘కృష్ణా నీ బేగనే బారో’ అని కొన్ని వందల ఏళ్ళ క్రితమే కన్నడంలో నిన్ను త్వరగా రమ్మని వేడుకున్నాడు. భక్త కవి అన్నమయ్య ‘ముద్దుకారే యశోద ముంగిట ముత్యము వీడు’ అన్నాడు కదా, అంతటితో ఆగక ‘చిన్నిశిశువు చిన్నిశిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు’ అని అన్నందుకైనా నువ్వు మళ్ళీ ఈ బంగారు భారత భూమిని దర్శించాల్సిందే. కనులు మూసినా పాటే - లో- ఈ మూడు కీర్తనలు వినిపిస్తాను. అది నీకు వేరే చెప్పాలా, గోపాలా?. నువ్వేమో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను అన్నావు. కానీ ఇప్పటి పరిస్థితి ఇక్కడ ఏం బావులేదు. పదాలు తారు మారవుతున్నాయి. దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ మాత్రమె కనిపిస్తోంది. ‘నేను నేనుగా రాను. అదే మీరు నమ్మని విషయం. నా విశ్వ రూపం ఊహించుకుంటారు. నేను చిన్న అణురూపంలోనూ వస్తుంటాను.’
‘తెలుసయ్యా. నీ మాయా జాలం మాకు కొట్టిన పిండే. అణురూపం అన్నావు. అంతవరకూ బాగానే ఉంది. ఎటొచ్చీ అణుశక్తి మొత్తం విశ్వాన్ని అతలాకుతలం చేస్తోంది. దాన్ని మాత్రం అణిచేయ్.’ ‘విశ్వంలో ఏది మంచో ఏది చెడో దేన్నీ దేనికి వాడుకోవాలో ఇంకా తెలియటం లేదు. ఇవన్నీ వేదాల్లో ఘోషించినా వినిపించుకోరే! తిరగేయండి శాస్త్రాలు, ఆ తరువాతే అణ్వస్త్రాలు.’ ‘ మా మహాకవి శ్రీశ్రీ అన్నారు- ఇప్పుడు కావాల్సింది అణ్వస్త్రాలు కాదు అన్నవస్త్రాలు అని. హిందీ లోనూ అంతే- అదే కోరుకుంటారు- రోటీ, కపడా ఔర్ మకాన్’ ‘నిజం చెబుతూ నిజాయీతీగా బతకడం ప్రారంభించండి. స్వేచ్ఛ ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యొద్దు. అదిగో ద్వారక- మీకది సముద్రంలో కలిసి పోయినట్టు అనిపిస్తుంది. ఊరక రాను ఊరూరా తిరిగేందుకు. మానవాళికి మంచి జరిగిందంటే అంతో ఇంతో నేను సాయపడుతున్నాను అని గ్రహించండి.’ ‘నీ లీలలు తెలియనివి కావు ప్రభూ. చిన్నతనంలోనే కస్టాలు అనుభవించావు. ఎందరో నిందలు మోపేరు. ఒకడు బంధువై నానా యాతన పెడితే వాడికి దూరంగా ఉండి వాడి మదమణిచావు. ఒకడు నూరు తప్పులు చేసిందాకా ఆగి చక్రం అడ్డు వేశావు. ఒక పేద మిత్రుడు అటుకులిస్తే ఆరగించి ఆలింగనం చేసుకునీ కరుణించావు. ఒక సతి కాలు దువ్వితే చిరునవ్వుతోనే ఆమె గర్వానికి తిలోదకాలిచ్చావు. ఒక సతి తులశి అర్పిస్తేనే ప్రేమతో ‘తుల’ తూగావు. ఒక సోదరి ‘అన్నా’ అని గోడు గోడున విలపిస్తే ‘నేనున్నా’ అని ఆమె మానాన్ని రక్షించావు. మొత్తం జీవితమంతా ఎన్నో ఘటనల మయం నీది. రోజుకో సారి నిన్ను తలుచుకుంటే చాలు- మనసు ప్రశాంత మౌతుంది. అందుకే – అంటాను నిత్యం మా మనసుల్లోకి ‘కృష్ణా నీ బేగనే బారో’ అని. మాటివ్వు’ ‘ఈ పూట నా మాట- మీ కవి దేవులపల్లి పలికిన మాటకి సమాధానంగా అంటాను – ‘రానే వస్తాడు తీరా తానే వస్తాడు కృష్ణుడు రానే వస్తాడు’- సెలవా మరి. వెన్న మీగడలు పాలు పెరుగు ఆరగించాలి’ ‘ఎందుకో?’ ‘గోపాలుణ్ని కదా- నా దంతా గో-దృష్టే!’ ‘ఎంత అదృష్టవంతుడివి స్వామీ! కన్న దేవకీ, పెంచిన యశోద, నీతో చరించిన గో మాత అంతా తల్లులే నీకు. నీతో నేస్తమాడిన గోకులంది ఎంత భాగ్యం! అంతా ‘గో మయం’ అంటే మా వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అదుగో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. రా చూద్దువు గానీ వాళ్ళ గోవింద సందోహం. కనులు చూసినా పాటే- లో నీ పేరు జపిస్తూ ఎందరో మాల కట్టారు. రా ధరిద్దువు గానీ.' -డా. తాతిరాజు వేణుగోపాల్ 22 ఆగస్ట్ 2011
0 Comments
Leave a Reply. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|